కడియం చాలా లక్కీనా ?
తెలంగాణా ఓటర్లు ఫిరాయింపులకు గట్టిగా బుద్ధిచెప్పారు. ఫిరాయింపుల్లో కూడా ముఖ్యంగా కాంగ్రెస్ తరపున పోటీచేసిన ఐదుగురు ఎంపీ అభ్యర్ధుల్లో నలుగురు ఓడిపోయారు.
తెలంగాణా ఓటర్లు ఫిరాయింపులకు గట్టిగా బుద్ధిచెప్పారు. ఫిరాయింపుల్లో కూడా ముఖ్యంగా కాంగ్రెస్ తరపున పోటీచేసిన ఐదుగురు ఎంపీ అభ్యర్ధుల్లో నలుగురు ఓడిపోయారు. వరంగల్ నుండి పోటీచేసిన కడియం కావ్య మాత్రమే మంచి మెజారిటీతో గెలిచారు.
తాజాగా వెల్లడైన పార్లమెంటు ఫలితాలను చూస్తే కాంగ్రెస్ అభ్యర్ధిగా వరంగల్ (ఎస్సీ) నుండి పోటీచేసిన కడియం కావ్య గెలిచారు. మిగిలిన నలుగురు ఓడిపోయారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుండి ఐదుగురు సీనియర్ నేతలు కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. వీరిలో ఇద్దరు ఎంఎల్ఏలు, ఒక ఎంపీ, మరో జడ్పీ ఛైర్ పర్సన్, మరో సీనియర్ నేత ఉన్నారు. ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి, చేవెళ్ళ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్ లో చేరారు. అలాగే ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయిన నీలంమధు కూడా కాంగ్రెస్ లో చేరారు. మధుకి ఏ పదవి లేకపోయినా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీ ఫిరాయించేశారు.
పార్టీ ఫిరాయించిన వారిలో పట్నం సునీత మల్కాజ్ గిరి ఎంపీగా, రంజిత్ రెడ్డి చేవెళ్ళ ఎంపీగా, దానం నాగేందర్ సికింద్రాబాద్, కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య వరంగల్ నుండి, నీలంమధు మెదక్ ఎంపీగా పోటీచేశారు. అయితే వీరిలో కావ్య మాత్రమే గెలిచారు. బీజేపీ సీనియర్ నేత, తన సమీప అభ్యర్ధి ఆరూరి రమేష్ పై కావ్య 2,20,339 ఓట్ల మెజారిటితో గెలిచారు. కావ్యకు బీఆర్ఎస్ అధినేత కేసీయార్ టికెట్టిచ్చినా కాదని ఆమె కాంగ్రెస్ లో చేరి టికెట్ తెచ్చుకుని గెలవటం నిజంగా గొప్పనే చెప్పాలి. కాకపోతే బీఆర్ఎస్ నుండి వచ్చిన మిగిలిన వారందరు ఓడిపోయారు కాబట్టే కావ్యను లక్కీగా చెప్పింది.
దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్ గిరి. ఈ నియోజకవర్గంలో సుమారు 31 లక్షల ఓట్లున్నాయి. ఇక్కడినుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పట్నం సునీతారెడ్డి పోటీచేశారు. బీజేపీ తరపున ఈటల రాజేందర్ పోటీచేశారు. పోటీ మొదటినుండి వీళ్ళిద్దరి మధ్యే జరిగింది. చివరకు పట్నం మీద ఈటల 3,91,475 ఓట్ల మెజారిటితో గెలిచారు. అలాగే చేవెళ్ళలో బీజేపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వరరెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్ధి గడ్డం రంజిత్ రెడ్డి మీద గెలిచారు. ఇక్కడ పోటీ మొదటినుండి కాంగ్రెస్, బీజేపీ మధ్యనే జరిగింది. 43మంది పోటీచేసిన ఈ నియోజకవర్గంలో చివరకు కాంగ్రెస్ అభ్యర్ధిపై కొండా మంచి మెజారిటీతో గెలిచారు.
మెదక్ లో పోటీ మొదటినుండి మూడు పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య హోరాహోరాగా జరిగింది. చివరివరకు కూడా మెదక్ లో ఎవరు గెలుస్తారో ఎవరూ చెప్పలేకపోయారు. ఎందుకంటే మెదక్ సీటులో మొదటి నుండి బీఆర్ఎస్ కు బాగా పట్టున్నది. కాంగ్రెస్ తరపున నీలం మధు, బీజేపీ తరపున రఘనందనరావు, కారుపార్టీ అభ్యర్ధిగా వెంకట్రామరెడ్డి పోటీచేశారు. అయితే అనేక నాటకీయమలుపులు తిరిగిన మెదక్ ఎన్నికలో చివరకు బీజేపీ అభ్యర్ధి రఘునందనరావు కాంగ్రెస్ అభ్యర్ధి మధుపై 39,139 ఓట్ల మెజారిటితో గెలిచారు. చివరగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మరో ఫిరాయింపు నేత, ఎంఎల్ఏ దానం నాగేందర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేశారు. బీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో మొదటగా కాంగ్రెస్ లోకి ఫిరాయించింది దానమే అని అందరికీ తెలిసిందే. టికెట్ హామీతోనే దానం కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. ముందుగా అనుకున్నట్లుగానే సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేశారు. బీజేపీ తరపున కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి పోటీచేశారు. ఇక్కడ ఎన్నిక హోరాహోరీగానే జరిగినా చివరకు దానంపై కిషన్ 49,944 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మొత్తానికి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించి ఎంపీలుగా పోటీచేసిన ఐదుగురిలో కడియం కావ్య మాత్రమే గెలిచి లక్కీ అనిపించుకున్నారు.