KISSA KURCHIKA | కడప కౌన్సిల్లో రగడ, టీడీపీ ఎమ్మెల్యే మాధవికి అవమానం
x

KISSA KURCHIKA | కడప కౌన్సిల్లో రగడ, టీడీపీ ఎమ్మెల్యే మాధవికి అవమానం

కడప రెడ్డెమ్మకు అవమానం జరిగింది. కడప కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవీరెడ్డికి కుర్చీ కేటాయించకపోవడంపై సమావేశం రసాభాసగా మారింది.


కడప మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ రసాభాసగా మారింది. డిసెంబర్ 23న జరిగిన ఈ సమాశంలో టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం బాహాబాహీకి తలపడ్డాయి. అరుపులు, కేకలతో సమావేశం దద్దరిల్లింది. సమావేశానికి వచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్యే మాధవీరెడ్డికి వేదికపై కుర్చీ ఏర్పాటు చేయకపోవడంతో ఈ గొడవ మొదలైంది. తనకు కుర్చీ లేకపోవడం ఇదే తొలిసారి కాదని, గతంలో కూడా ఇలాగే జరిగిందని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, మున్సిపల్ ఛైర్మన్ తీరుపై మండిపడ్డారు.
మాధవీరెడ్డి ఏమన్నారంటే...
వైసీపీకి చెందిన మేయర్‌ సురేశ్‌బాబు తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మహిళను మేయర్‌ అవమానపరుస్తున్నారు. మహిళను అవమానిస్తే మీ నాయకుడు జగన్ సంతోషిస్తారేమో. తన కుర్చీని లాగేస్తారని మేయర్‌ భయపడుతున్నట్లున్నారు. అందుకే ఆయన కుర్చీలాట ఆడుతున్నారు. విచక్షణాధికారం ఉందని మేయర్‌ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆయనకు మహిళలంటే చిన్నచూపు. అందుకే మహిళలను నిలబెట్టారు. వైసీపీ పాలనలో కుడి, ఎడమ వైపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు కుర్చీ వేయకపోవడంలో ఆంతర్యమేంటి? కడప అభివృద్ధిని కుంటుపరిచారు. ఇక్కడ జరిగిన అవినీతిపై మాట్లాడాలి. అవినీతిపై చర్చిస్తారనే సమావేశాలు జరగకుండా చేస్తున్నారు’ అని మాధవీరెడ్డి ఆరోపించారు.

ఈ క్రమంలో మేయర్‌ సురేశ్‌ బాబు, ఎమ్మెల్యే మాధవీరెడ్డికి మధ్య వాదోపవాదాలు సాగాయి. కుర్చీ లేకపోవడంతో ఎమ్మెల్యే నిలబడే మాట్లాడారు. మేయర్‌ కుర్చీకి ఒక వైపు తెలుగుదేశం, మరో వైపు వైసీపీ కార్పొరేటర్లు నిలబడి నిరసన తెలిపారు. మేయర్‌ కుర్చీ వెనక ఇరుపక్షాల వాదోపవాదనలు సాగాయి. పోటాపోటీ నినాదాలతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. అరుపులు, కేకలతో సమావేశమందిరం దద్దరిల్లింది. పరస్పరం దూషణ భూషణలకు దిగారు. మేయర్‌కు క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ కార్పొరేటర్లు కింద బైఠాయించి నిరసన తెలిపారు.
ఏడుగురు కార్పొరేటర్లను సస్పెండ్‌ చేసిన మేయర్‌
సమావేశానికి ఆటంకం కలిగిస్తున్నారంటూ వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఏడుగురు కార్పొరేటర్లను సస్పెండ్‌ చేస్తున్నట్లు మేయర్‌ సురేశ్‌బాబు ప్రకటించారు. వైసీపీ కార్పొరేటర్లను కూడా సస్పెండ్‌ చేయాలని టీడీపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. మరోవైపు ఎమ్మెల్యేకు కుర్చీ ఇవ్వకపోవడంతో నగరపాలక సంస్థ కార్యాలయం బయట ఆమె వెంట వచ్చిన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మేయర్‌ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయ పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు.
ఇదేం తీరు, ఈ కుర్చీలాటేమిటీ?
కడప నగర అభివృద్ధి పట్టించుకోకుండా మీటింగ్ జరిగిన ప్రతిసారీ ఈ కుర్చీల గొడవేమిటని స్థానికులు మండిపడుతున్నారు. నగరంలో మురికినీటి పారుదల మొదలు అనేక సమస్యలకు పరిష్కారం చూపడానికి బదులు కార్పొరేటర్లు పరస్పరం ఘర్షణలకు దిగడం, సమావేశాలు వాయిదా పడుతూ ఉంటే నగరాభివృద్ధి జరిగేది ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రతినిధిగా మీటింగ్ కి వచ్చిన ఓ మహిళకు నిబంధన ప్రకారం కుర్చీ వేస్తే పోయేది ఏముందని స్థానికులు మేయర్ తీరును తప్పుబడుతున్నారు.
Read More
Next Story