జనసేన కల నెరవేరింది
x

జనసేన కల నెరవేరింది

2014లో పార్టీ పెట్టినా రాజకీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. 2024 ఎన్నికలు జనసేనను మలుపు తిప్పాయి.


ఎట్టేకేలకు జనసేన కల నెరవేరింది. అంతకుముందు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. 2024 ఎన్నికల తర్వాత జనసేన పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌కు అనుకోకుండా అన్నీ కలిసొస్తున్నాయి. కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకంగా పవన్‌ కల్యాణ్‌ కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మధ్య పొత్తులు కుదర్చడంలోను పవన్‌ కల్యాణ్‌ కీలక పాత్ర పోషించారు. తర్వాత ఎన్నికల్లో విజయం సాధించడంలోను ముఖ్య భూమిక పోషించారు. దీంతో అటు అసెంబ్లీ స్థానాలతో పాటు ఇటు పార్లమెంట్‌ స్థానాలను దక్కించుకోవడంలోను పవన్‌ కల్యాణ్‌ కీ రోల్‌ పోషించారు. దీంతో కేంద్రంలో బీజేపీకి స్థానాల సంఖ్య తగ్గినా.. రాష్ట్రంలో ఎన్డీఏకి అందులో భాగస్వామ్య పార్టీలకు వచ్చిన సీట్లే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఆక్సిజన్‌ పోశాయి.

ఈ ఎపిసోడ్‌ తర్వాత పవన్‌ కల్యాణ్‌కు, బీజేపీకి సాన్నిహిత్యం పెరిగింది. తిరుమల లడ్డూ విషయంలోను, మహారాష్ట్ర ఎన్నికల్లోను పవన్‌ కల్యాణ్‌ బీజేపీకి లాభం చేకూర్చారు. ఈ నేపథ్యంలో అటు కేంద్ర పెద్దల ఆశీస్సులు, ఇటు 2024 ఎన్నికల్లో గెలుపు వెరసి దశాబ్ద కాలం తర్వాత జనసేన పార్టీకి గుర్తింపొచ్చింది. పార్టీ సింబల్‌ సొంతమైంది. జనసేనను రాజకీయ పార్టీగా గుర్తించడంతో పాటు గాజు గ్లాసు సింబల్‌ను జనసేన పార్టీకే రిజర్వు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు లేఖ రాసింది.
2014లో పార్టీ పెట్టినా ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు పలికింది జనసేన పార్టీ. తర్వాత విభేదించి 2019కి ముందు వామపక్షాలతో జత కట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 136 స్థానాల్లో బరిలోకి దిగింది. పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ స్వయంగా భీమవరం, గాజువాక రెండు స్థానాల్లో పోటీ చేసినా.. ఓటమి తప్ప లేదు. తర్వాత తన స్ట్రాటజీని మార్చుకుంటూ వచ్చారు. 2024 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీతో పొత్తును కుదుర్చుకొని ప్రకటించారు. తర్వాత బీజేపీతో పొత్తు కుదర్చడంలో కీ రోల్‌ పోషించారు. మూడు పార్టీలు ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగడం, 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించడం జరిగింది. దీంతో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకుంది. 100 శాతం స్ట్రైక్‌ రేట్‌తో భారీ విజయం సాధించడంతో గుర్తింపు లభించింది. గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీ శాశ్వత ఎన్నికల సింబల్‌గా గుర్తింపు లభించింది.
అయితే 2024 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ సింబల్‌ కేటాయింపులపై కాస్త హడావుడి చోటు చేసుకుంది. రాజకీయ పార్టీగా గుర్తింపు లేక పోవడంతో పాటు తగిన ఓట్ల శాతం లేక పోవడంతో గాజు గ్లాసు గుర్తును కేటాయించడంలో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించడంతో గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయించారు.
Read More
Next Story