వైసీపీపై కాపు నేతలకు నమ్మకం పోయిందా?
x

వైసీపీపై కాపు నేతలకు నమ్మకం పోయిందా?

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కు అత్యంత నమ్మిన బంట్లుగా ఉన్న కాపు నేతలు వరుసగా రాజీనామా చేస్తుండటం ఆంధ్రా రాజకీయాల్లో ఇపుడు హాట్‌ టాపిక్‌.


ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. ‘వైనాట్‌ 175’ నినాదంతో ఎన్నికల రణక్షేత్రంలోకి దిగిన ఆ పార్టీ 11 స్థానాలకే చాపచుట్టేసింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీని వీడేవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకట రమణారావు, బీద మస్తాన్‌ రావు వైసీపీకి రాజీనామా ప్రకటించారు. అలాగే ఎమ్మెల్సీల పోతుల సునీతతోపాటు పలువురు మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు వైసీపీకి రాజీనామాలు చేశారు.

ఇప్పటికే ముగ్గురు కాపు నేతల రాజీనామా..

అయితే వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కు అత్యంత నమ్మిన బంట్లుగా ఉన్న కాపు నేతలు కూడా వరుసగా రాజీనామా చేస్తుండటం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఇప్పటికే కాపు నేతల్లో గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య, మాజీ డిప్యూటీ సీఎం, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని (వంశీకృష్ణ శ్రీనివాస్‌), తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు వీరి బాటలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పేరు కూడా వినిపిస్తోంది.

ఇప్పుడు రాజీనామా బాటలో సామినేని ఉదయభాను..

సామినేని ఉదయభాను జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి మొత్తం మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు ప్రభుత్వ విప్‌ గా పనిచేశారు. 1999లో తొలిసారి ఆయన కాంగ్రెస్‌ పార్టీ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత 2004లోనూ గెలుపు రుచిచూశారు. 2009లోనూ గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలనుకున్నా కుదరలేదు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు.

ఇక 2014లో ఆయన వైసీపీలోకి వచ్చారు. అయితే పరాజయమే పలకరించింది. 2019లో వైసీపీ తరఫున సామినేని ఉదయభాను విజయం సాధించారు. మొత్తం మీద మూడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విప్‌ గా పనిచేశారు.

ఉదయభాను వైసీపీని వీడటం అందుకేనా?

ఇటీవలి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయభానును జగ్గయ్యపేట నుంచి కాకుండా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని జగన్‌ భావించారని టాక్‌ నడిచింది. అలాగే విజయవాడ ఎంపీ స్థానానికి కూడా ఉదయభాను పేరును పరిశీలించారు. మరోవైపు ఉదయభాను పోటీ చేస్తూ వచ్చిన జగ్గయ్యపేటకు ఏపీ మహిళా కమిషన్‌ మాజీ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పేరును జగన్‌ ఇటీవలి ఎన్నికల కోసం పరిశీలించారు. దీంతో సహజంగానే ఉదయభాను అసంతృప్తి చెందినట్టు ప్రచారం జరిగింది.

కుమారుడి భవిష్యత్‌ కోసమే..

సామినేని ఉదయభాను ఇప్పుడు తన కుమారుడు భవిష్యత్‌ కోసమే జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందులోనూ మొన్నటి ఎన్నికల్లో కాపు సామాజికవర్గమంతా జనసేనతో నడవడంతో ఆ పార్టీలో ఉంటే తనకు రాజకీయ భవిష్యత్‌ ఉంటుందని ఆయన భావిస్తున్నారని చెబుతున్నారు. ఉదయభాను ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకమైన కాపు సామాజికవర్గానికి చెందినవారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కుటుంబంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2009లో జగ్గయ్యపేటలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉదయభాను తరఫున ప్రచారానికి సినీ నటుడు రాజశేఖర్, ఆయన భార్య జీవిత వచ్చారు. ఈ క్రమంలో వారిద్దరూ నాడు ప్రజారాజ్యం పార్టీ అధినేతగా ఉన్న చిరంజీవిపై విమర్శలు చేస్తుండటంతో ఉదయభాను అడ్డుకున్నారు. తన తరఫున ప్రచారం చేయకపోయినా ఫరవాలేదని.. చిరంజీవిని విమర్శించవద్దని వారిని కోరారు. దీంతో జీవిత, రాజశేఖర్‌ అలిగి తమ ప్రచారాన్ని ఆకస్మాత్తుగా ముగించుకుని వెళ్లిపోయారు.

దక్కని మంత్రి పదవి..

కాగా 2019లో ఉదయభాను జగ్గయ్యపేట నుంచి గెలిచాక ఆయన పేరు కూడా మంత్రి పదవికి వినిపించింది. కాపు సామాజికవర్గంలో కీలక నేతగా ఉండటం, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది సీనియర్‌ గా ఉండటం, వైఎస్సార్‌ అనుచరుడిగా గుర్తింపు ఉండటంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని చర్చ జరిగింది. అయితే పవన్‌ కళ్యాణ్‌ ను ఘాటుగా తిట్టాలని వైసీపీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాలను ఉదయభాను పాటించలేదు. అందుకే ఆయనకు మంత్రి పదవి దక్కలేదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ ను ఘాటుగా విమర్శించడంలో ముందున్న పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్‌ వంటి కాపు నేతలకు మంత్రి పదవులను జగన్‌ కట్టబెట్టారు. దీంతో ఉదయభానుకు మంత్రి పదవి విషయంలో నిరాశే ఎదురైంది.

నియోజవర్గంలో హడావుడి

ప్రస్తుతం జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉదయభాను అనుచరులు హడావుడి చేస్తున్నారు. సామినేని ఉదయభాను జనసేనలో చేరికను పురస్కరించుకుని పెద్ద ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారని తెలుస్తోంది. అలాగే నియోజకవర్గవ్యాప్తంగా పెద్ద ఎత్తున జనసేన జెండా దిమ్మెలను ఏర్పాటు చేస్తున్నారని చెబుతున్నారు.

మరికొద్ది రోజుల్లో జనసేనలో చేరిక!

సామినేని ఉదయభాను వైసీపీని వీడటానికి నిర్ణయించుకున్నారని టాక్‌ నడుస్తోంది. సెప్టెంబర్‌ 22 లేదా 25 తేదీల్లో ఆయన జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరతారని భారీగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్‌ తో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని చెబుతున్నారు. ఉదయభానును ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తారని అంటున్నారు.

ఆ టీడీపీ ఎమ్మెల్యేలో ఆందోళన!

మరోవైపు వైసీపీ నేత సామినేని ఉదయభాను జనసేన పార్టీలో చేరతారనే వార్తల నేపథ్యంలో జగ్గయ్యపేట టీడీపీ ఎమ్మెల్యే రాజగోపాల్‌ శ్రీరాం (తాతయ్య) ఆందోళన చెందుతున్నారని చెబుతున్నారు. ఆయన ఇటీవలి ఎన్నికల్లో ఉదయభానుపై గెలుపొందారు. 2009, 2014ల్లోనూ ఉదయభానుపై రాజగోపాల్‌ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఉదయభాను జనసేనలోకి వస్తే జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఆయనకు, తనకు ఆధిపత్య పోరు నడుస్తుందనే ఆందోళనలో తాతయ్య ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పవన్‌ కళ్యాణ్‌ ను కలిసి తన ఆందోళనను ఆయన దృష్టికి తెచ్చే ఉద్దేశంతో ఉన్నారని చెబుతున్నారు.

Read More
Next Story