
కరేడు రైతాంగం కంట కన్నీరెందుకంటే...
నెల్లూరు జిల్లా కందుకూరు సమీపాన ఉన్న పచ్చని పంటల కరేడు నుంచి కాంతి నల్లూరి గ్రౌండ్ రిపోర్ట్. ముగింపు.
గ్రామస్థుల తో మాట్లాడుతున్న ycp కందుకూరు ఇంచార్జీ బుర్రా మధుసూదన్ యాదవ్. నెల్లూరు జిల్లా కరేడులో ప్రభుత్వం చేపడుతున్న 8 వేల ఎకరాల పచ్చని పంటపొలాల సేకరణకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల ఆందోళన మీద రిపోర్టు. ఇది మూడో భాగం. చివరి భాగం.
రాస్తారోకో, గ్రామ సభ తర్వాత తాత్కాలికంగా భూసేకరణ ఆగినా పూర్తిగా మాత్రం ఉసంహరణ జరగలేదు. సబ్ కలెక్టర్ శ్రీపూజ ఇండోసోల్ పరిశ్రమ ఏర్పాటు కోసం కరేడు గ్రామంలో భూసేకరణను రైతులకు అర్థమయ్యేలా వారి సందేహాలు నివృత్తి చేసి ప్రజల సహకారంతోనే ముందుకు వెళతామని చెప్పారు. కొందరిలో భూములకు సరైన ధర రాదన్న ఆందోళన, మత్స్యకారుల్లో చేపలవేటకు అవకాశం ఉండదేమో నన్న భయాందోళన, కాలనీలకు పునరావాసం ఎక్కడ చూపిస్తారు అన్న సందేహాలు నెలకొన్నాయని, వీటన్నిటికీ స్పష్టమైన హామీలు ఇవ్వడం ద్వారా వారిలో నమ్మకం కల్పించి, వారి ఆమోదంతోనే భూసేకరణ ప్రక్రియను కొనసాగించనున్నట్లు చెప్పారు.
నెల్లూరు జిల్లా కలెక్టర్ గారైన ఒ ఆనంద్ గారు 4800 ఎకరాలకు మాత్రమే ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చామని, ఇప్పటికైతే అంతకుమించి భూములను తీసుకోమని స్పష్టం చేశారు. అది కూడా మూడు పంటలు పండే భూములను తీసుకోవడం లేదన్నారు. మూడు హ్యాబిటేషన్లు మాత్రమే ఖాళీ అవుతాయని, మిగిలిన హాబిటేషన్ లో జోలికి వెళ్ళమని తెలిపారు. పంట భూములకు ఎకరాకు 12: 5లక్షలు, కొబ్బరి చెట్లు ఉన్న భూములకు ఎకరాకు 17.5లక్షలు,జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూములకు 62.5 లక్షలు గా భూసేకరణ చట్ట ప్రకారo భూములకు పరిహారం నిర్ణయించామని చెప్పాడు.
ఇక్కడో చిన్న విషయం గమనించాలి. ప్రస్తుతానికి 4800 ఎకరాలు మాత్రమే అన్నారు. అంటే తర్వాత మిగతా నాలుగువేల ఎకరాలు తీసుకుంటాము అని మనం అర్థం చేసుకోవాలి. ఈ 12, 17 లక్షలకు తూర్పు తీర ప్రాంతంలో ఒక్క ఎకరం కూడా రాదు.. పైగా ఇంత సారవంతమైన, నీటి వసతి ఉన్న మూడు పంటలు పండే భూములు ప్రకాశం, నెల్లూరు జిల్లాలోనే లేవు. 15 అడుగులలో సాగు, తాగు నీరు దొరికేవి కాదు. అమ్ముకున్న రైతులు ఆ డబ్బులు తీసుకెళ్లి ఎక్కడ కొనుక్కుంటారు. అంటే వర్షాధార పంటలు పండే మెట్ట భూములున్న దూర దూర ప్రాంతాలైన కననిగిరి, ఓలేటివారిపాలెం, దొనకొండ వైపు వెళ్లాలి. అక్కడా ఈ రెట్లకు భూములు రావు.
