
‘మా పచ్చని పొల్లాల్లో ఆయుధాల డిపో వద్దు, సార్’
నేడు జాతీయ గిరిజన కమిషన్ ఏలూరు జిల్లా పర్యటనలో వినతిపత్రం సమర్పించాలనుకుంటున్న గిరిజనుు
నేడు నేషనల్ ST కమిషన్ చెైర్మన్ అంతర్ సింగ్ ఆర్య ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం సందర్శిస్తున్న సందర్బంగా ప్రత్యేక వ్యాసం. జీలుగుమిల్లి ప్రజలు చైర్మన్ కు వినతి పత్రం సమర్పిస్తున్నారు.
-జువ్వాల బాబ్జీ
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు భూసేకరణ ప్రక్రియ ఒక సవాలుగా మారుతుంది.
కొన్ని రోజుల క్రితం పాడేరు జిల్లా, హుకుంపేట మండలంలోని మజ్జివలస గ్రామంలో చేపడుతున్న హైడ్రా ప్రాజెక్టు ను వ్యతిరేకిస్తూ గిరిజనులు వేలాది మంది నిరసన ప్రదర్శన చేసారు.
తర్వాత ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలంలోని వంకవారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో" నేవీ ఆయుధ డిపో "కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని దానికి వ్యతిరేకంగా స్థానిక గిరిజనులు ఆందోళనకు దిగుతున్నారు.
ఈ రెండు ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియ "పెసా"చట్ట ప్రకారం జరగాలి, కాబట్టి గిరిజనులు గ్రామసభలో ప్రాజెక్టు వ్యతిరేక తీర్మానం చేసి, వాటి ద్వారా కోర్టులో కేసులు వేయాలని ఆలోచన చేస్తున్నారు. అంతే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న 1/70 చట్టం, అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 అమలు చేయకుండా భూములు తీసుకుంటే ఊరుకునేది లేదంటున్నారు.
ఇక నిన్న అనకాపల్లిలో రాజయ్య పేట వద్ద నిర్మించే బల్క్ డ్రగ్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ రాష్ట్ర హోం మంత్రి అనిత కాన్వాయ్ కు అడ్డంగా రోడ్డు పై బైఠాయించి మత్యకారులు నిరసన కు దిగారు. ఇంకా కరేడు గ్రామంలో కూడా ఇదే పరిస్థితి.
దీనిని బట్టి భూసేకరణ అనేది చాలా క్లిష్టమైన పని అని స్పష్టమవుతుంది. అందులో ప్రజల భయాలు, ఆందోళనలు చాలా ఉన్నాయి . అవన్నీ ముందుగా తెలుసుకుని వాటిని నిరుత్తి చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి.
అలా కాకుండా పోలీసుల పహారా లో గ్రామ సభలు జరిపి భూములు తీసుకుంటే తర్వాత న్యాయ పరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని వల్ల అనుకున్న సమయంలో ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడం, వర్కింగ్ క్యాపిటల్ పెరిగి ప్రభుత్వం పై అదనపు ఆర్థిక భారం పడుతుంది.
ఈ సందర్భంగా మనం ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలంలోని వంకవారిగూడెం గ్రామంలో నిర్మించ తల పెట్టిన నేవీ ఆయుధ డిపో గురించి చర్చిద్దాం.
ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. దీని విధి విధానాలు,అమలు పర్యవేక్షణ అంతా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం ఉంటుంది.నేవీ ఆయుధ డిపో కోసం జిల్లా యంత్రాంగం ఇప్పటికే 1166ఎకరాల భూమిని గుర్తించి భూసేకరణ చేయాలని చూస్తుంది.ఇది గత ప్రభుత్వ హయాంలో ముందుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండి స్థానిక గిరిజనులు ఆయుధ డిపో ఏర్పాటు ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆయుధ డిపో గురించి రెండు వాదనలు వినిపించే వారున్నారు.
పోలవరం శాసన సభ్యులు చిర్రి బాలరాజు, మరియు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ లు ఈ ఆయుధ డిపో ఏర్పాటు వలన స్థానిక యువత కు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. అంతే కాకుండా బి. జె.పి పార్టీ నేతలు వంకావారిగూడెం వచ్చి ఆ ఇద్దరు నేతలకు పాలాభిషేకం చేసి పొగడ్తల తో ముంచెత్తారు.
