రాజకీయ పేరడీలోకి జొన్నవిత్తుల
x

రాజకీయ పేరడీలోకి జొన్నవిత్తుల

పేరడీలకు ప్రసిద్ధిగా పేరు తెచ్చుకున్న జొన్నవిత్తుల ఎన్నికల రంగంలోకి దిగారు. దీనిపైనా పేరడీలు రాసీ పేలుస్తారేమో.


ప్రముఖ సినీ గేయ రచయిత, కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పొలిటికల్‌ ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరో ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది. జొన్నవిత్తుల 2024 ఎన్నికల బరిలో నిలిచారు. విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఆయన పోటీకి దిగారు. ఏ పార్టీకి సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఆ మేరకు ఆయన గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. జొన్నవిత్తుల ఎన్నికల బరిలోకి దిగడం ఇప్పుడు విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ నియోజక వర్గంలో హాట్‌ టాపిక్‌గా మారింది. గెలుపు, ఓటమలను పక్కన పెడితే జొన్నవిత్తుల ఎన్నికల రంగంలోకి దిగడం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది.

విజయవాడ సెంట్రల్‌ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, విజయవాడ వెస్ట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు బరిలో ఉండగా, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, కాంగ్రెస్, కమ్యునిస్టుల కూటమి అభ్యర్థిగా సీపీఎం సీనియర్‌ నేత సిహెచ్‌ బాబురావు బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన జొన్నవిత్తుల ఏమేరకు పోటీ ఇస్తారనేది తాజాగా స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది.
సామాజిక వర్గం బలముందనే జొన్నవిత్తుల పోటీ
ప్రముఖ కవి, పేరడీ పాటల మాంత్రికుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు విజయవాడ సెంట్రల్‌ వర్గం నుంచి పోటీలో ఉండటానికి ప్రధాన కారణం ఆయన సామాజిక వర్గం ఆదరిస్తుందని. ఈ నియోజక వర్గంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు సుమారు 35వేల నుంచి 40 వేల వరకు ఉంటారని అంచనా. అందుకే ఆయన విజయవాడ సెంట్రల్‌ నియోజక వర్గాన్ని ఎంచుకున్నట్లు స్థానికుల్లో చర్చ సాగుతోంది. ఇక్కడ జరిగే చతుర్ముఖ పోటీలో నన్ను అభిమానించే ఓటర్లే కాకుండా నా సామాజిక వర్గం వారు ఖచ్చితంగా నన్ను ఆదరించి అక్కున చేర్చుకుంటారనే నమ్మకంలో ఆయన ఉన్నారు. నిజానికి సామాజిక వర్గం ఓట్లన్నీ గతంలో మల్లాది విష్ణుకు వేసి ఉంటే భారీ మెజారిటీతో గెలవాల్సింది. ఒక సారి మూడంకెలు దాటక పోగా రెండో సారి కేవలం రెండంకెలు అంటే 25 ఓట్ల ఆధిక్యంతోనే గెలిచారు. అటువంటప్పుడు కులం కార్డు పని చేయదని, సెంట్రల్‌ నియోజక వర్గం ఓటర్లు నిరూపించాల్సిన అవసరం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కులం పిచ్చిలో మునిగి తేలుతున్న కొందరు మాత్రం ఆ జాఢ్యాన్ని వదిలించుకోకుండా కులం అండ ఉందనే చెప్పుకుంటూ అడుగులు వేయడం కొంత వరకు ఆశ్చర్యానికి కలిగిస్తుంది. ఇనేళ్ల కాలంలో ఏ ఒక్క రోజు కూడా నియోజక వర్గంలో తిరగడం కానీ, సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కానీ చేయని జొన్నవిత్తుల ఇప్పుడు పోటీ చేస్తున్నారంటే దీనిని ఏమనుకోవాలోనని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
గతంలో జై తెలుగు పార్టీ ఏర్పాటు
