తెలంగాణలో కాపురం.. ఆంధ్రలో రాజకీయం!
x

తెలంగాణలో కాపురం.. ఆంధ్రలో రాజకీయం!

అమరావతి టు హైదరాబాద్ ప్రత్యేక విమానాలలో చక్కర్లు కొడుతూ ఆంధ్ర ప్రజలపై అధికంగా ఆర్థిక భారాన్ని మోపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


"ఓట్లు ఇక్కడ.. బస అక్కడ! పాలన ఇక్కడ.. కుటుంబం అక్కడ!" - ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దశాబ్ద కాలంగా వినిపిస్తున్న ఈ విమర్శలు ఇప్పుడు 2026 నూతన సంవత్సర వేళ మరోసారి ఉగ్రరూపం దాల్చింది. రాష్ట్రం విడిపోయి 11 ఏళ్లు గడుస్తున్నా, రాజధాని అమరావతిలో అద్భుతమైన భవనాలు నిర్మిస్తామని చెబుతున్నా.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ సహా మెజారిటీ మంత్రుల కుటుంబాలు ఇప్పటికీ పొరుగు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే స్థిరపడటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా నూతన సంవత్సర వేళ కూడా ఈ ముగ్గురు కీలక నేతలు ఏపీలో కనిపించకపోవడం, హైదరాబాద్ లేదా విదేశీ పర్యటనల్లో ఉండటంతో.. "ఆంధ్ర అభివృద్ధి చెందాలంటే నేతలు ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉండాలి కదా?" అన్న సామాన్యుడి ప్రశ్న ఇప్పుడు రాజకీయ విమర్శలకు పదును పెడుతోంది.

11 ఏళ్ల విభజన.. తీరని ‘హైదరాబాద్’ వ్యామోహం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. దీంతో క్యాంపు కార్యాలయాలే శరణ్యంగా మారాయి. సీఎం నుంచి మంత్రుల వరకు విజయవాడ, గుంటూరులో కేవలం ‘క్యాంపు కార్యాలయాల’ కేంద్రంగానే పాలన సాగిస్తున్నారు. వారు నివసించేది మాత్రం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లేదా బంజారాహిల్స్ ప్రాంతాల్లోని తమ పాత నివాసాల్లోనే. నేతల పిల్లలు, వ్యాపారాలు, కుటుంబ సభ్యుల సామాజిక జీవితం అంతా హైదరాబాద్‌తోనే ముడిపడి ఉంది. ఏపీలో రాజకీయం ముగియగానే వీకెండ్స్‌లో లేదా పండగలకు అందరూ పక్క రాష్ట్రానికే క్యూ కడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి పదకొండేళ్లు అవుతున్నా రాజకీయ నాయకుల తీరు మారడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ప్రత్యేక విమానాలు - హెలికాప్టర్ల ‘చక్కర్లు’

ప్రజాధనంతో నిత్యం సాగుతున్న ఈ ప్రయాణాలు ఆర్థికంగా రాష్ట్రానికి భారంగా మారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. గన్నవరం టు బేగంపేటకు చక్కర్లు కొడుతున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల కోసం తరచుగా గన్నవరం విమానాశ్రయం నుండి హైదరాబాద్‌లోని బేగంపేట లేదా శంషాబాద్ విమానాశ్రయాలకు ప్రత్యేక విమానాలు, చార్టర్డ్ ఫ్లైట్లు నడుస్తున్నాయి. దీంతో కోట్ల రూపాయల ఖర్చు అవుతోందనే విమర్శలు ఉన్నాయి. ఒకవైపు రాష్ట్రం ఆర్థిక లోటులో ఉందని చెబుతూనే, కేవలం ఈ ‘హైదరాబాద్-అమరావతి’ షటిల్ సర్వీసుల కోసం సంవత్సరానికి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

అతిథి పాలకులు!

ఈ నేపథ్యంలో వీళ్లు అతిథి పాలకులయ్యారని విపక్ష పార్టీలైన వైఎస్సార్‌సీపీ, ఇతర పార్టీలతో పాటు ప్రజా సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత రాష్ట్రంలో ఇల్లు కట్టుకోలేని వారు, రాజధానిని ఎలా నిర్మిస్తారని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్న విషయాన్ని వారు గుర్తు చేస్తూ, ప్రస్తుత కూటమి నేతల ‘నాన్-రెసిడెంట్ ఏపీ’ తీరును ఎండగడుతున్నారు. పాలకులు ప్రజల మధ్య ఉంటేనే వారి కష్టనష్టాలు తెలుస్తాయని, ఇలా గాలిలో చక్కర్లు కొడుతూ చేసే పాలన క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించలేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

మార్పు ఎప్పుడు?

అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణం పూర్తి కాకపోవడం లేదా భద్రతా కారణాల దృష్ట్యా హైదరాబాద్‌లోనే ఉంటున్నామని నేతలు సమర్థించుకుంటున్నా, ప్రజల్లో మాత్రం ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఏపీ నేతలు నిజంగా ఆంధ్రులే అయితే, తమ కుటుంబాలను ఏపీకి ఎప్పుడు తీసుకొస్తారు? హైదరాబాద్‌తో రాజకీయ బంధం వీడి ఆంధ్రప్రజల మధ్యలో ఎప్పుడు కలిసి బతుకుతారు? అన్నది మిగిలి ఉన్న మిస్టరీ.

Read More
Next Story