కనిగిరి, దొనకొండ, గుడ్లూరు, లింగసముద్రం, వలేటివారి పాలెంలలో, నాయుడుపేట నుండి వెంకటగిరి పోయే దారిలో నేలకూర్లో లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. కావలి నుండి నెల్లూరుకి వెళ్లే నేషనల్ హైవే 16 పక్కనే, ఇఫ్కో భూములు కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. కనిగిరి పక్కన పామూరు నుండి మాలకొండకు వెళ్లే మార్గంలో మన్మోహన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కు 13,500 ఎకరాలు కేటాయించారు. అక్కడ ఫ్యాక్టరీల్లేవ్ ఉద్యోగులు లేరు. ఈ భూములన్నీ ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నాయి. ఈ భూములలో ఇండోసోల్ సోలార్ పలకల తయారీ పెట్టుకోవచ్చు. కాకినాడ ఎస్సిజెడ్ భూము లేమయ్యాయి!? లేపాక్షి భూములు ఏమయ్యాయి. అక్కడ 30 వేల ఉద్యోగాలు ఏమయ్యాయి. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు దిక్కేలేదు.
ఇన్ని ప్రభుత్వ భూములు ఉండగా తూర్పు తీరప్రాంత భూములే ఇండిసోల్ కు ఎందుకు ఇస్తున్నారు అంటే రామాయపట్నం పోర్ట్ బేస్డ్ గా ఇండస్ట్రియల్ కారిడార్ ఉండాలి అని. పోర్ట్ బేస్డ్ అంటే పోర్టు పక్కనే ఇవ్వాల్సిన పనిలేదు. 30..40 కిలోమీటర్ల దూరంలో ఇచ్చి మంచి రోడ్లు వేస్తే ట్రాన్స్పోర్ట్ కి ఇబ్బంది ఉండదు. పోర్ట్ బేస్డ్ అని పైకి చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది. ఇక్కడ భూములను ఇండోసోల్ కంపెనీకి లీజ్ పద్ధతిగా కాకుండా రిజిస్ట్రేషన్ పద్ధతిలో ఇచ్చి, ఆ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వేలకోట్ల రూపాయలు తీసుకోవాలి అని ఒకటి అయితే, ఇస్తారంగా ఉన్న జలాశయాల లాంటి చెరువులలో నీరు నిలవ చేసుకోవచ్చు. భవిష్యత్తులో భూముల్లో కార్పొరేట్ వ్యవసాయం చేయవచ్చు. రామాయపట్నం పోర్టుకు వచ్చే స్మగుల్డ్ వస్తువుల ట్రాన్స్పోర్ట్ మరొకటి.
సోలార్ పలకల కోసం ఇంత విధ్వంసం అవసరమా
సౌర విద్యుత్తు తయారీలో వినియోగించే సౌర పలకలు 6 అంచల ప్రక్రియ. మూల ఖనిజం క్వార్ట్జ్. ముఖ్యమైన ముడి పదార్థం పోలి సిలికాన్.క్వార్ట్జ్ నుంచి పోలీ సిలికాన్ తయారుచేసి దాని నుంచి అంతిమంగా పలకలు (మాడ్యూల్స్) తయారు చేస్తారు. పోలీ సిలికాన్ లో చైనాది గుత్తాధిపత్యం. ఆ దేశం ఇష్టా ఇష్టాలను బట్టి మిగతా దేశాలకు ఈ ముడిపదార్థం అందుబాటులో ఉంటుంది. సౌర పలకలు తయారు చేయడానికి వివిధ టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. మనం చెప్పుకున్నది సిలికాన్ ఆధారిత టెక్నాలజీ. కరేడు పరిశ్రమ కూడా అదే టెక్నాలజీ ఆధారంగా ఉంటుంది అని ఈసంస్థ పేర్కొంది. ఆరు అంచెల ప్రక్రియలో ప్రతి అంచెకి ఒక రకమైన టెక్నాలజీ వాడాలి. ఇక్కడ ఇండోసోల్ ఏ టెక్నాలజీ వాడుతుందనే విషయమే తెలియదు. ఈ సమాచారం ప్రభుత్వం దగ్గరైన ఉందా?
