‘తవ్విపోస్తుంటే ఏం చేస్తున్నారు’.. అధికారులను నిలదీసిన జేసీ
x

‘తవ్విపోస్తుంటే ఏం చేస్తున్నారు’.. అధికారులను నిలదీసిన జేసీ

విశాఖలోని ఎర్ర మట్టి దిబ్బల అక్రమ తవ్వకాలు తీవ్ర దుమారం రేపుతోంది. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని జాయింట్ కలెక్టర్ అధికారులపై మండిపడ్డారు.


విశాఖ తీరంలోని ఎర్రమట్టి కొండలను భౌగోళిక సంపదగా పేర్కొంటారు. ఇవి ప్రస్తుతం రియల్ ఎస్టేట్ లేఅవుట్‌లుగా మారిపోతున్నాయి. సర్వే నంబర్ 118/5లో అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. జేసీబీలు పెట్టి మరీ తవ్వకాలను సాగిస్తున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. దీనిపై జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ కూడా ఘాటుగా స్పందించారు. ఇంత విధ్వంసం జరుగుతున్నా, కళ్ళ ముందరే జేసీబీలతో అక్రమంగా మట్టిని తవ్వుకు పోతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు సమగ్ర వివరాలతో నివేదిక అందించాలని, అదే విధంగా వారు ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదో వివరణ కూడా ఇవ్వాలని ఆదేశించారు. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం కూడా కన్నెర్ర చేస్తోంది. ఈ పర్యావరణ విధ్వంసం ఎవరి అలసత్వానికి ప్రతీక అని సీరియస్ అయింది.

ఈ నేపథ్యంలోనే జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం విచ్చలవిడిగా, అడ్డగోలుగా అనుమతులు ఎందుకు ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది కూటమి సర్కార్. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో విశాఖపట్నం జిల్లా భీమిలిలోని ఎర్రమట్టి దిబ్బల దగ్గరకు జేసీ, రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలింాచరు. అక్కడ భారీ ఎత్తున తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. అవన్నీ కూడా అక్రమంగా జరిగిన తవ్వకాలేనని రెవెన్యూ శాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఇదిలా ఉంటే అధికారులు వస్తున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో తవ్వకాల నిర్వాహకులు అక్కడి నుంచి యంత్రాలు, లారీలను తరలించేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటిని గ్రహించిన జేసీ అధికారులపై మండిపడ్డారు.

‘‘ఇంతటి స్థాయిలో అక్రమ తవ్వకాలు జరుగుతుంటే చోద్యం చూస్తూ ఉన్నారా. లారీలు, జేసీబీలు తిరగడానికి ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేసుకుని మరీ తవ్వకాలు చేస్తుంటే అసలు ఏం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి సమాచారంతో నివేదిక ఇవ్వండి. అదే విధంగా ఇంత అక్రమం జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారో కూడా వివరణ ఇవ్వాలి’’ అని ఆగ్రహించారు అశోక్. ఈ అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారిని గుర్తించడానికి కూడా చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read More
Next Story