కోట్లు కురిపిస్తున్న కబడ్డీ
ప్రో కబడ్డీ తెరపైకి వచ్చిన తర్వాత కబడ్డీకి ఒక్క సారిగా క్రేజ్ పెరిగింది. ఆటగాళ్లకు డిమాండ్ పెరిగింది.
ఒకప్పుడు ఆటగాళ్లకు అంత ప్రాధాన్యత ఉండేది కాదు. ప్రభుత్వం నుంచి ఆదరణ కూడా తక్కువుగానే ఉండేది. అందులో కబడ్డీ ఒకటి. ఈ ఆట వల్ల సమయం వృధా చేసుకోవడం తప్పితే దాని వల్ల ఉపయోగం లేదని అనేవారు. ఒక వేళ ఈ ఆట మీద మక్కువ పెంచుకున్న వాళ్లల్లో పేరు కోసం ఆడేవాళ్లు కొందరైతే, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆడేవాళ్లు మరి కొందరు ఉండేవారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితంలో సెటిల్ అయిపోవచ్చే ఆలోచలో ఎక్కువ మంది ఉండే వారు. రైల్వేస్, పోస్టల్ వంటి వివిధ డిపార్ట్‌మెంట్‌లలో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు సంపాదించుకునే వాళ్లు. ఆ ఉద్యోగాలు కూడా అందరికీ వచ్చేవి కాదు. తక్కువ మందికే ఆ అవకాశం దక్కేది. తక్కిన వారు కొచ్‌లుగానో, ప్రైవేటు ఉద్యోగులుగానో జీవితాలను నెట్టుకొచ్చే వారు.
కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. ప్రో కబడ్డీ లీగ్ తెరపైకి వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. కబడ్డీ ఆటకు గౌరవం, మర్యాదలు పెరిగాయి. ఆటగాళ్లు ఆర్థికంగా స్థిర పడేందుకు ఒక వేదికగా మారింది. ఆటలో మంచి ప్రదర్శన చేసిన వారికి మంచి డిమాండ్ కూడా పెరిగింది. కోట్లు పెట్టి కొనుగోలు చేసేందుకు జట్టు యాజమాన్యాలు ఆసక్తి కనబరుస్తున్నారు. అలా ఈ సారి ప్రో కబడ్డీ సీజన్ 11లో దాదాపు ఏడుగురు ఆటగాళ్లు కోటి రూపాయల మార్కును దాటారు.
అందరి కంటే సచిన్ తన్వార్ అనే కబడ్డీ ఆటగాడు రికార్డు స్థాయిలో రేటు దక్కించుకున్నారు. రూ. 2.15 కోట్లు వెచ్చించి సచిన్‌ను తమిళ్ తలైవాస్ టీమ్ యాజమాన్యం సొంతం చేసుకుంది. సచిన్ తన్వార్ రెయిడర్‌గా మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఆటగాడిగా పేరుంది. తర్వాత ఇరానియన్ డిఫెండర్ షాదులు నిలిచాడు. ఈ ఆటగాడి కోసం కూడా కోట్లు వెచ్చించారు. రూ. 2.07 కోట్ల వెచ్చించి ఈ ఆటగాడిని హర్యానా స్టీలర్స్ టీమ్ సొంతం చేసుకుంది. తర్వాత స్థానంలో రెయిడర్ గుమాన్ సింగ్ నిలిచాడు. గుమాన్ సింగ్‌ను రూ. 1.97 కోట్లు వెచ్చించి గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది. గత సీజన్‌లో అత్యధిక రేటును సొంతం చేసుకున్న పవన్ షెరావత్ ఈ సీజన్‌లో రేటు తగ్గింది. రూ. 1.725 కోట్లు వెచ్చించి తెలుగు టైటాన్స్ యామజాన్యం సొంతం చేసుకుంది. తర్వాత భరత్‌ను రూ. 1.30 కోట్లతో యుపీ యోధా, మనీందర్ సింగ్‌ను రూ. 1.15కోట్లతో బెంగాల్ వారియర్స్, అజింకా పవార్‌ను రూ. 1.17 కోట్లతో బెంగుళూరు బుల్స్, సునీల్ కుమార్‌ను రూ. 1.015 కోట్లతో యు ముంబా టీమ్‌ల యాజమాన్యాలు దక్కించుకున్నాయి. తక్కిన ప్లేయర్స్‌ను కూడా లక్షల రూపాయలు వెచ్చించి ఆయా టీమ్‌ల యాజమాన్యాలు సొంతం చేసుకున్నాయి. ఆటలో మంచి ప్రదర్శన చూపించిన వారికి కొంత మంది స్పాన్సరర్లు అదనపు అవార్డుల కింద నగదు బహుమతులు ప్రధానం చేస్తారు.
ప్రొ కబడ్డీ 2014లో తెరపైకి వచ్చింది. తొలి సీజన్ 2014లో మొదలైంది. అప్పటి వరకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆడే ఆటగాళ్లకు ఒక్క సారిగా డిమాండ్ పెరిగింది. నాడు ఆటగాళ్ల ధరలు లక్షల్లో ఉంటే నేడు అది కోట్లకు పెరిగింది. రూ. 12.80 లక్షల పెట్టి నాటి ఇండియన్ కబడ్డీ కెప్టెన్‌గా ఉన్న రాకేష్ కుమార్‌ను పాట్నా పైరేట్స్ సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఇండియాకు ఆడుతున్న దీపక్ హుడాను రూ. 12.6లక్షలు పెట్టి తెలుగు టైటాన్స్ దక్కించుకుంది. కబడ్డీ ఆటగాడు అంత మొత్తం సంపాదించడం అనేది అసాధ్యం. ప్రో కబడ్డీ సీజన్ రావడంతో కబడ్డీ ఆటగాళ్ల దశ, దిశ మారిపోయింది. గుర్తింపుతో పాటు గౌవరం కూడా పెరిగింది. దీంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం వచ్చింది.
Next Story