రైతుల ఆందోళన వల్ల సముద్రతీరంలో కూడా పోలీసులను మొహరించారు
సౌర విద్యుత్ ఉత్పత్తి కాలుష్యరహితమే కానీ, ఆ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన పలకల ఉత్పత్తి మాత్రం కాలుష్య రహితం కాదు. సిలికాన్ ఆధారిత పలకల ఉత్పత్తి, సిలికాన్ శుద్ధి అనేది చాలా కాలుష్యకారక ప్రక్రియ అని అనేక పరిశోధనలు ఇప్పటికే తెలియజేశాయి. సౌర విద్యుత్ వాడకం ద్వారా తగ్గే కర్బన ఉద్గారాలు ఈ పలకల ఉత్పత్తి ద్వారా తిరిగి పెరుగుతాయి. (ఇలా చెప్పుకుంటూ పోతే అనేక లోపాలు విధ్వంసాలు కనిపిస్తాయి)
అంతేకాక ఇండోసోల్ భూదాహం ఇక్కడితో ఆగిపోలేదు. ఇండోసోల్ సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి, పంపుడు స్టోరేజీ ప్రాజెక్టుల కోసం కర్నూలు, కడప, నంద్యాల, ప్రకాశం, నెల్లూరు ఐదు జిల్లాలలో 35000 నుంచి 40 వేల ఎకరాల పై మాటే. ఈ ఐదు జిల్లాల్లో 30 గ్రామాల్లో విస్తరించి ఉన్న భూమి ఇది. పైగా ఇండోసోల్ అడిగే వేల ఎకరాల భూమి అవసరం లేదనేదానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మన దేశంలో గుజరాత్లో 20 గిగావాట్ల సామర్థ్యం గల ఇటువంటి పరిశ్రమ వందల ఎకరాల్లోనే ఉంది. ఇక్కడ 8400 ఎకరాల భూమి అవసరమా? పైగా బంగాళాఖాతం తీరంలో మూడు పంటలు పండే భూములలో ఇంత విధ్వంసం అవసరమా?
జగన్ కాలంలో జగన్ ముద్దుల కంపెనీగా ఉన్న ఇండోసోల్ ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఎందుకు ముద్దు ముద్దు కంపెనీగా మారింది? 24 ఎలక్షన్లలో 40 కోట్ల ఎలక్షన్ల బాండ్లు కోసం ఇచ్చింది అనేది బహిరంగ రహస్యం. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పులివెందుల కంపెనీ, మాయ, మోసపు కంపెనీ, బినామీ కంపెనీ, ఆ కంపెనీకి అన్ని వేల కోట్లు పెట్టే సత్తా లేదని జాతీయ కన్వీనర్ అయినా నారా లోకేష్ అన్న మాటలు అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో వచ్చింది. ఇప్పటికి యూట్యూబ్లో ఉంది.
పార్టీ, తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో పుట్టిన పార్టీ, ప్రజల కోసం అవినీతిని ప్రశ్నించడానికి పుట్టినపార్టీ, యువజనల కోసం పుట్టినపార్టీ, ఎర్ర జెండా పార్టీలు ప్రజలను మాయలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాయి తప్ప ఈ భూదాహాన్ని ఆపడానికి ప్రయత్నించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ దరిదాపులకే పోలేదు.
కరేడు రైతాంగం ఉద్యమం తీరుతెన్నులు
అన్నం పెట్టే రైతులు, మట్టి మనుషులు కూలీలుగా మారబోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్చార్జిలు వివిధ రకాల ముసుగులలో అండగా ఉంటాం అంటూనే రైతుల, కూలీల, మాత్యకారుల, ఎస్సీల,గిరిజనుల ఐకమత్యాన్ని దెబ్బతీస్తున్నారు.
గ్రామసభ తర్వాత 12..7..25న నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి మినీ హాల్లో వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కరేడు గ్రామంలో భూసేకరణ ఆపివేయాలని తీర్మానించారు. 13..7..25న 16 హ్యాబిటేషన్ లోని గ్రామస్తులందరూ సమావేశమై జేఏసీగా ఏర్పడి భూపరిరక్షణకు పోరాటం చేయాలి అని తీర్మానించారు. జేఏసీ కన్వీనర్ గా మిరియం శ్రీనివాసులను, సభ్యులుగా 260 పైగానే ఎన్నుకున్నారు. గ్రామంలోని చెన్నకేశవ స్వామి గుడిలో భిన్నభిప్రాయాలు, భిన్న రాజకీయాలు ఉన్నప్పటికీ గ్రామ అభివృద్ధికి, భూపరిరక్షణకు చివరి వరకు ఐకమత్యంగా ఉండి పోరాడుతామని, విజయం సాధించే అంతవరకు గ్రామo ను రాష్ట్ర స్థాయిలో గుర్తించేలా ఉద్యమాలు చేయాలి అని ప్రతిజ్ఞ చేశారు.
