కొన ఊపిరితో కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్!
x

'కొన ఊపిరి'తో కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్!

రూ.700 కోట్ల ఎన్పీఎ వ్యవస్థాగత పతనానికి సంకేతం


(కృష్ణా కానూరి, విజయవాడ)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గతంలో అత్యంత సమర్థవంతంగా పనిచేసిన కాకినాడ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డిసిసిబి) నేడు రాజకీయ క్రీడలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోందని ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఎపిసిసిబిఇఎ) ప్రధాన కార్యదర్శి కెవిఎస్ రవికుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది మంది రైతుల ఆర్థిక పునాది అయిన ఈ బ్యాంక్, అక్రమాల వల్ల తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పారు. దీని ప్రభావం సుమారు 1.5 లక్షల మంది రైతులపై పడుతున్న నేపథ్యంలో, బ్యాంక్ పునరుద్ధరణకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఈ వ్యాస రచయితతో మాడ్లాడిన రవి కుమార్ డిమాండ్‌ చేశారు. రూ.700 కోట్ల ఎన్పీఎ వ్యవస్థాగత పతనానికి సంకేతమని స్పష్టం చేశారు.
రూ.300 కోట్ల దోపిడీ
52 శాఖలతో వున్న కాకినాడ డిసిసిబిలో కేవలం 6 బ్రాంచీలు, వాటి అనుబంధ పిఎసిఎస్ ల పరిధిలో రూ.300 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు విచారణలలో స్పష్టమైంది. ఆరేళ్లు గడుస్తున్నా, ఈ ఆర్థిక నేరాలకు బాధ్యులైన ఒక్కరిపై కూడా కఠిన చర్యలు లేవు. రాజకీయ మద్దతుతో వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు.
రూ.700 కోట్ల మొండి బకాయిలు
అవినీతి నష్టంతో పాటు, ఉద్దేశపూర్వకంగా రుణాలు చెల్లించకపోవడం వల్ల రాని బకాయిలు (ఎన్పీఎ) విలువ సుమారు రూ.700 కోట్లకు చేరింది. దీని ఫలితంగా, కనీసం 9 శాతం వుండవలసిన సిఆర్ఎఆర్ (Capital to Risk-Weighted Assets Ratio) 5.4 శాతానికి పడిపోయింది.

