
కన్యకా పరమేశ్వరి కాదు.. ‘కనక’ మహాలక్ష్మి!
విశాఖ వన్‌టౌన్‌లోని కన్యకా పరమేశ్వరి అమ్మవారు మంగళవారం శ్రీమహాలక్ష్మి అలంకరణలో 7 కిలోల బంగారు ఆభరణాలు, 12 కిలోల వెండి, రూ.5 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించారు.
విశాఖ నగరం వన్‌టౌన్‌లో దాదాపు శతాబ్దంన్నర క్రితం అంటే.. 148 ఏళ్ల క్రితం వైశ్యుల ఆరాధ్యదైవం కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం వెలసింది. అప్పట్నుంచి ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ తొమ్మిది రోజులూ అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరిస్తారు. తొమ్మిదో రోజు బంగారు, వెండి ఆభరణాలు, నగదు (కరెన్సీ)తో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ సంప్రదాయం ముప్ఫై ఏళ్ల క్రితం మొదలైంది. అలా ఏటా ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు.
ఆభరణాల అలకరణ అలా మొదలైంది..
విశాఖ వన్‌టౌన్ ప్రాంతంలో బంగారం, ఇతర వ్యాపారాలు చేసే వైశ్యులు పెద్ద సంఖ్యలో ఉంటారు. అప్పట్లో వైశ్య పూర్వీకులు ఉదయం తమ దుకాణాలకు వెళ్లేముందు ఈ కన్యకాపరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత తాళాలు ఉంచి ఆపై షాపులు తెరిచేవారు. అలా చేయడం ద్వారా తమ వ్యాపారాలు బాగా సాగుతాయని నమ్మేవారు. ఇలావుండగా ఈ అమ్మవారికి శరన్నవరాత్రుల్లో తొమ్మిదో రోజు బంగారు, వెండి, నగదుతో అలంకరించే ఆనవాయితీ దాదాపు ముప్ఫై ఏళ్ల క్రితం మొదలైంది. మొదట్లో నామమాత్రపు ఆభరణాలు, రూ.101 నగదుతో ఇది ప్రారంభమైంది. అప్పట్నుంచి క్రమం తప్పకుండా ఆ ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఏటా అమ్మవారిని అలంకరించే నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అలా ఈ ఏడాది అలంకరణ ఏడు కిలోల బంగారం, 12 కిలోల వెండి, రూ.5 కోట్ల కరెన్సీ నోట్లకు చేరింది.
నగదు, బంగారు, వెండి ఆభరణాల అలంకరణలో శ్రీమహాలక్ష్మి
తొమ్మిదో రోజు ఏం చేస్తారంటే?
శ్రీమహాలక్ష్మి అలంకారం రోజున కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. తెల్లవారు జామునే అమ్మవారి మూలవిరాట్‌కు పాలు, పెరుగు, గంధం, తేనె, వివిధ రకాల పండ్ల రసాలు వంటి 108 రకాల ద్రవ్యములతో ప్రత్యేక అభిషేకిస్తారు. ఇంకా పలు రకాల పూలతో శ్రీమహాలక్ష్మి అమ్మవారిని అలంకరించి స్వర్ణ వస్త్ర సహిత సకలాభరణాలు, 108 స్వర్ణ పుష్పాలతో నివేదన చేస్తారు. ఆలయ గర్భ గుడిలో సకల స్వర్ణాభరణాలు, బంగారు చీర, బంగారు కిరీటం, బంగారు పాదాలు, బంగారు బిస్కెట్లు, వెండి ఆభరణాలు, వెండి బిస్కెట్లతో పాటు నగదు (నోట్ల కట్టలు)ను అమ్మవారికి అలంకరిస్తారు. ఇందులోభాగంగానే దేవీ నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన మంగళవారం కన్యకాపరమేశ్వరిని శ్రీమహాలక్ష్మి రూపంలో అలంకరించారు. ఇందుకోసం ఏడు కిలోల బంగారు ఆభరణాలు, బిస్కెట్లు, 12 కిలోల వెండి వస్తువులు, బిస్కెట్లు, రూ.5 కోట్ల విలువైన భారతీయ కరెన్సీ నోట్లను ఉపయోగించారు. వీటిలో ఒక రూపాయి నుంచి రూ.500 నోట్ల వరకు ఉన్నాయి. మంగళవారం శ్రీమహాలక్ష్మి అలంకారంలో ఉన్న కన్యకా పరమేశ్వరిని అమ్మవారిని లక్ష మంది వరకు భక్తులు దర్శించుకున్నారు.
ఆభరణాలు, నగదు ఎవరివి?
కన్యకాపరమేశ్వరికి శ్రీమహాలక్ష్మి అమ్మవారిగా అలంకరణకు ఉపయోగించే బంగారు, వెండి ఆభరణాలు, కరెన్సీని ఆ ప్రాంతంలోని వైశ్యులే సమకూరుస్తారు. ఈ అమ్మవారికి నాలుగు కిలోల బంగారు చీర ఉంది. ఇది కాకుండా తమ వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, బంగారు, వెండి బిస్కెట్లు, నగదును ఇంటి నుంచి తీసుకొచ్చి తెచ్చి ఆలయ కమిటీకి ఇస్తారు. కమిటీ వారు వీటిన్నిటినీ అమ్మవారికి అందంగా అలంకరిస్తారు. ఇలా వేకువజాము నుంచే అలకంరణ మొదలు పెట్టి ఉదయానికి పూర్తి చేస్తారు. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తులకు శ్రీమహాలక్ష్మి అలంకరణలో ఉన్న కన్యకా పరమేశ్వరిని దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి తొమ్మిది గంటల తర్వాత అమ్మవారికి అలంకరించిన ఆభరణాలు, నగదును ఎవరివి వారికి ఇచ్చేస్తారు. ఈ నగదును వ్యాపారులు తమ గల్లా పెట్టె (క్యాష్ బాక్సు)ల్లో ఉంచుకుంటారు.
అమ్మవారికిస్తే లాభాలొస్తాయి..
‘శ్రీమహాలక్ష్మి అమ్మవారి అలంకరణకు నగదు, ఆభరణాలు ఇస్తే తమ వ్యాపారాల్లో లాభాలొస్తాయని నమ్మకం. అందుకే శరన్నవరాత్రుల్లో తొమ్మిదో రోజు కన్యకా పరమేశ్వరికి అలంకరణకు నగదు, బంగారు ఆభరణాలు ఇస్తుంటారు. ఇలా ముప్ఫై ఏళ్ల క్రితం మొదలైన అలంకరణ ఆనవాయితీ కొనసాగుతోంది. బంగారు నగలు, నగదు సమర్పించే వారి సంఖ్య కూడా ఏటా పెరుగుతూ వస్తోంది. అమ్మవారిని దర్శించుకునే వారి సంఖ్య కూడా గత ఏడాదికంటే మూడు రెట్లు పెరిగింది’ అని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రెసిడెంట్ ఆరిశెట్టి దినకర్ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు.