‘రూ.2,600 కోట్లు ఏమయ్యాయి’.. వైసీపీని ప్రశ్నించిన జనసేన
x

‘రూ.2,600 కోట్లు ఏమయ్యాయి’.. వైసీపీని ప్రశ్నించిన జనసేన

ప్రజలకు నిధులు విడుదల చేయాలంటూ ఎన్నికల సంఘంతో గొడవ పడిన వైసీపీ ఇప్పటివరకు ఎన్ని నిధులు విడుదల చేసిందంటూ జనసేన ప్రశ్నించింది.


‘ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానందట’ అన్న సామెత వైసీపీ సరిగ్గా సరిపోతుందంటూ జనసేన చురకలంటించింది. చెప్పిన పథకాలకే గతి లేదు కానీ కొత్త పథకాలు, ఉన్న పథకాలకు అదనపు డబ్బులు ఇస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ డబ్బా కొట్టుకుందని, అవన్నీ ఉత్తుత్తి మాటలేనంటూ జనసేన.. ట్విట్టర్ వేదికగా వైసీపీని టార్గెట్ చేసి పోస్ట్ పెట్టింది. ఎన్నికల ముందు ప్రజలకు చెప్పిన పథకాలకు సంబంధించి రూ.14వేల కోట్లు విడుదల చేయాలని, అందుకు అనుమతించాలంటూ ఈసీకి లేఖలు రాసీ, ఆ అంశంపై కోర్టుకు సైతం వెళ్లిన వైసీపీ.. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇప్పటివరకు రూ.14 వేల కోట్లు ఎందుకు విడుదల చేయలేదు అని జనసేన ప్రశ్నించింది.

‘తీసుకున్న అప్పు ఏమైంది జగన్’

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న నిధులను పోలింగ్ పూర్తయిన తర్వాత విడుదల చేసుకోవచ్చని, దాని వల్ల తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఎన్నికల సంఘం తెలిసింది. ఎన్నికల పోలింగ్.. మే 13తో ముగిసింది. కానీ ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం ఎందుకు ఆ రూ.14వేల కోట్లను విడుదల చేయలేదని జనసేన ప్రశ్నిస్తోంది. ‘‘జనవరి నుంచి వేయాల్సిన డబ్బులను వేయలేదు. బటన్ నొక్కాను అంటూ మాయమాటలు చెప్పారు. ఇస్తానన్న రూ.14 వేల కోట్లు ప్రజలకు ఇవ్వలేదు. ఇప్పటివరకు కేవలం రూ.1400 కోట్లు మాత్రమే విడుదల చేశారు. అందుకోసం కూడా మే 14న ఆర్‌బీఐ దగ్గర రూ.4000 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అది కూడా మొత్తం వెయ్యకుండా అందులోనుంచి కేవలం రూ.1400 కోట్లే వేశారు. ఆ మిగిలిన రూ.2,600 కోట్లు ఏమైనట్లు’’ అని జనసేన ప్రశ్నలు గుప్పించింది.

తమ సొంత కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులను ఆపకుండా చెల్లిస్తున్న సీఎం జగన్.. పేదల విషయంలో మాత్రం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని, పోలింగ్ పూర్తయి మూడు రోజులు అవుతున్నా నిధులు మొత్తం ఎందుకు విడుదల చేయలేదు అని వారు నిలదీస్తున్నారు. అంతేకాకుండా ఆఖరికి ఓడిపోవడానికి నెల రోజుల ముందు కూడా రూ.4వేల కోట్ల అప్పులు తీసుకుని రాష్ట్రాన్ని మరింత అంధకారంలోకి నెట్టే ప్రయత్నం కాదా అని విమర్శలు గుప్పిస్తున్నారు.

Read More
Next Story