*************
కాంతి నల్లూరి 'కరేడు గ్రౌండ్ రిపోర్ట్' రెండవ భాగం ఇక్కడ చదవండి
*************
ఇండోసోల్ జగన్ బినామీ అని ఊరంతా నమ్ముతున్నారు
ఇంత పకడ్బందీగా ప్రమాణం చేసిన మరునాడే ఎమ్మెల్సీ తుమాటి మాధవరావుగారు కరేడు, చుట్టుపక్కల 18 గ్రామాలు తిరిగి, మీకు నోటీసులు వచ్చాయా? రానప్పుడు భయమెందుకు? ప్రభుత్వాలు మూడు పంటలు పండే భూములను తీసుకోదన్నారు. భూసేకరణకు ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల, అసెంబ్లీలో మీ తరఫున గొంతేత్తుతానన్నారు. ప్రజలకు అండగా ఉండి దానిని అడ్డుకుంటామన్నారు. ఇక్కడ ఓ చిన్న విషయం గమనించాలి. కొన్ని గ్రామాల ప్రజలకు నోటీసులు రాలేదు. మూడు దశల్లో వస్తాయని ప్రజలు అంటున్నారు. పేపర్లలో ఇచ్చిన ప్రకటనల్లో, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇస్తున్న ప్రకటనలో భూసేకరణ ఆగిపోలేదని, రైతులకు నచ్చచెపుతా మని, ప్రస్తుతానికి 4000 ఎకరాలు మాత్రమే తీసుకుంటామని, వాటి నష్టపరిహారాలను కూడా ఎంతెంత చెల్లిస్తాము అనేది చెబుతున్నారు. నోటీసులు రాలేదు కదా, మూడు పంటలు పండే భూములను తీసుకోరు అని ఎమ్మెల్సీ గారు చెబుతున్నారు. దీనిలో దేన్ని ప్రజలు నమ్మాలి?
ఎమ్మెల్సీ గారు తిరిగిన మరసటి రోజే వైసీపీ కందుకూరు ఇంచార్జి బుర్ర మధుసూదన్ యాదవ్ గ్రామాలలో పర్యటించి భూసేకరణను అడ్డుకుంటామని, వైసిపి ప్రభుత్వ హయాంలో రావూరు, చేవూరు ప్రాంతంలోనే ఇండోసోల్ కు భూములు ఇచ్చామని, కరేడు భూములతో మాకు సంబంధం లేదని, కరేడు రైతులకు అండగా ఉంటామనిచెప్పేరు.
గ్రామస్థులతో మాట్లాడుతున్న వైసిపి కందుకూరు ఇంచార్జీ బుర్రా మధుసూదన్ యాదవ్.
కొంతమంది రైతులను తీసుకెళ్లి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో సమావేశం ఏర్పాటు చేశాడు. ఇండోసోల్ కంపెనీ పులివెందులలో పుట్టినది, జగన్ హయాంలో స్మార్ట్ మీటర్ల నుండి అన్ని ప్రభుత్వ టెండర్లను పొందినది అని, జగన్ బినామీ అని కొంతమంది గ్రామస్తుల అభిప్రాయం. జగన్ గారు కరేడు వస్తానని, అండగా ఉంటానని ప్రకటించారు. భూములు ఇవ్వమని జగన్ గారితో స్పష్టంగా చెప్పామని రైతులు ప్రకటించారు. పులివెందుల విశ్వేశ్వర్ రెడ్డి కి చెందిన ఇండోసోల్ వ్యతిరేకంగా, కరేడు భూసేకరణ ఉద్యమానికి అండగా నిలబడతారా? అని మనం ఆలోచించాలి.
రైతులు జగన్తో కలవగానే కరేడు ఉద్యమానికి మద్దతుగా నిలిచి, రహదారి దిగ్బంధనం రోజు పోలీసుల నుండి తప్పించుకొనుటకు జాతీయ రహదారిలో కాకుండా సముద్రమార్గాన వచ్చి మద్దతుగా ముందు నిలిచిన బిసివై పార్టీ అధినేత రామచంద్రయాదవ్ కరేడు ఉద్యమం నుండి తప్పుకుంటునాన్నని సంచలన ప్రకటన చేశారు. ‘రైతులు వెళ్లి జగన్ ను కలవడం తప్పు. ఈ సమస్యకు మూల కారణం జగనే. కరేడు రైతులు దొంగచేతికి తాళాలు ఇచ్చారు. నా ఉద్యమాన్ని, నా కష్టంను రైతులు నీరు కార్చారు,’ అని ప్రకటించారు. రామచంద్ర యాదవు ఇలా ప్రకటించారుగా అని కన్వీనర్ను అడగగా, అతనిని కూడా కలసి మా పరిస్థితిని తెలియజేసి నచ్చ చెబుతామని, ఉద్యమానికి తన మద్దతును కోరుతామని చెప్పారు.