నాబార్డ్ ఆంక్షలు: అధిక ఎన్పీఎ, భారీ నష్టాల కారణంగా నాబార్డ్ రీఫైనాన్స్ సదుపాయాన్ని నిలిపివేసింది. రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్) కొంత సహాయం అందించినా, వారి పరిమితులు సరిపోవడం లేదు.
రాజకీయ అడ్డంకులు.. ఉద్యోగులపై భౌతిక దాడులు
రాని బకాయిలు వసూలుకు ఉద్యోగులు బయలుదేరితే, సదరు ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గాల్లో వసూళ్లు చేయటానికి వీల్లేదని తిడుతూ, తరిమేస్తున్నారు. బడా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, భూస్వాములు వంటి ఆర్థికంగా స్థిరపడిన వారే రుణ ఎగవేతదారుల్లో వుండటం విచారకరం. గత ఏడాది వసూళ్ల సమయంలో డీజీఎం, ఏజీఎం, మేనేజర్ స్థాయి అధికారులు సహా అనేక మంది ఉద్యోగులపై భౌతిక దాడులు జరిగాయి. ఉద్యోగులను దేవాలయాలు, పశుపోషణ గోశాలలో బంధించిన ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఫిర్యాదు చేసినా నిందితులపై చర్యలు శూన్యం. ఇంత జరుగుతున్నా ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడూ, ప్రభుత్వాలు ఎక్కడ కూడా దీనిపై చర్చించకపోవడం తీవ్రమైన విషయం.
పర్యవేక్షక సంస్థల వైఫల్యం
ఈ సంక్షోభ సమయంలో నాబార్డ్, ఆప్కాబ్, సహకార విభాగం బ్యాంక్ పునరుద్ధరణ చర్యలు తీసుకోవాల్సింది పోయి, మరింత పరిమితులు విధించడం వల్ల బ్యాంకు ఆర్థిక స్థిరత్వం పూర్తిగా దెబ్బతింటోంది. సాయం చేయాల్సింది పోయి, ఆంక్షలు పెంచడం వల్ల సహకార వ్యవస్థపై రైతులు నమ్మకం కోల్పోతున్నారు.
పునరుద్ధరణే ఎపిసిసిబిఇఎ లక్ష్యం
కాకినాడ డిసిసిబిని రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలని రవికుమార్ డిమాండ్ చేశారు. సీనియర్ ఐఎఎస్ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను నియమించి, సంకల్పాత్మక చర్యలు తీసుకోవాలి. వసూలు చర్యల్లో ఉద్యోగులకు పోలీసు రక్షణ, రుణ ఎగవేతదారుల ఆస్తుల స్వాధీనం, కేసుల నమోదు, నేరపూరిత చర్యలపై వేగవంతమైన విచారణ జరిపే పూర్తి అధికారం టాస్క్ ఫోర్స్‌కు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం తరహాలో, కాకినాడ డిసిసిబి పునరుద్ధరణ కోసం ప్రభుత్వం తక్షణమే రూ.200 కోట్లు మూలధన సాయం (Capital Support) అందించాలన్నారు.
నాబార్డ్, ఆప్కాబ్, సహకార శాఖలు బ్యాంకు పునరుద్ధరణలో భాగస్వాములయ్యే విధంగా పరిమితులను తగ్గించి, షరతులతో కూడిన సహకారం అందించేలా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ‘కాకినాడ డిసిసి బ్యాంక్ ఒక సాధారణ బ్యాంకు కాదు. ఇది వేలాది రైతులు, వారి కుటుంబాల జీవనాధారం. ఈ బ్యాంక్ కుప్పకూలితే వ్యవసాయ రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సహకార వ్యవస్థపై ప్రజల నమ్మకం పూర్తిగా కూలిపోవచ్చు. కాబట్టి, ఈ సంస్థను రక్షించేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టాలి’ అని రవికుమార్ కోరారు.
విచారణ ముసుగులో నేరస్తులకు అభయం!
కాకినాడ డిసిసిబి కుంభకోణంపై జరిగిన విచారణ ఒక పెద్ద నాటకం! నాలుగేళ్లు (2019-23) నడిచిన ఈ కథలో, కలెక్టర్ల ఆదేశాలు కేవలం డైలాగులు, సస్పెన్షన్లు, తెరచాటు విన్యాసాలు. ప్రతి సంవత్సరం రూ.22 కోట్ల నుంచి రూ.788 కోట్లకు నష్టం పెరుగుతున్నా, రూ.188 కోట్ల అవినీతి సొమ్ముకు సాక్ష్యాలు దొరికినా, విచారణల ఫలితం మాత్రం సున్నాగా మిగిలింది.