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించిన విధంగానే ఇంచు మించు అదే రూపంతో జొన్నవిత్తుల గతేడాది జై తెలుగు పార్టీ పేరుతో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. విజయవాడ వేదికగానే దానిని ప్రకటించారు. తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణ కోసం ఒక రాజకీయ వేదికగా జై తెలుగు పార్టీని ఏర్పాటు చేశారు. అటు ప్రజలకు, ఇటు రాజకీయ నాయకులకు తెలుగు భాష, తెలుగు సంస్కృతిల మీద అవగాహన కల్పించడంతో పాటుగా అందరినీ చైతన్య వంతులుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు నాడు పేర్కొన్నారు. నీలం, పచ్చ, ఎరుపు, బంగారం, తెలుపు రంగులతో కూడిన ఐదు రంగులతో కూడిన జెండాను కూడా రూపకల్పన చేశారు. దీంతో పాటుగా ఒక రథం గుర్తు కూడా పెట్టారు. నీలం రంగు జలవనరులు, ఆకుపచ్చ రంగు వ్యవసాయ అభివృద్ధి, ఎరుపు వర్ణం శ్రమశక్తి, పారిశ్రామిక అభివృద్ది, బంగారు వర్ణం వ్యవసాయ వైభవం, తెలుపు సమాజంలోని శాంతికి చిహ్నంగా జై తెలుగు పార్టీ పతాకంగా రూపకల్పన చేశారు. తెలుగు భాష రథాన్ని ప్రజలు లాగాలనే ఉద్దేశంతో రథం గుర్తు పెట్టారు. గిడుగు రామ్మూర్తి, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్‌ ఫొటోలను కూడా జెండాపై పొందుపరచారు. వీరందరూ తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేశారని, అందుకే వీరి చిత్రాలను జెండాలో పొందుపరచినట్లు పేర్కొన్నారు. ఇదే పార్టీ నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని గతంలో ప్రకటించారు.అయితే తాజాగా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగడం విశేషం.
రెండు సార్లు మల్లాది విష్ణు గెలుపు
విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ నియోజక వర్గం 2008లో ఏర్పాటు చేశారు. 2009లో తొలి సారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన మల్లాది విష్ణు గెలుపొందారు. పీఆర్పీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన వంగవీటి రాధాకృష్ణపై మాల్లది విష్ణు విజయం సాధించారు. తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన బొండా ఉమా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గౌతంరెడ్డి మీద గెలిచారు. ఆ తర్వాత 2019లో మల్లాది విష్ణు వైఎస్‌ఆర్‌సీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మల్లాది విష్ణు కేవలం 25 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి బొండా ఉమాపై గెలిచారు. ఈ నియోజక వర్గం ఏర్పడిన తర్వాత 2009, 2019 ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణు గెలిచారు. ఈ నియోజక వర్గంలో 35వేల నుంచి 40వేల వరకు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు ఉంటాయనేది అంచనా.
పేరడీల రచయితగా ఫేమస్‌
జొన్నవిత్తుల పేరడీల రచయితగా ప్రఖ్యాతి గాంచారు. శ్రీశ్రీ మహాప్రస్థానం, జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన పుష్ప విలాపం వంటి వాటికి పేరడీలు రాశారు. ఈయన రాసిన వాటిల్లో దేశమును ప్రేమించుమన్నా అనే గీతానికి పేరడీగా పెండ్లామును ప్రేమించుమన్నా అనే పేరడీ బాగా ఫేమస్‌ అయ్యింది. ఈయన ప్రముఖ తెలుగు కవి, సినీ గేయ రచయిత. సుమారు 600లకుపైగా పాటలు రాశారు. 1997లో తెలుగు అధికార భాషా సంఘం మాజీ సభ్యులుగా పని చేశారు. రాజేంద్రప్రసాద్‌ హీరోగా నటించిన పెళ్లాంపిచ్చోడు సినిమాకు దర్శకత్వం వహించారు. ఈయన విజయవాడ వాస్తవ్యులు.




Read More
Next Story