అమ్మ దొంగా, జనసేన ఎంపీకే వేశారు కదరా టోపీ!
x

అమ్మ దొంగా, జనసేన ఎంపీకే వేశారు కదరా టోపీ!

కాసినా, కూసినా.. కోటి. సైబర్ నేరగాళ్ల వలలో విలవిల


ఈ సైబర్ నేరగాళ్లకి తనా మనా అనే తేడా గాని హోదా అనే భయం,భక్తీ గాని లేకుండా పోయిందబ్బా అని మొత్తుకుంటున్నారు సాదాసీదా జనం. ఏ అనామకుడో అయితే పర్లేదు గాని లక్షలాది మందికి ప్రాతినిధ్యం వహించే ఓ పార్లమెంటు సభ్యుడికి టోకరా వేస్తారా అని విస్తుపోతున్నారు పాపం వాళ్లు.

ఇంతకీ విషయమేమిట్రాంటే..
ఆయన పేరు ఉదయ్ శ్రీనివాస్. కాకినాడ పార్లమెంటు సభ్యుడు. జనసేన పార్టీ. పార్లమెంటులో నిలబడి చట్టాలు గిట్టాలు చేసే మనిషి. అంతటి పెద్ద మనిషికి ఖజానాకి గండి కొట్టారు ఈ సైబర్ నేరగాళ్లు. ఇప్పుడిదో పెద్ద సంచలనం. పార్లమెంటు దాకా పోయింది. ఆయన పేరిట సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఏకంగా ఆయన సంస్థకే రూ.92 లక్షలు టోపీ వేశారు. కాసినా కూసినా ఏకంగా దగ్గరదగ్గర కోటి రూపాయలు.
ఎలా చేశారంటే..
ఎంపీ పేరును, ఫొటోను మార్ఫింగ్ చేశారు. అచ్చం ఆయన ఉన్నట్టే ఫోటోను వాడారు. ఇప్పటికి తేలిన లెక్కల ప్రకారం ఆయన సంస్థ- టీ-టైమ్- నుంచి రూ.92 లక్షలు కాజేశారు. ఇంకా ఎంత పోయిందనేది లెక్క చూస్తున్నారు.

తెలంగాణలో టీ-టైమ్ సంస్థకు చీఫ్ ఫైనాన్స్ మేనేజర్‌గా పని చేస్తున్న గంగిశెట్టి శ్రీనివాసరావుకు గత నెల 22న ఓ కొత్త ఫోన్ నెంబరు నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. వాట్సాప్ డీపీగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఫొటో ఉండటంతో, అది నిజంగానే ఎంపీ మెసేజ్ అని మేనేజర్ నమ్మాడు. కొత్త ఫోన్ నెంబరు ఉపయోగిస్తున్నా.. అత్యవసరం.. కొంత మొత్తం పంపించు అంటూ పదే పదే మెసేజ్‌లు పంపాడు.
ఆ మెసెజ్‌లు ఎంపీ ఉదయ్ చేశారని నమ్మిన మేనేజర్, ఎటువంటి క్రాస్ చెక్ చేయకుండా పదకొండు సార్లు మొత్తం రూ.92 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు.
ఈ నెల 8న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన ఖాతాలను పరిశీలిస్తుండగా, అనుమానాస్పదంగా కొన్ని ట్రాన్సాక్షన్లు కనిపించాయి. వెంటనే ఆయన తన ఫైనాన్స్ మేనేజర్‌ను ప్రశ్నించగా, అసలు తన ఫోన్ నెంబర్ మారలేదని, డబ్బుల కోసం తను ఎటువంటి మెసేజ్ పంపలేదని ఎంపీ స్పష్టం చేశారు. దాంతో మేనేజర్ షాక్‌కు గురయ్యాడు.
ఇది సైబర్ మోసమేనని గ్రహించి, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, మొదటి నగదు బదిలీ జరిగిన 2 వారాల తర్వాత ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేవలం రూ.7 లక్షలు మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు.
అట్లుంటది సైబర్ నేరగాళ్ల పనితనం. ఎంపీ అయితే వాళ్లకేమైనా లెక్కా పత్రమా.. చూడండి ఎలా కొట్టేశారో మరి. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండమనేది.
Read More
Next Story