
కర్నూలు బస్సు ప్రమాదం..కాసుల కోసం కక్కుర్తి
పోలీసుల విచారణలో విస్తుగొలిపే వేమూరి కావేరి ట్రావెల్స్ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.
అక్టోబర్ 24, 2025 శుక్రవారం తెల్లవారు జామున కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 19 మందిని పొట్టన పెట్టుకున్న ఈ ఘోర ఘటనపై విచారణకు పోలీసులు ఉపక్రమించారు. పోలీసులు చేస్తున్న విచారణలో ప్రాథమికంగా వేమూరి కావేరి ట్రావెల్స్‌కు సంబంధించిన అనేక అక్రమాలు బయటపడ్డాయి. ప్రమాదానికి గురైన బస్సు, అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిందని తేలింది.
సీటింగ్ బస్సును స్లీపర్‌గా మార్చడం:
ప్రమాదానికి గురైన బస్సు నిజానికి సీటింగ్ సామర్థ్యం ఉన్న బస్సు, కానీ కావేరి ట్రావెల్స్ సంస్థ దానిని అక్రమంగా స్లీపర్ సర్వీస్‌గా మార్చింది. ఇది బస్సు సామర్థ్యానికి మించి మార్పులు చేయడమే అవుతుంది. పన్నుల ఎగవేత కోసం అక్రమ రిజిస్ట్రేషన్ కు పాల్పడ్డారు. సంస్థ ప్రధాన కార్యాలయం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో పన్నులు అధికంగా ఉంటాయనే ఉద్దేశంతో డయ్యూ-డామన్ లో రిజిస్ట్రేషన్ చేయించారు. డయ్యూ-డామన్ లో ఒక సీటుకు రూ.450 పన్ను ఉండగా, స్లీపర్ సీటుకు రూ.800 మాత్రమే పన్ను వసూలు చేస్తారు. అదే తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక సీటుకు రూ.4500, స్లీపర్ సీటుకు రూ.12,000 పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఆల్ ఇండియా పర్మిట్ దుర్వినియోగం
డయ్యూ-డామన్ లో 'ఆల్ ఇండియా పర్మిట్' తీసుకున్న తర్వాత, ఒడిశాలోని రాయగడలో బస్సు ఫిట్‌నెస్, ఆల్టరేషన్ చేయించుకుంది. రాయగడ అధికారులు 43 సీట్ల సీటింగ్ పర్మిషన్ మాత్రమే ఇచ్చినా, కావేరి ట్రావెల్స్ సంస్థ దానిని స్లీపర్‌గా మార్చి అక్రమ రవాణాకు పాల్పడింది.
గతంలోనూ అనేక ఉల్లంఘనలు
ఈ ప్రమాదానికి గురైన బస్సుకు గతంలో 16 ట్రాఫిక్ ఉల్లంఘనల కింద రూ.23,000 జరిమానా విధించినట్లు తేలింది. అయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా యథావిధిగా బస్సును నడిపారు. ఈ ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు పరిహారం, గాయపడిన వారికి చికిత్స అందిస్తామని ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. ఈ ఘటన రవాణా శాఖలో ఉన్న లోపాలను వెలుగులోకి తెచ్చింది అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

