
జయకేతనం దేనికి సంకేతం!
రేపు చిత్రాడలో జనసేన ఆవిర్భావ దినోత్సవం. అధికారంలోకి వచ్చాక తొలి సభకు లక్షల్లో పోటెత్తనున్న జనం. అధినేత పవన్ కల్యాణ్ సందేశంపై సర్వత్రా ఉత్కంఠ.
జనసేన పార్టీ పుట్టి 11 ఏళ్లు అయింది. అంటే పుష్కర కాలంలోకి అడుగిడుతోంది. ఇన్నాళ్లూ ఉద్యమాలు, ఆందోళనలు, పొత్తులతో నెట్టుకొచ్చింది. అనూహ్యంగా గత ఏడాది కూటమితో జతకట్టడంతో అధికారంలో పాలుపంచుకుంది. జనసేన ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాక ఆ పార్టీ అధినేత ఈ దఫా ఆవిర్భావ దినోత్సవాన్ని తనను గెలిపించిన పిఠాపురం గడ్డపై నిర్వహించాలని నిర్ణయించారు. తన సత్తా ఏపాటిదో మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, కూటమిలోని మిత్రపక్షాలకు, ప్రధాన ప్రతిపక్షానికి మరోసారి చూపించడానికి సిద్ధమయ్యారు.
ఈ సభకు లక్షలాది మంది జనసైనికులు, ఇతరులు తరలి రావడానికి ఉవ్విళ్లూరుతున్నారు. శుక్రవారం పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవ జయకేతన సభలో సంచలనాలకు మారుపేరైన పవన్ కల్యాణ్ ఎవరి గురించి ఏం మాట్లడాతారోనని, దేనికి సంకేతమిస్తారోనని తెలుగు రాష్ట్రాల ప్రజలు, కూటమి, వైసీపీ నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
సరిగ్గా పదకొండేళ్ల క్రితం 2014 మార్చి 14న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ ఆవిర్భవించింది. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్ సిటీ నోవోటెల్ భవనం వేదికగా పురుడు పోసుకుంది. ఆ సవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయలేదు. 2019లో వామపక్ష పార్టీలతో జతకట్టి ఎన్నికలకు వెళ్లింది. ఆ ఎన్నికల్లో (తూర్పు గోదావరి జిల్లా రాజోలు ) సీటును మాత్రమే గెలుచుకుంది. అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరం సీట్లనూ కోల్పోయింది.
దీంతో అంతా ఆ పార్టీ భవితవ్యం ఏమవుతుందోనని అనుకున్నారు. 2019 తర్వాత నుంచి జనసేన రైతు సంక్షేమం, అక్రమ ఇసుక తవ్వకాలు, మహిళల రక్షణ, భూ ఆక్రమణలు వంటి అంశాలపై ఎక్కువగా ద్రుష్టి సారించి ప్రజల్లోకి క్రమంగా చొచ్చుకు వెళ్లింది. అనూహ్యంగా 2024 ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఆ వ్యూహం ఫలించి ఆ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైంది.
ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాల్లోనూ విజయం సాధించి రికార్డు స్రుష్టించింది. పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. కూటమి ప్రభుత్వంలో ఆయన కీలకమైన ఉప ముఖ్య మంత్రి పదవిని దక్కించుకున్నారు.
పీఠమెక్కించిన పిఠాపురంలోనే..
పవన్ కల్యాణ్ తొలిసారిగా గత 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. ఆ రెండు చోట్ల తన సామాజికవర్గీయులు అధికంగా ఉండడం వల్ల తన గెలుపు తేలికవుతుందనుకున్నారు. కానీ ఆ రెండు స్థానాల్లోనూ ఆయన పరాజయం పాలయ్యారు. 2024 ఎన్నికల్లోనూ ఆయన తన సామాజిక వర్గీయులనే ఎక్కువగా నమ్ముకుని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. విజయం సాధించారు. తనకు రాజకీయ పునర్జన్మనిచ్చిన పిఠాపురం నియోజకవర్గంలోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని పవన్ భావించారు. ఆ నియోజకవర్గంలోని చిత్రాడను ఇందుకు ఎంచుకున్నారు. చిత్రాడ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 50 ఎకరాల సువిశాల స్థలంలో ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
పదకొండేళ్ల తర్వాత విజయోత్సవంలా..
పార్టీ ఆవిర్భవించిన తర్వాత జనసేన కూటమి ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకుంది. తమ అధినేతను ముఖ్యమంత్రిగా చూడాలని జన సైనికులు ఎప్పట్నుంచో కలలు కంటున్నారు. అయితే అధినేత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండడంతో ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రి పదవితోనే వీరంతా సంత్రుప్తి చెందుతున్నారు. మున్ముందైనా తమ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడనే నమ్మకంతో వీరున్నారు. అయినప్పటికీ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ ఎక్కడకు వెళ్లినా సీఎం, సీఎం అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో చిత్రాడలో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం నభూతో.. న భవిష్యతిః అనే రీతిలో నిర్వహించడానికి జనసైనికులు తపిస్తున్నారు.
కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా మారిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భావి రాజకీయాల్లో ఓ బలమైన నేతగా చూపించడానికి ఈ సభను ఉపయోగించుకోనున్నారు. ఈ సభను విజయోత్సవ సభలా నిర్వహించడం ద్వారా పవన్ కల్యాణ్ సత్తాను చాటి చెప్పాలన్న భావనతో ