
జూనియర్ ఎన్టీఆర్‌ను కూల్ చేయడానికేనా
బంధుత్వాన్నే కాదు ఆత్మీయతను,స్నేహాన్ని పంచుకున్నాం అంటూ నందమూరి హరికృష్ణ వర్థంతి సందర్భంగా స్పందించిన చంద్రబాబు, లోకేష్.
నందమూరి హరికృష్ణ మీద సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆత్మీయతను, స్నేహాన్నీ పంచుకున్నామని సీఎం చంద్రబాబు, హరి మామయ్య అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు తాజాగా చర్చనీయాంశంగా మారింది. హరికృష్ణ వర్థంతి సందర్భంగా వీరిద్దరు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మా మధ్య కేవలం బంధుత్వమే కాదు అంతకు మించి ఎక్కువ ఆత్మీయత, స్నేహాన్ని మేమిద్దరం పంచుకున్నాం అంటూ సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. అంతేకాకుండా టీడీపీని, నందమూరి అభిమానులను కూడా ప్రస్తావనకు తెచ్చారు. కుటుంబ సభ్యులకే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, నందమూరి అభిమానులకు కూడా హరికృష్ణ ఆత్మీయతను పంచిన మంచి మనిషి అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
హరి మామయ్యకు నివాళులు అర్పిస్తున్నట్టు పేర్కొన్న లోకేష్.. హరికృష్ణ రాజకీయ, సినీ ప్రయాణాల గురించి ప్రస్తావించారు. రాజకీయ రంగానికి, సినీ రంగానికి హరి మామయ్య చేసిన సేవలను స్మరించుకుందామని, హరి మామయ్య లేని లోటు తీర్చలేనిది అంటూ ట్వీట్ చేశారు.
మరో వైపు గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, తెలుగుదేశం పార్టీకి మధ్య చిన్న పాటి వార్ జరుగుతోంది. అనంతపురం అర్భన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీర్ మీద చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒక్క సారిగా భగ్గుమన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను, ఆయన తల్లిని అసభ్యకరంగా మాట్లాడారని రోడ్డెక్కారు.
ఏపీలో ప్రెస్ మీట్లు పెట్టడానికి అధికార పక్షం అవకాశం ఇవ్వక పోవడంతో వారు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తాము కూడా టీడీపీ అభిమానులమే అని, కానీ జూనియర్ ఎన్టీఆర్‌ను, ఆయన తల్లిని కించపరుస్తూ మాట్లాడితే ఊరుకునేది లేదని అల్టిమేటం కూడా ఇచ్చారు. ఇదే అంశంపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. తనపైన వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని సున్నితంగానే హెచ్చరించారు. ఇలాంటి పనులు పక్కన పెట్టి ప్రజల సమస్యల మీద పని చేయండి అంటూ స్మూత్‌గానే హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మీద, మంత్రి నారా లోకేష్‌ల మీద దృష్టి మళ్లింది. జూనియర్ ఎన్టీఆర్ మీద, ఆయన తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతరం పురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తారా? ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారనే దానిపై అందరూ ఎదురు చూశారు. కానీ ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయలేదు. ఈ క్రమంలో అటు జూనియర్ ఎన్టీఆర్‌కు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు మధ్య మనస్పర్థలు వచ్చాయి, దీని వల్ల వారి మధ్య గ్యాప్ పెరిగిందనే చర్చ కూడా ఉంది.
ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌ను కూల్ చేసేందుకే అతని తండ్రి నందమూరి హరికృష్ణ వర్థంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌లు స్పందించారని జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో చర్చి వినిపిస్తోంది. తమ ఇద్దరి మధ్య కేవలం బంధుత్వమే కాదు, ఆత్మీయత, స్నేహం ఉండేవని సీఎం చంద్రబాబు ప్రస్తావించడం, హరి మామయ్య అంటూ నారా లోకేష్ స్పందించడం కూడా ఎన్టీఆర్‌ను కూల్ చేయడంలో భాగమనే చర్చ కూడా వినిపిస్తోంది.
Next Story