ప్రభుత్వ పాలిటెక్నిక్ లో చదివితే ఉద్యోగం గ్యారెంటీ
x
Government Polytechnic College, Visakhapatnam.

ప్రభుత్వ పాలిటెక్నిక్ లో చదివితే ఉద్యోగం గ్యారెంటీ

పాలిటెక్నిక్ పూర్తి కాగానే ఉద్యోగం వచ్చేలా చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొంత వరకు సఫలం అవుతూ వస్తోంది.


ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులు ఎక్కువ మంది ఇటీవల పాలిటెక్నిక్ కోర్స్ లను ఎంపిక చేసుకుంటున్నారు. ఇంజనీరింగ్ డిగ్రీతో సమానంగా పాలిటెక్నిక్ కోర్స్ లు ఉంటున్నందున ఉద్యోగానికి ఇదే మంచి పునాది అనే ఆలోచనలో విద్యార్థులు ఉన్నారు. అయితే ఇప్పటికీ చాలా మంది యువత, వారి కుటుంబాలు డిప్లొమా కంటే ఇంజనీరింగ్ డిగ్రీని ఉన్నత విద్యగా భావిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేయడం వల్ల సామాజిక గౌరవం, మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనే ఆలోచన విద్యార్థుల్లో ఉంది.

పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారికి పరిశ్రమల్లో టెక్నీషియన్, సూపర్‌వైజర్ వంటి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ అవకాశాల గురించి యువతకు తగినంత సమాచారం అందడం లేదని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. కంపెనీలు ఏపీలోనే కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా మంచి నాలెడ్జీ ఉన్న వారికి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. డిప్లొమా పూర్తి చేసిన వారికి ప్రారంభంలో లభించే జీతాలు డిగ్రీ హోల్డర్లతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. ఇది వారిని ఉద్యోగాల వైపు మొగ్గకుండా చేస్తుందని చెప్పొచ్చు.

ఇంజనీరింగ్ డిగ్రీనే గొప్పదనే భావన...

ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉన్నత స్థాయి ఉద్యోగాలు, మంచి జీతాలు, విదేశీ అవకాశాలు లభిస్తాయని నిరుద్యోగులు భావిస్తున్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారు AP ECET వంటి పరీక్షల ద్వారా ఇంజనీరింగ్ డిగ్రీలో రెండో సంవత్సరంలో చేరే అవకాశం ఉంది. ఈ విధంగా చేరటం వల్ల విద్యార్థులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. డిగ్రీ ఉన్నవారికి పదోన్నతులు, ఉన్నత స్థానాలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే నమ్మకం ఉన్నందున ఎక్కువ మంది పాలిటెక్నిక్ వైపు చూడటం లేదు.


ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు ఎన్ని ఉన్నాయి?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు 81 ఉండగా ఒక ఎయిడెడ్ కాలేజీ ఉంది. ఇందులో 81కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానించారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు 688 పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నాయి. చదువుకునే సమయంలో ఆరు నెలల పాటు పరిశ్రమల సందర్శన, పరిశ్రమల ఆధారిత కరిక్యులం తయారు చేయడం, ప్రయోగశాలల ఏర్పాటు, ప్రాంగణ నియామకాల ద్వారా ఉద్యోగ కల్పన ప్రభుత్వం చేపడుతోంది.

ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో వారికి ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి?

ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో ప్లేస్‌మెంట్‌లు కళాశాల స్థానం, శిక్షణ నాణ్యత, పరిశ్రమలతో సంబంధాలపై ఆధారపడి ఉంటాయి. విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లోని పాలిటెక్నిక్‌లలో ప్లేస్‌మెంట్‌లు సంతృప్తికరంగా ఉన్నాయి. ఇక్కడ ISUZU, KIA Motors, హిందుజా గ్లోబల్ సొల్యూషన్స్ వంటి కంపెనీలు విద్యార్థులను ప్లేస్మెంట్స్ ద్వారా తీసుకుంటున్నాయి.

ప్రైవేట్ పాలిటెక్నిక్‌లు ఎన్ని ఉన్నాయి?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల సంఖ్య దాదాపు 175వకు ఉంది. ఈ సంఖ్య AICTE ఆమోదం, కొత్త కళాశాలల స్థాపన ఆధారంగా మరో 25 పెరిగే అవకాశం ఉంది. ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో ప్లేస్‌మెంట్‌లు సాధారణంగా ప్రభుత్వ కళాశాలల కంటే మెరుగ్గా ఉంటాయి. ఎందుకంటే చాలా ప్రైవేట్ సంస్థలు పరిశ్రమలతో ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంటాయి. ఉదాహరణకు శ్రీ విద్యానికేతన్ వంటి కళాశాలలు ఇండస్ట్రీ-ఓరియెంటెడ్ శిక్షణ ఇస్తాయి. అయితే అన్ని ప్రైవేట్ కళాశాలల్లో ఈ స్థాయి ప్లేస్‌మెంట్‌లు ఉండే అవకాశం లేదు. కొన్ని చిన్న సంస్థలలో ప్లేస్‌మెంట్ సౌకర్యం లేకపోవడం కూడా కనిపిస్తోంది.


