కలకలం రేపుతున్న కమ్మ వారి మాటలు..జగన్‌ను ఎప్పటికీ రానివ్వకూడదు
వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలు కమ్మ వారిని టార్గెట్ చేశారు. 2004లో దీనికి బీజం పడితే 2019నాటికి విష వృక్షంగా మారింది.
మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో ఒక హాట్ టాపిక్‌గా మారారు. మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎక్కడ చూసినా వీటిపైనే చర్చలు జరుగుతున్నాయి. డిబేట్లు జరుగుతున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలు కమ్మ వారిని అణగదొక్కాలనే నినాదంతోనే పని చేశారని ఇటీవల ఓ కార్యక్రమంలో తీవ్ర వ్యాఖ్యలు చేసి సంచలనంగా మారారు. సామాజిక మాధ్యమాల్లో ఇవి వైరల్‌గా మారాయి.
ఏబీ వెంకటేశ్వరరావు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలపై ఏమని వ్యాఖ్యలు చేశారంటే.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2004 నుంచి కమ్మ వ్యతిరేకత అనే దానిని రాజ్య పాలసీగా తీసుకొచ్చారని అన్నారు. స్టేట్ పాలసీగా దీనిని అమలు చేశారు. అలా కమ్మ వ్యతిరేకతను ఒక విధానంగా అమలు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి కాలంలో పదేళ్లు ఏదో మారుమూల కాలం గడిపేశామని అన్నారు. తన 35 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో 15ఏళ్లు ఉద్యోగం చేశామని, తక్కిన కాలంలో ప్రాధాన్యత లేని పోస్టుల్లో ఉద్యోగం చేశామనన్నారు.
అయితే 2019 నుంచి కమ్మ వ్యతిరేకత అనేది పీక్‌కు చేరిందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వేసిన కమ్మ వ్యతిరేకత విత్తనం 2019 నాటికి పెద్ద విష వృక్షమై కూర్చుంది. కమ్మ వారిని ఓపెన్‌గా, టార్గెటెడ్‌గా, వాళ్లను అణచి వేయడం అనేది ఒక యుద్ధ ప్రాతిపదికన చేపట్టాడు. అది వీడొచ్చిన తర్వాత జరిగిన కొత్త మార్పు అని జగన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 30వ తేదీన ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేశారు. అదే రోజు రాత్రి వాడిచ్చిన రెండో జీవో తన ట్రాన్స్‌ఫర్‌ది అంటూ మరో సారి జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
ఒక తుచ్చుడు.. మంత్రి కుర్చీలో కూర్చోడానికి కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని ఒక తుచ్చుడు కరోనా కాదిది కమ్మరోనా అని అంటాడు. ఇంకొకడు సీఎం కుర్చీలో కూర్చున్న వెధవ ఎలక్షన్ కమిషనర్‌కు కమ్మ కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటగట్టాడు. ఓ పెద్ద మనిషి కరోనాకు వ్యాక్సిన్‌ను కనిపెడితే దానికి కూడా కులాన్ని అంటగట్టాడు. సెలక్షన్ కాకపోవడానికి కమ్మోడు కారణమని ఒక క్రికెటర్‌ను తీసుకొచ్చి మాట్లాడిస్తాడు. ఇలాంటి కమ్మ వ్యతిరేక వాతావరణంలో నాడు మన కమ్మ వారు బతికారు. ఈ నేపథ్యంలో తాను తిరగబడాల్సి వచ్చిందింటూ ఏబీ వెంకటేశ్వరరావు చెప్పొకొచ్చారు. ఇంకా ఆయన స్పీచ్‌ను కొనసాగిస్తూ.. కమ్మ వాళ్లని కులం పేరు పెట్టి.. యుద్ధం ప్రకటించి.. టార్గెట్ చేసి.. అన్ని రంగాల్లోను అణగదొక్కడానికి జరిగిన పరిస్థితుల్లో కమ్మ వారికి కూడా వారికి తోచిన స్థాయిలో వాళ్లు ఎదురు తిరిగారు. నిలుచున్నారు. నేనొక్కడినే కాదు సవాలును స్వీకరించి ముందుకు నడిచారు. దీనిని మరిచి పోకూడదు.
