
ప్రమాద స్థలిలో నిలిచిన టాటానగర్ ఎక్స్‌ప్రెస్
విశాఖ సమీపంలో తప్పిన ఘోర రైలు ప్రమాదం..!
వైజాగ్–విజయనగరం రూటులో వెళ్తున్న టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పది, ఇరవై కాదు.. దాదాపు రెండు వేల మంది రైలు ప్రయాణికుల ప్రాణాలు బుగ్గిపాలయ్యేవి. రైలు లోకో పైలట్ సమయస్ఫూర్తి, అప్రమత్తతతో వీరందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన గురించి తెలిసిన వారంతా లోకో పైలట్ రూపంలో ఆ దేవుడే రక్షించాడు.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? ఏం జరిగింది?
లోకో పైలట్ అప్రమత్తతే అందరినీ కాపాడింది..
విశాఖపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలోరి పెందుర్తి సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఓవర్‌హెడ్ విద్యుత్ (ఓహెచ్‌ఈ) స్తంభాల మార్పిడి పనులు చేస్తున్నారు. ఈ మార్పిడి సమయంలో విద్యుత్ స్తంభం ఒక పక్కకు ఒరిగిపోయి ఆ పక్కనే ఉన్న ఓహెచ్‌ఈ విద్యుత్ వైర్లపై పడింది. దీంతో ఆ స్తంభానికి విద్యుత్ సరఫరా జరిగింది. అదే సమయంలో దువ్వాడ నుంచి విజయనగరం వైపు వేగంగా టాటానగర్ ఎక్స్‌ప్రెస్ (18910 నంబరు) వస్తోంది. అప్పటికే సమీపం నుంచి గమనించిన లోకో పైలట్ అప్రమత్తమై రైలుకు సడన్ బ్రేక్ వేశారు. అప్పటికే వేగంగా వస్తున్న రైలు విద్యుత్ ప్రవహిస్తున్న ఓహెచ్‌ఈ పోల్‌కు రెండంటే రెండే మీటర్ల చేరువ వరకు వచ్చి ఆగింది. అలా ఆగకుండా రెండు మీటర్లు ముందుకెళ్లి ఉంటే ఆ రైలంతటికీ విద్యుత్ ప్రవాహం జరిగి ఘోర ప్రమాదం సంభవించి ఉండేదని అక్కడ పరిస్థితిని చూసిన వారు నిట్టూరుస్తున్నారు.
ఓహెచ్‌ఈ స్తంభాన్ని తొలగిస్తున్న రైల్వే సిబ్బంది
రైలులో రెండు వేల మంది..
ఈ టాటానగర్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం ఎర్నాకులంలో బయలుదేరింది. బుధవారం సాయంత్రం దువ్వాడ హాల్టు నుంచి బయల్దేరి పెందుర్తి మీదుగా విజయనగరం వెళ్తోంది. ఈ రైలులో సుమారు రెండు వేల మంది ప్రయాణికులున్నారు. రైలంతా విద్యుత్ ప్రవహించి ఉంటే ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేది కాదు. ఎక్స్‌ప్రెస్ రైలు విద్యుత్ స్తంభానికి సమీపించడంతో ఆందోళన చెందిన రైల్వే సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
రైలు పునరుద్ధరణ పనుల్లో సిబ్బంది
ముగ్గురి సిబ్బందికి గాయాలు..
çఓహెచ్‌ఈ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాన్ని మారుస్తున్న వారిలో ఇద్దరు రైల్వే సిబ్బంది సహా ముగ్గురు విద్యుత్ షాక్‌కు గురై గాయపడ్డారు. వీరిలో కాశ్యప్ అనే వ్యక్తికి త్రీవ గాయాలయ్యాయి. వీరిని విశాఖలోని ఆస్పత్రికి తరలించారు.
సమస్యను సరి చేశాక రైలును పంపుతున్న అధికారులు
40 నిమిషాల పాటు నిలిచిన రైలు..
ఈ ప్రమాదం కారణంగా టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రాక్‌పై 40 నిమిషాల సేపు నిలిచిపోయింది. పడిపోయిన ఓహెచ్‌ఈ స్తంభాన్ని తొలగించిన తర్వాత అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. అనంతరం ఆ రైలును విజయనగరం పంపించారు. ఈ రైలుతో పాటు మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి. రైలు ఒక్కసారిగా ఆగిపోవడంతో ఆందోళన చెందిన ప్రయాణికులు కిందకు దిగారు. అక్కడ విద్యుత్ లైన్‌పై ఓహెచ్‌ఈ స్తంభం పడి ఉండటాన్ని గమనించి కాసేపు భయకంపితులయ్యారు. లోకో పైలట్ అప్రమత్తతతో తామంతా ప్రాణాలతో బయటపడ్డామని అక్కడ పరిస్థితిని చూసిన వారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులతో పాటు రైల్వే సిబ్బంది లోకో పైలట్ సమయస్ఫూర్తికి మెచ్చుకుని అభినందించారు.
Next Story