నిజానికి, ఈ నాలుగు దశల విచారణ ఉద్దేశం నేరస్తులను శిక్షించడం కాదు., వ్యవస్థాగత లోపాలను కప్పిపుచ్చడం, అక్రమార్కులను రాజకీయ అండదండలతో సురక్షితంగా బయటపడేయడం మాత్రమే! డిసిసిబి కుంభకోణంపై జరిగిన ఈ విన్యాసం, రైతుల కన్నీళ్లను తుడిచే ప్రయత్నం కాకుండా, నేరస్తులకు కోట్లు సంపాదించుకునే భద్రత ఇచ్చిందని తేలిపోయింది.
తొలి హెచ్చరిక విస్మరణ: 2019-20 దశ
​2019లో గండేపల్లి పిఎసిఎస్ లో జరిగిన రూ.22 కోట్ల బోగస్ రుణాలపై మొదటి ఫిర్యాదు అందింది. కలెక్టర్ కార్యాలయం ప్రాథమిక విచారణ జరిపింది. ‘ఇది ప్రమాద సంకేతం’ అని రాసి చేతులు ముడుచుకుంది. కానీ చర్యల జాడ మాత్రం లేదు. కేవలం పిఎసిఎస్ సిబ్బందికి మౌఖిక హెచ్చరిక చేసి వదిలేశారు. ఈ విస్మరణే భవిష్యత్తు భారీ కుంభకోణానికి తొలి సిగ్నల్ అయింది. పర్యవసానంగా, 2020 నాటికి అక్రమాలు మండల స్థాయికి వ్యాపించాయి. కలెక్టర్ ఎం. వెంకటప్పయ్య ఆదేశాలతో జరిగిన జిల్లా వ్యాప్త ఆడిట్‌లో, రూ.104 కోట్లు కిర్లంపూడి పిఎసిఎస్ లో, రూ.46 కోట్లు ఏలేశ్వరం పిఎసిఎస్ లో మాయమైనట్లు సాక్ష్యాలతో సహా బయటపడింది. మొత్తం రూ.150 కోట్ల నష్టం 2020లోనే ధృవ పడినా, కేవలం 8 మంది సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. రాజకీయ ఒత్తిడితో కీలక నివేదికలు గూటికి చేరాయి. డిసిసిబి బోర్డు, సీఈవోలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా రికవరీని ‘సున్నా’గా ముగించారు.
మోసాలు 'పద్ధతి ప్రకారం' - అధికారిక అంగీకారం!
​2021లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మి రంగంలోకి దిగి గండేపల్లి పిఎసిఎస్ లోని రూ.22.07 కోట్ల మోసంపై, అలాగే రావులపాలెం పిఎసిఎస్ లో 54 మంది రైతుల పేరిట జరిగిన బినామీ రుణాలపై విచారణలు చేపట్టారు. ‘ఈ మోసాలు విభిన్నంగా కనిపించినా, మూలంలో ఒకే పద్ధతి వుంది’. అంటే, అదే గ్యాంగ్, అదే టెక్నిక్‌ను వేర్వేరు పిఎసిఎస్ లలో ఉపయోగిస్తున్నారని జాయింట్ కలెక్టర్ అధికారికంగా వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరంలో కనుగొన్న మోసాల విలువ రూ.186 కోట్లుగా అంచనా వేసినా, ఫలితం మారలేదు. 12 మంది పిఎసిఎస్ ఉద్యోగుల సస్పెన్షన్, మూడు పిఎసిఎస్ లకు షో-కాజ్ నోటీసులు మినహా డిసిసిబి నుంచి ‘Strong Action Soon’ అనే పాత మాటలే వినిపించాయి. రికవరీ మాత్రం సున్నాగానే మిగిలింది!
విశ్వాస ఘాతుకం పతనానికి అసలు కారణం!
నాలుగేళ్లలో నాలుగు దశల విచారణల తర్వాత, డిసిసిబి పూర్తిగా నిర్వీర్యమైంది. రూ.788 కోట్ల భారీ నష్టంపై జరిగిన దర్యాప్తులన్నీ కేవలం నాటకమని, నేరస్తులను కాపాడటానికి అధికారులు చేసిన విన్యాసాలని తాజా ఆడిట్ నివేదికలో దాగిన నిజాలు తేటతెల్లం చేశాయి. ఈ కుంభకోణం రైతులకు ఆవేదన, నేరస్తులకు కోట్లలో సంపాదన అనే ఘోర వాస్తవాన్ని మన ముందుంచింది. ఇది కేవలం ఆర్థిక నేరం కాదు, సహకార వ్యవస్థకు జరిగిన అమానుషమైన విశ్వాస ఘాతుకం. ఇది కేవలం ఆర్థిక నేరం కాదు, ఈ వ్యవస్థను నమ్ముకున్న లక్షలాది ప్రజల ఆశలపై జరిగిన విశ్వాస ఘాతుకం. ఈ నివేదిక, నిజాయతీపరులైన ఉద్యోగులకు, అన్నదాతలకు ఒకటే చెబుతోంది - మీ ఆందోళన వాస్తవం! ఇకనైనా మౌనం వీడి, గళం విప్పండి. ఇది తక్షణ కర్తవ్యం!!
(రచయిత- ఇండిపెండెంట్ జర్నలిస్టు, సహకార రంగ నిపుణుడు)
Read More
Next Story