మళ్ళీ మానికొండ లాంటి ఎడిటర్ వస్తారా?
జర్నలిజాన్ని బతికించేందుకు...
ప్రస్తుత సంక్షోభ సమయంలో జర్నలిస్టులు మరోసారి పాత్రికేయ ఉద్యమ పితామహుడు మానికొండ చలపతి రావు చూపిన దారిలో ఐక్యంగా తమ గళాన్ని వినిపించాల్సిన ఆవశ్యకత ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సీనియర్ జర్నలిస్టు ఆకుల అమరయ్య రాసిన భారతీయ జర్నలిజం ధృవతార మానికొండ చలపతిరావు పుస్తక పరిచయ సభ ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. నేషనల్ ఎలయెన్స్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఎన్.ఏ.జే), హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సభకు ఎన్ఏజే సెక్రటరీ జనరల్ ఎన్.కొండయ్య అధ్యక్షత వహించారు. ఈ సభలో సీనియర్ జర్నలిస్టు, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎస్. వినయ్ కుమార్, ప్రెస్ క్లబ్ పూర్వ అధ్యక్షుడు, ఎమెస్కో ప్రచురణాలయం సంపాదకులు జి.వల్లీశ్వర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎల్. వేణుగోపాల్ నాయుడు, సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, నందిరాజు రాధాకృష్ణ, ఆకాశదర్శన్ ప్రోగ్రామ్ స్టాఫ్ అసోసియేషన్ నాయకుడు వలేటి గోపిచంద్, ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, టైమ్స్ ఆఫ్ ఇండియా లీగల్ ఎడిటర్ ఎం.సాగర్ కుమార్, పీకాక్ క్లాసిక్స్ సంపాదకుడు ఏ.గాంధీ, సీనియర్ జర్నలిస్టు తాడి ప్రకాశ్, మిరియాల వెంకట్రావ్ ఫౌండేషన్ ట్రస్టీ పి.రామమోహన్ నాయుడు తదితరులు ప్రసంగించారు.
ఎంసీ చరిత్ర నేటి తరానికి ఆదర్శనం..
మానికొండ చలపతిరావు ఎలియాస్ ఎంసీ జీవితం నేటి జర్నలిస్టు తరం ఆదర్శంగా తీసుకోవాలని, ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎంసీపై పుస్తకాన్ని తీసుకురావడం ముదావహం అని జి.వల్లీశ్వర్ అన్నారు. ఎంసీ లాంటి వాళ్లు ఉద్యమించడం వల్లే నేడు ఈ మాత్రమైనా జర్నలిస్టులకు వేతనాలు, భద్రత ఉందన్నారు. జర్నలిస్టులకు వేతన బోర్డు రావడం వెనుక మానికొండ చలపతిరావు కృషి అపారమని, తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో, ఆయన కుమార్తె ఇందిరా గాంధీతో ఉన్న పరిచయాన్ని తన సొంతానికి కాకుండా యావత్ జర్నలిస్టుల శ్రేయస్సు కోసం వినియోగించిన మహనీయుడు ఎంసీ అని కొనియాడారు. ఈ పుస్తకాన్ని ప్రచురించిన మిరియాల వెంకట్రావ్ ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు.
పత్రికా స్వేచ్ఛంటే యజమానుల స్వేచ్ఛ కాదన్న ఎంసీ...
సంపాదకులు చెప్పిందే వేదంగా నడిచిన కాలంలో మానికొండ చలపతిరావు 30 ఏళ్లపాటు జవహర్ లాల్ నెహ్రూ పెట్టిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారని వినయ్ కుమార్ చెప్పారు. నైతిక విలువలు, వృత్తిపట్ల అంకిత భావం, పాఠకులకు సులువుగా అర్థమయ్యే రీతిలో రాయడం వంటి లక్షణాలను నేటి జర్నలిస్టులు నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. జేబులో రాజీనామా లేఖను పెట్టుకుని ఎంసీ... నెహ్రూతో మాట్లాడేవారని, పత్రికా స్వేచ్ఛంటే యజమానుల స్వేచ్ఛ కాదని, వార్తలు స్వేచ్ఛగా రాసేందుకు జర్నలిస్టులకు ఉండాల్సిన స్వేచ్ఛ అని మానికొండ వాదించేవారని చెప్పారు. నేటి పత్రికా యాజమాన్యాలు ప్రభుత్వాలకు పూర్తిగా సరెండర్ అయి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి జర్నలిస్టులు మరోసారి ఉద్యమించి తమకున్న హక్కుల్ని కాపాడుకోవాలన్నారు.
మరో సినియర్ జర్నలిస్టు నందిరాజు రాథాకృష్ణ మాట్లాడుతూ అన్ని యూనియన్లు ఐక్యంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని, అందుకు ఎంసీని స్పూర్తిగా తీసుకోవాలన్నారు.
వి.గోపీచంద్ మాట్లాడుతూ..ఎంసీ అంటే ఎవరో గుప్పెడు మందికి కూడా తెలియని స్థితిలో నేటి జర్నలిస్టులు ఉన్నారని, భావి తరాలకు మానికొండ చలపతిరావు చేసిన సేవలు తెలియాలంటే ఆయన పేరిట ప్రతి ఏటా ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఎంసీ పుస్తకాన్ని ప్రచురించడం వెనుకున్న ఉద్దేశాన్ని మిరియాల వెంకట్రావ్ ఫౌండేషన్ నిర్వాహకుడు పి.రామమోహన్ వివరించారు.
లబ్ధప్రతిష్టులైన ఎంసీ లాంటి జర్నలిస్టుల పేరిట ఎటువంటి కార్యక్రమం నిర్వహించినా సహకరించేందుకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎల్లవేళలా సహకరిస్తుందని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎల్.వేణుగోపాల్ వివరించారు. సభా హక్కుల పేరిట పత్రికా స్వేచ్ఛను హరించేందుకు వీలు లేదని గళమెత్తిన వాడు ఎంసీ అని టైమ్స్ ఆఫ్ ఇండియా లీగల్ ఎడిటర్ ఎం.సాగర్ కుమార్ అన్నారు. పాశం యాదగిరి మాట్లాడుతూ ఎంసీని కొలవడానికి లేదా తూయడానికి ఎవరి వద్దా తూనిక రాళ్లు లేవని, నెహ్రూను మించిన వాడు ఎంసీ అని కొనియాడారు.
పుస్తక రచయిత అమరయ్య మాట్లాడుతూ ఈ దేశంలో పద్మభూషణ్ లాంటి అవార్డును తిరస్కరించిన ఏకైక జర్నలిస్టు మానికొండ చలపతి రావు అని అన్నారు. విపరీతంగా పుస్తకాలు చదివిన ప్రపంచ ప్రముఖులు ఇద్దరే ఇద్దరని, వారిలో బ్రిటన్ మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ ఒకరు కాగా రెండో వ్యక్తి మన తెలుగువాడు, జర్నలిస్టు ఉద్యమ పితామహుడు మానికొండ చలపతిరావేనని వివరించారు. ఈ పుస్తకాన్ని తీసుకురావడంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు సభకు స్వాగతం పలికారు. ఎన్ఏజే సెక్రటరీ జనరల్ ఎన్.కొండయ్య సభకు వందన సమర్పణ చేశారు.