ఎమ్మెల్యే మీడియా తో ఇలా అన్నారు: "ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక... గతంలో అక్కడ రెండు మూడు సార్లు గ్రామ సభలు నిర్వహించటం జరిగింది.ప్రజలందరూ కూడా కొంత అపోహలతో, భయ బ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రాజెక్టు ఇక్కడ కు వస్తే మనకు మంచి జరుగుతుందనే ఒక మెసేజ్ ను పాస్ చేయడం జరిగింది. దీని వలన లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. దీని వలన కేవలం 37 కుటుంబాల కు మాత్రమే ఇబ్బంది కలిగే పరిస్థితి. వారికి కూడా భూమికి భూమి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ 6.38 లక్షలు ఇస్తాం. ఇది వచ్చే ఏడాది జనవరి నుంచి నిర్మాణ పనులు చేపడతాం."
మరొక వైపు స్థానిక గిరిజనులు ఆయుధ డిపో ఏర్పాటు వలన తాము జీవనోపాధి కోల్పోతామని,సారవంతమైన భూములు తీసుకోవద్దు అని ఇక్కడ గిరిజన ప్రాంతాల్లోఏ అభివృద్ధి కోసం అయినా భూసేకరణ "పెసా" గ్రామసభ అనుమతి తో జరగాలని ఆ విధంగా ఆయుధ డిపో వ్యతిరేక తీర్మానం చేస్తామని అంటున్నారు.
అంతే కాకుండా ఈ నెల 21/9/2025 జిల్లాలో పోలీసు యాక్ట్ 30 ఉన్నప్పటికీ పోలీసులతో తోపులాటకి దిగి తాము దేనికైనా సిద్ధం అన్నట్లుగా నిరసన ప్రదర్శన చేసారు.
తర్వాత గ్రామంలో ఎమ్మెల్యే, ఎంపీ ల దిష్టి బొమ్మలు తగుల పెట్టారు. ప్రాజెక్టు ఏర్పాటు లో ప్రభుత్వం పట్టుదల గా ఉందని అనిపిస్తుంది. గిరిజనులు కూడా అంతే గట్టిగా వ్యతిరేస్తున్నారు.
అసలు నేవీ ఆయుధ డిపో అంటే ఏమిటి?
ఇది నేవీ మిలిటరీ ఉపయోగించే, పనిముట్లు ఆయుధ మందుగుండు సామాగ్రి మరియు నిల్వ చేయడం, నిర్వహణ, ఆయుధాల పంపిణీ మొదలైన కార్యకలాపాల కోసం ఉద్దేశించింది. ఇక్కడి నుండి ఆయుధాలను సమయానికి ఓడల కు చేర్చడం ముఖ్యోద్దేశ్యం.
1. నిల్వ
నేవీ కి చెందిన అనేక రకాల ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, మిస్సైల్స్ ఇతర మిలిటరీ ఉపయోగించే పనిముట్లు ఉంటాయి.
2. మరమత్తులు మరియు నిర్వహణ; మెకానికల్, ఎలెక్ట్రానిక్ గా మరమత్తులు,ఆధునికీకరణ చేయడం.
3. సరఫరా మరియు పంపిణీ;
4. కొత్త కొత్త ప్రయోగాలు
5. నేవీ మిలిటరీ అధికారులు, సిబ్బంది కి ఆయుధ సంబంధ విషయంలో శిక్షణ ఇస్తారు. వీటిలో. బాంబుల విస్ఫోటనం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలగునవి. గిరిజనులు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు?