తిరుపతి పాలిటెక్నిక్ కాలేజీలో స్పెషల్ క్లాసులకు హాజరైన విద్యార్థినిలు

పాలిటెక్నిక్ డిప్లొమా వారికి జీతాలు ఎలా ఉంటున్నాయి

పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారికి ప్రారంభ జీతం సాధారణంగా రూ. 15,000 నుంచి రూ. 25,000 వరకు ఉంటుంది. ఇది ట్రేడ్, కంపెనీ అనుభవంపై ఆధారపడి ఉంటుంది. అనుభవం పెరిగే కొద్దీ జీతం రూ. 40,000 లేదా అంతకంటే ఎక్కువకు చేరుతుంది. కియా, హుందాం స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్, ఓఎన్‌జీసీ, బెర్జన్ పెయింట్, కజారియా సిరామిక్, గంగవరం పోర్టు వంటి కంపెనీలు పాలిటెక్నిక్ ల్యాబ్ లు ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో డిమాండ్ ఉన్న ట్రేడ్‌లు

ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్, విద్యుత్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టులు, IT సెక్టార్‌లో పెరుగుతున్న డిమాండ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రంగలో ఏపీ విద్యార్థులకు మంచి డిమాండ్ ఉంది. టెలికాం, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి.


ఉపాధి లక్ష్యంగా సాంకేతిక విద్యాశాఖ అడుగులు...

సాంకేతిక విద్యాశాఖ (DTE) HCL టెక్, అవెరా ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఇందులో ఇంటర్న్‌షిప్‌లు, శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో ప్లేస్‌మెంట్ సెల్స్ ఏర్పాటు చేసి, జాబ్ ఫెయిర్‌లు, క్యాంపస్ డ్రైవ్‌లు నిర్వహిస్తోంది. కరిక్యులమ్‌ను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సవరించడం, గెస్ట్ లెక్చర్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ నిర్వహించడం చేస్తోంది.

సాంకేతిక విద్య ద్వారా నైపుణ్యం పొందిన యువత Asc (Academic Staff College) ద్వారా కొంత మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. అయితే ఇది పూర్తిగా నిరుద్యోగ సమస్యను తొలగించలేకపోతోంది. డిప్లొమా పూర్తి చేసిన వారికి టెక్నీషియన్, సూపర్‌వైజర్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి.

94.3 శాతం ప్రాంగణ నియామకాలు

ఏపీలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు 9,145 మంది ఉన్నారు. వీరిలో 8630 మందికి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగావకాశాలు వచ్చినట్లు సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ జి గణేష్ కుమార్ బుధవారం తెలిపారు. 43 పాలిటెక్నిక్ కాలేజీలకు చెందిన విద్యార్థులకు దాదాపు నూరు శాతం ప్లేస్మెంట్ వచ్చినట్లు వెల్లడించారు. ఏడాదిలో జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రాంగణ నియామకాలకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, కొన్ని పరిశ్రమల నుంచి నియామక లేఖలు అందాల్సి ఉందన్నారు. ఈనెల చివరి నాటికి నూరు శాతం విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పిస్తామనే నమ్మకం ఉందని ఆయన చెప్పారు. టెక్సాస్ ఇనుస్ట్రుమెంట్స్, థాట్ వర్క్స్, జనరల్ ఎలక్ట్రిక్ ఏరేస్పేస్, మేధా సర్వోడ్రైవ్స్, ఎప్ట్రానిక్స్ సిస్టమ్స్, హెచ్ ఎల్ మాండో ఆనంద్ ఇండియా, వీల్స్ ఇండియా, అమరరాజా తదితర కంపెనీలు ప్రాంగణ నియామకాలు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అత్యధికంగా ఏడాది వేతన ప్యాకేజీ రూ. 9.02 లక్షలు కాగా, అతి తక్కువగా రూ. 1.8 లక్షలు ఉందని తెలిపారు. సరాసరి వేతన ప్యాకేజీ రూ. 2.20 లక్షలుగా ఉన్నట్లు వివరించారు.

Read More
Next Story