జగన్ తో రైతులు కలవగానే కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావుగారు పోలీసుల బందోబస్తుతో గ్రామాలను పర్యటించి ప్రస్తుతానికి భూములను తీసుకోo, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతాను అని చెప్పాడు. పాలక, ప్రతిపక్షాలు ఇలా ఉంటే సిపిఎం, సిపిఐ లాంటి పార్టీలు సొంత ఎజెండాతో కాకుండా పాలక ప్రతిపక్షాలను అనుసరిస్తున్నాయి.
జేఏసీ ఏర్పడిన తర్వాత సమావేశం ఏర్పాటు చేసి అందరి ఆమోదంతో ప్రతిపక్ష నాయకుడిని, పాలక పక్ష నాయకుల్ని కలవాలి. కానీ ఇక్కడ అలా జరగలేదని గ్రామస్తులలో ఓవర్గం అంటుంది. జగన్ కారణం కాబట్టి మేము నమ్మలేము అని తెలుగుదేశ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. మన బలమే చాలదు పాలకపక్షాలను, వామపక్షాలను ప్రజాసంఘాలను కలుస్తాం. ఉద్యమానికి మద్దతు కోరుతాం అని మరో వర్గం అంటుoది. ఇన్ని బలహీనలతో ఉద్యమం ఉంది. అమరావతి రైతాంగo, ఢిల్లీ రైతాంగo , కర్ణాటక రైతాంగం ఉద్యమాలలా కరేడు రైతాంగం ఉద్యమం కొనసాగించి విజయం సాధించగలదా!? ఉద్యమాలు బలంగా ఉంటే అక్కడకే పాలక, ప్రతిపక్ష వామపక్షాలు వస్తాయి. వెళ్లి వారిని కలవాల్సిన పరిస్థితి ఉండదు.
కరేడు ప్రజలు ఉద్యమించగలరా?
ఉద్యమం బలంగా ఉంటే పాలకపక్షం వెనక్కి తగ్గుతుంది. ప్రతిపక్ష, వామపక్ష, ప్రజా సంఘాలన్నీ మద్దతుగా నిలుస్తాయి. ఈ భూసేకరణ వ్యతిరేక ఉద్యమం విజయవంతం కావాలంటే అక్కడ ప్రజలు గట్టిగా నిలబడి, రకరకాల రూపాలలో పోరాటాలు, రహదారిదిగ్బంధాలు చేయాలి. బయట నుండి ఎవరు వచ్చినా అది మద్దతు కిందకే వస్తుంది. ఈ కరేడు భూసేకరణ నుండి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలంటే అక్కడి ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమించాలి. దీనికి సరైన న్యాయకత్వం ఉండాలి. యుద్ధానికి సైన్యం ఎంత అవసరమో! వారిని నడిపే నాయకత్వం కూడా అవసరం. ఇక్కడ విస్తృతమైన సైన్యం ఉంది. బలమైన, నైపుణ్యమున్న, పోరాట పటిమగలిగిన నాయకత్వమే కరువు. పాట, మాట, ఆట, డోలు, గొంగడి వేసుకొని గ్రామ గ్రామాన తిరిగి ప్రజలను చైతన్యవంతం చేస్తేనే భూసేకరణ వెనక్కి పోతుంది. లేదా తమ భూముల్లోనే రైతులు, మట్టి మనుషులు కూలీలగా మారాల్సి వస్తుంది. స్వేచ్ఛగా బ్రతికే ఎగువ, మధ్య, దిగువ రైతులు భూములతో పాటు (మనం కూడా) ప్రకృతి, పర్యావరణం కోల్పోతారు. వ్యవసాయ కూలీలకు ప్రస్తుతం ఉన్న 8 గంటల పని విధానం పోయి, కార్పొరేట్ కంపెనీలలో 12 గంటల పనితో రు 10 లేదా 12 వేలకే గ్యారెంటీ, వారంటీ లేని వెట్టిచాకిరి చేయాల్సి వస్తుంది.
ఆద్మీ పార్టీ కేజ్రీవాల్, పర్యవారణ ఉద్యమ నాయకురాలు మేధా పట్కర్, మాజీ ఐఎఎస్ అధికారి దేవసహాయం వంటి వారిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మీటింగ్ లు పెడతాము అంటున్నారు.
ఈ కర్షక ఉద్యమానికి కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, మేధావి వర్గమంతా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది.