విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌లో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. పలువురు కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల్లో చేరుతున్నారు. విజయవాడ నగరం రాజకీయాలకు కేంద్రం. మొదటి నుంచి కూడా విజయవాడలోనే అన్ని రాజకీయ పార్టీలు తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించేవి. విజయవాడ ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. అటువంటి కోటలో తెలుగుదేశం పార్టీ పాగా వేసింది. ఆ తరువాత వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్ట గలిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పోకడ కారణంగా నగరంలో ఒక బలమైన వర్గం తెలుగుదేశం పార్టీ వైపుకు పూర్తి స్థాయిలో వెళుతోంది. మరో బలమైన వర్గం జనసేన వైపు వెళుతోంది. కమ్యూనిస్టుల బలం పూర్తిగా పడిపోయింది. వారు చెబితే పనిచేసే కార్యకర్తలు కూడా ప్రస్తుతం కొరవడ్డారంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అయితే కమ్యూనిస్టులకు ప్రతి డివిజన్‌లోనూ పార్టీ కార్యాలయాలు ఉన్నాయి.
కార్పొరేషన్‌లో అడుగు పెట్టిన జనసేన..
జనసేన పార్టీకి విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఇప్పటి వరకు చోటు దక్కలేదు. గత ఎన్నికల్లోనూ వారికి ఒక్క సీటు కూడా రాలేదు. తెలుగుదేశం, వైఎస్సార్ సీపీలు మాత్రమే హోరాహోరీగా పోరాడి వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీ సాధించింది. ఎన్నికల సమయంలో విజయవాడ ఎంపీగా కేశినేని శ్రీనివాస్ (నానీ) ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లను గెలిపించుకోవడంలో పట్టుదలతో ముందుకు సాగారు. రెండు సార్లు వరుసగా ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు. మూడో సారి తెలుగుదేశం పార్టీ సీటు ఇవ్వకపోవడంతో వైఎస్సార్‌సీపీలో చేరి ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేశారు. తన కుమార్తె కేశినేని స్వేత కూడా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి తండ్రికి బాసటగా నిలిచారు. అయితే ఎంపీగా కేశనినేని నానీ తమ్ముడు శివనాథ్‌కు టీడీపీ టిక్కెట్ ఇచ్చి గెలిపించింది. దీంతో ప్రస్తుతానికి కేశినేని నాని రాజకీలకు దూరంగా ఉంటానని చెప్పి తప్పుకున్నారు.
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడండంతో ఆ ప్రభావం విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌పై పడింది. కార్పొరేషన్‌లో మొత్తం 64 మంది కార్పొరేటర్లు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున 14 మంది, వైఎస్సార్‌సీపీ తరపున 49 మంది, సీపీఎం నుంచి ఒకరు గెలిచారు. వైఎస్సార్‌సీపీ నుంచి ముగ్గురు తెలుగుదేశం పార్టీలో చే రారు. ఒకరు బీజేపీలో చేరారు. అంటే వైఎస్సార్‌సీపీ బలం 45కు పడిపోయింది. మంగళవారం టీడీపీలో చేరిన వారి నుంచి ముగ్గురు, కొత్తగా మరొకరు జనసేన పార్టీలో చేరారు. వీరిలో 16వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మిడిశెట్టి రాధిక, 38వ డివిజన్ కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీరావు, 48వ డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి, 51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్‌లు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరారు. గతంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వారి నుంచి ఆదిలక్ష్మి, రాజేష్, అప్పాజీరావులు జనసేనకు వచ్చారు. అంటే టీడీపీలో ఉండేందుకు కూడా కార్పొరేటర్లు ఇష్టపడటం లేదని అర్థమవుతోంది. జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు.
గతంలో పార్టీ నుంచి బయటకి పోయిన వారే పార్టీ మారు తప్ప ప్రస్తుతం తమ పార్టీ వారు కాదని వైఎస్సార్‌సీపీ వారు చెబుతున్నారు. గతంలో పార్టీ మారిన వారు కాకుండా రాధిక ఒక్కరు మాత్రమే కొత్తగా పార్టీ మారారు. అంటే విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ బలం 44గా ఉంది. వీఎంసీకి ఎన్నికలు 2021లో జరిగాయి. అంటే తిరిగి 2026లో జరిగే అవకాశం ఉంది. అప్పటికి కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. అప్పుడు కూటమి పొత్తులతో పోటీ చేస్తుందా? ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా పోటీ చేస్తారా?అనేది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తన బలాన్ని పెంచుకుంటుందననే నమ్మకం జనసైనికుల్లో పెరుగుతోంది. నగరంలో కాపులతో పాటు బీసీల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గం పెత్తనం చేస్తందే తప్ప ఎక్కువ ఓట్లు లేవని, బీసీల ఓట్లు రాబట్టుకోగలిగితే తమకు తిరుగులేదనే ఆలోచనలో జనసేన వారు ఉన్నారు.
కాపులు కైవసం చేసుకోవాలని...
రానున్న రోజుల్లో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌లో కాపుల బలం పెరగాలనే ఆలోచనలో విజయవాడకు చెందిన కాపు నాయకులు ఉన్నారు. ప్రధాన కాపు నాయకుడైన రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అయినా ఆయన నాయకత్వాన్ని కూడా కాపులు పూర్తిస్థాయిలో విశ్వసిస్తున్నట్లు కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ మీ నాయకులు పలానా అని చెబితే ఆ విధంగా వెళ్లాలనే ఆలోచనలో కాపు సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఉన్నట్లు సమాచారం. కార్పొరేటర్లకు నాయకత్వం ఎవరు వహిస్తారనేది పవన్ కళ్యాణ్ చెబితే తప్ప ఊహించేందుకు కూడా వీలు లేదని కార్పొరేటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీ తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. సుజనా చౌదరి అందుకు కావాల్సిన దారులు తయారు చేస్తున్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాచికలు పారటం లేదని వైఎస్సార్‌సీపీ వారే చెబుతున్నారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు మరికొందరు నాయకులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావులు మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ సభ్యులను బయటకు వెళ్లకుండా వ్యూహం రూపొందించినట్లు సమాచారం.