మొదటి సారి కమ్మ వర్సెస్ యాదవ్
నరసరావుపే పార్లమెంట్ అభ్యర్థిగా మొదటి సారి యాదవ్ సామాజిక వర్గం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ బరిలోకి దింపింది. ఇప్పటి వరకు బీసీ నాయకులెవ్వరూ ఇక్కడ పోటీ చేయ లేదు.
జి. విజయ కుమార్
ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపే పార్లమెంట్ స్థానానికి 72 ఏళ్ల తర్వాత 18వ లోక్ సభ ఎన్నికలు జరగుతున్నాయి. ఇన్నేళ్ల కాలంలో ఈ పార్లమెంట్ స్థానం నుంచి రెడ్డి, కమ్మ. వైశ్య సామాజిక వర్గాలు మాత్రమే ప్రధాన పార్టీల నుంచి పోటీ పడ్డారు. మొదటి సారిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డేర్ స్టెప్ తీసుకుంది. బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్‌ను రంగంలోకి దింపింది. పైగా ఈయన స్థానికుడు కూడా కాదు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రంగంలోకి దించడంపై సీఎం జగన్ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కమ్మ 2.15 లక్షలు, రెడ్డి 1.50లక్షలు, యాదవ సామాజిక వర్గం నుంచి 1.15లక్షల ఓటర్లు ఉన్నారు. అయినా బీసీని రంగంలోకి దించడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ఎవ్వరికీ బోదపడని పరిస్థితి ఉంది.
నెల్లూరు నుంచి నరసరావుపేటకు..
పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్‌ను నరసరావుపేట పార్లమెంట్ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రంగంలోకి దింపారు. ఈయన 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019లో ఏర్పడిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో నరసరావు పార్లమెంట్ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేసి గెలుపొందారు. ఒకరు మంత్రి కావడం, మరొకరు అధికార పక్ష ఎంపీ కావడంతో ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఏర్పడాయి. ఇద్దరు ఇంచు మించూ సమవయస్కులు, ఉన్నత విద్యా వంతులు కావడంతో స్నేహంగానే మెలిగే వారు. ఇది 2024 జనవరి వరకు కొనసాగింది. ఇక అక్కడ నుంచి ఎన్నికల హడావుడి స్టార్ట్ కావడం.. అభ్యర్థుల ఎంపికలపై సర్వేలు మొదలు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాల్లో నెల్లూరుకు చెందిన అనిల్‌కుమార్ యాదవ్‌ను నరసరావుపేట వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా సీఎం ప్రకటించడం, సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు సొంత పార్టీపై తిరుగుబాటు జెండా ఎగుర వేయడం.. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం, నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి బరిలోకి దిగడం చకచక జరిగి పోయాయి.
బీసి కార్డుతో అనిల్‌ను బరిలోకి దింపిన సీఎం జగన్
అనిల్‌కుమార్ యాదవ్ కేవలం బీసీ కార్డుతోనే నరసరావుపేట నుంచి సీఎం జగన్ బరిలోకి దింపారు. ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కూడా ఎక్కువగానే ఉన్నారని, ఇది లాభిస్తుందని అంచనాతో అనిల్‌కు ఇక్కడ సీటు ఖరారు చేశారు. ప్రత్యర్థి అయిన లావు శ్రీకృష్ణదేవరాయలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బీసీ కార్డు బలంగా పని చేస్తుందని అంచనా వేశారు. వీరికితో రెడ్డి, ఇతర ఎస్సీ, ఎస్టీ ఓటర్లు తోడైతే గెలుపు సులువు అవుతుందని భావించారు. నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో ఇతర వర్గాలు ఉన్నా కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల వారిదే రాజకీయ అధికారం. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కమ్మ 2.15 లక్షలు, రెడ్డి 1.50లక్షలు, ముస్లిమ్ 1.8లక్షలు, మాదిగ 1.90లక్షలు, యాదవులు 1.15లక్షలు, మాల 1.10లక్షలు, కాపు 1.3లక్షలు, వడ్డెర 84వేలు, వైశ్య 74వేలు, రజక 55వేలు, సుగాలి 48వేలు, ఎరుకల 45వేలు, బ్రాహ్మణులు 15వేలు ఓటర్లున్నారు.
అనిల్ కుమార్ తొలి బీసీ
ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో నర్సరావుపేట పార్లమెంట్ నియోజక వర్గం నుంచి ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన నాయకులే పోటీ చేయడం.. ఎంపీలుగా గెలుస్తూ వచ్చారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఏడు సార్లు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు నాలుగు సార్లు, వైశ్య సామాజిక వర్గానికి చెందిన నాయకులు మూడు సార్లు ఎంపీలుగా గెలిచారు. మాజీ ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ నుంచి ఎంపీలుగా పోటీ గెలుపొందారు. ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచిన కే రోశయ్య తర్వాత కాలంలో ముఖ్యమంత్రి అయ్యారు. 1952లో సి రామయ్య చౌదరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గెలవడం గమనార్హం. ఇప్పటి వరకు కమ్మ, రెడ్లు, వైశ్యులు మాత్రమే గెలిచిన నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి మొదటి సారిగా పోటీకి దిగిన అనిల్‌కుమార్ యాదవ్ భవిష్యత్‌కు ఈ ఎన్నిక పరీక్ష లాంటిది.
2019లో మిత్రులు 2024లో ప్రత్యర్థులు
ఆ పార్లమెంట్ నియోజక వర్గంలో పోటీలో నిలచిన ప్రధాన పోటీ దారులు ఇద్దరూ గతంలో మంచి మిత్రులుగా ఉన్నారు. ఒకే పార్టీ గొడుగు కింద కలిసి మెలిసి తిరిగారు. కలిసే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒకరు మంత్రిగాను, మరొకరు ఎంపీగాను కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ కాలం మారింది. పరిస్థితులు తారు మారయ్యాయి. ఒకరు అదే పార్టీలో కొనసాగుతున్నారు. మరొకరు పార్టీని వీడారు. ఆ ఇద్దరు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు.
Next Story