
ఎమ్మెల్యే క్షమాపణకు జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ ..అనంతలో మళ్లీ టెన్షన్
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రసాద్ ఇంటిని మరోమారు ముట్టడించిన జూనియర్ ఫ్యాన్స్
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దుగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగా క్షమాపణలు చెప్పాలంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇచ్చిన 48 గంటల డెడ్ లైన్ ముగియడంతో అనంతపురం లో మరోమారు టెన్షన్ వాతావరణం కన్పిస్తోంది.ఆదివారం ఉదయం మళ్లీ ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించడానికి జూనియర్ ఫ్యాన్స్ ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
ఎమ్మెల్యే నివాసాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడించనున్నారనే ముందస్తు సమాచారంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఆదివారం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నివాసంతోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసులు మోహరించారు. ఆ క్రమంలో ఆ ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేసి.. ఎమ్మెల్యే నివాసానికి వచ్చే మార్గాల్లో బ్యారికేడ్లను ఉంచారు.అయినా ఫ్యాన్స్ దూసుకు వచ్చే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులకు , జూనియర్ అభిమానులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇంకోవైపు గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపైకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు.వారిని పోలీసులు అడ్డుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు వెంటనే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తూ,ఆందోళనకు దిగారు.ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పకుంటే తెలుగుదేశం అధిష్టానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయామని వారు డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలో ఎక్కడికక్కడ వాహనదారులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అలాగే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా జిల్లా పోలీస్ యాంత్రాంగం చర్యలు చేపట్టింది.
అసలు ఎమ్మెల్యే ఏంచేశారు...
జూనియర్ ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ ఒక ఆడియో మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఎమ్మెల్యేపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.ఆడియో బైటకు వచ్చిన వెంటనే ఆగ్రహించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆరోజే ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు.జూనియర్ కు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ 48 గంటల టైం ఇచ్చారు. ఆ గడువు దాటినా ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పక పోవడంతో మరోమారు ఆయన నివాసం ముట్టడికి ఫ్యాన్స్ ప్రయత్నించారు.
ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు అసంతృప్తి
అనవసర వివాదాల జోలికి వెళ్లోద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యే ప్రసాద్ ను మందలించారు.తాజాగా జరిగిన మంత్రివర్ఘ సమావేశంలో కొందరు ఎమ్మెల్యేల వివాదాలపై చర్చించిన చంద్రబాబు ,తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు.ఈ పరిణామం తరువాత అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ , ముఖ్యమంత్రిని కలిసి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో జరిగిన వివాదాన్ని వివరించారు. తాను కావాలని జూనియర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ కూడా ఇచ్చుకున్నారు.అటు చంద్రబాబు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టి మందలించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.దానితో వివాదం ముగిసిపోతుందని భావించినా క్షమాపణలు చెప్పని ఎమ్మెల్యే తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం గరంగరంగా వున్నారు.
Next Story