కమ్మ వారి ఆత్మీయ సభలకు తన 35 ఏళ్ల సర్వీసులో ఎప్పడూ వెళ్ల లేదు. వెళ్లాలనే ఆలోచనలు ఎప్పుడూ రాలేదు. అయితే ప్రత్యర్థులు అలా సృష్టించిన వాతావరణం నేపథ్యంలో ప్రతి కమ్మ వాడు భయపడి పోయి, డిఫెన్స్‌లో ఉండి పోయిన పరిస్థితులను కలుగ చేసిన ఆ వాతావరణంలో కమ్మ వారికి ధైర్యం చెప్పాల్సిన అవసరం నాకు కనబడింది. భయపడొద్దని ధైర్యం చెప్పాల్సిన అవసరం సాటి కమ్మ వాడిగా నాకు అవసరం అనిపిచ్చింది. పాలన వ్యవస్థనే బెదిరించేందుకు తనను ఒక దిష్టి బొమ్మలా ఉపయోగించుకున్నాడు జగన్. అరే.. కమ్మోళ్లతో పెట్టుకుంటే నీకు అంత ఈజీ ఏమీ కాదు.. అని చెప్పడం కోసం కమ్మ వారి దగ్గరుకు వచ్చి.. కమ్మ వారిని ఇన్‌స్పైర్ చేయడానికి వచ్చానని చెప్పొకొచ్చారు. అందో ఇది మంచా చెడా అనే మీమాంసకు ఏ నాడు గురి కాలేదు. ఈ విషయంలో తాను చాలా స్పష్టంగా ఉన్నా. అందుకే కమ్మ వారి మీటింగ్‌లకు వస్తున్నా.
ఈ లోగా ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ప్రతి కమ్మ వాడు కలిసి కట్టుగా.. దేశ విదేశాల్లో ఉన్న కమ్మ వారందరూ కదిలి.. జగన్ దుర్మార్గపు ప్రభుత్వానికి, జగన్ రాక్షస పరిపాలనకు ఎలాంటి సమాధానం చెప్పారో అందరూ చూశారు. అందరికీ గుర్తుంది. ఫలితాల తర్వాత జరిగిన కమ్మ వారి ఆత్మీయ సమ్మేళనాలకు వెళ్లాను. కొంత మంది అడ్డు చెప్పినా.. నాకు కమ్మవారి సమావేశాలకు వెళ్లాలనే క్లారిటీ ఉంది. అలా వెళ్లి కమ్మ వారికి బాసటగా నిలబడ్డాను. తాను కష్టాల్లో ఉన్నప్పుడు కమ్మ వాళ్లెందరో కన్నీళ్లు పెట్టుకున్నారు. అండగా ఉన్నారు. ఈ ఆత్మీయత.. ఈ సంఘీ భావం ఎప్పటికీ ఉండాలి. ఎప్పటికీ ఈ కమ్మ వారి ఆత్మీయ సమావేశాలు జరగాలి. మన కమ్మ వారందరూ కలుసుకుంటూనే ఉండాలి.
జగన్ దుర్మార్గానికి, రాక్ష సత్వానికి, నియంతృత్వానికి కమ్మ వారు గురి కావడం అనేది చరిత్రలో మళ్లీ మరో సారి జరక్కూడదు. అనే కఠినమైన నిర్ణయానికి కమ్మ వారందరూ రావాలి. ఇలాంటి దుర్మార్గపు జగన్‌ను మళ్లా అధికారం పొందకుండా అహర్నిశలు కష్టపడి పని చేసే బాధ్యతను ప్రతి కమ్మ వారు తీసుకోవాలి. ప్రజలు కూడా ఈ బాధ్యతను తీసుకునే విధంగా కమ్మ వారు ప్రోత్సహించాలి. దీని కోసం ఏది చేయడానికైనా వెనుకాడ కూడదు. జగన్‌ను అధికారంలోకి రాకుండా చేసేందుకు మందస్తుగానే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అంటూ కమ్మ వారికి పిలుపు ఇచ్చారు.
ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, జగన్‌కు అత్యంత సన్నిహితుడు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన తలశిల రఘురాం స్పందించారు. ఏబీ వెంకటేశ్వరరావు మాటలను తీవ్రంగా ఖండించారు. కుల అహంకారంతో ప్రవర్తిస్తే మిగితా కులాలు తిరగబడతాయని హెచ్చరించారు. ఏబీ వెంకటేశ్వరరావు తప్ప చేసి కేసులు ఎదుర్కొన్నాడు.. దానిని కమ్మ కులం మొత్తానికి ఆపాదించడం ఏంటని నిలదీశారు. కమ్మ కులం ఓట్లేస్తేనే టీడీపీ గెలిచిందా అని ప్రశ్నించారు. ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడిన భాష చాలా అభ్యంతర కరంగా ఉందన్నారు. వైఎస్‌ఆర్ కానీ జగన్ కానీ ఏనాడు కులం కోసం పని చేయాలేదని, కులాలకు అతీతంగా పాలన చేశారని అన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించరని, కామ్‌గా ఉంటే పవన్ కల్యాణ్ కూడా కమ్మ కులానికి మద్ధతు ఇస్తున్నట్లు ప్రజలు భావిస్తారని అన్నారు.
Next Story