ఈ ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టులోనూ, చింతలపూడి ఎత్తిపోతల పథకం లోనూ భూములు కోల్పోయిన గిరిజన నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలు స్థానిక గిరిజనులు చూస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కు ఇంకా చాలా మంది భూమికి భూమి కోసం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న విషయాలు అందరికీ తెలిసిందే. స్థానిక గిరిజనులు సాగు చేస్తున్న భూములు సారవంతమైనవి, వాణిజ్య పంటలైన పామాయిల్, వరీ, పొగాకు, సీడ్ మొక్క జొన్న పండిస్తున్నారు. కూటమి నాయకులు చెప్పినట్లు కేవలం 37 కుటుంబాలు మాత్రమే కాదు
మూడు గ్రామాల ప్రజలు పూర్తిగా ఖాళీ చేస్తారని, భూములు తీసుకుంటే సరిహద్దు గ్రామాల్లో ప్రజలకు కూలీ పనులు దొరకని అంటున్నారు. ఒక పంచాయితీ మొత్తం భూములు తీసుకుంటే అక్కడ ఇండ్లు ఉన్నా లాభమేంటి అని ప్రశ్నిస్తున్నారు. అసలు మా గిరిజన ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియ అధికారుల కు తెలుసా? నేవీ ఆయుధ డిపో లో బాధితులకు ఇచ్చే ఉద్యోగాలు ఏమిటి? చదువులు లేని మాకు ఉద్యోగాలు ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు.
ఈ ప్రశ్నల కుసమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధుల పై ఉన్నది.
ఎందుకంటే ఇంతవరకు నేవీ ఆయుధ డిపో యొక్క "డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు" గ్రామ సభలో చర్చకు పెట్టలేదు. అందులో అన్ని వివరాలు స్పష్టంగా ఉంటాయికదా!
బడ్జెట్ ఎంత?
ఎంత భూమి కావాలి?
ఎంత మంది బాధితులు అవుతారు?
ఎంత మంది పర్మినెంట్ ఉద్యోగులు?
ప్రైవేటు ఉద్యోగులు ఎందరు?
మొత్తం లాభనష్టాలు ఎలా ఉంటాయి.
ఆ డీపీఆర్ ఇంత వరకు ఎవరికీ తెలియదు. కాబట్టి అది గిరిజనుల ముందు పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. భూసేకరణ చట్టం 2013 ప్రధాన ఉద్దేశ్యం అదే. అసలు చట్టం పేరులోనే ఉంది. భూసేకరణ లో సరైన నష్ట పరిహారం, పారదర్శకత, పునరావాసం, పునర్నిర్మాణం,2013. వంకావారిగూడెం లో నిర్మించ తలపెట్టిన నేవీ ఆయుధ డిపో ఏర్పాటు లో భూసేకరణ చట్టం ప్రకారం పారదర్శకత ఏది?
సామాజిక ప్రభావ నివేదిక తయారు చేయాలని ఉంది కదా?ఎంత మంది బాధితులు అవుతారు?
ఇవి చెప్పటం లేదు.
ఇది పబ్లిక్, ప్రైవేటు ప్రాజెక్టా?
కనీసం 70./. ప్రజల ఆమోదం ఉండాలి కదా?
సెక్షన్ 11(1) ప్రకారం షెడ్యూల్ ఏరియా లో భూములు తీసుకుంటే ముందుగా పెసా గ్రామ సభ నిర్వహించాలని గిరిజనుల ఆమోదాన్ని తీసుకొని భూసేకరణ చేయాలని ఉంటే మరి జనవరి నుంచి నిర్మాణ పనులు ఎలా ప్రారంభిస్తారో వేచి చూడాలి.
చట్ట పరిధిలో జరగాల్సిన భూసేకరణ ప్రక్రియ జరగక పోతే రేపు కోర్టు కేసుల నుంచి అధికారులు తప్పించుకోలేరు.
అసలు ప్రజా ప్రతినిధుల కు దీనిపై స్పష్టత ఉందా !
వారి మాటలు విన్న వారికి అనుమానం కలుగుతుంది.
2023 లో అప్పటి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు నేవీ ఆయుధ డిపో ఏర్పాటు చేస్తే 1000 మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉంటారని అన్నారు. నిర్మాణం పూర్తి 10 సంవత్సరాలు పడుతుందన్నారు.
ప్రస్తుత ఎమ్మెల్యే బాలరాజు లక్ష మంది కి ఉపాధి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు!
ఏది నిజం? ఆ రహస్యం డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు విప్పాలి.
(జువ్వాల బాబ్జీ, అడ్వకేట్, అమరావతి)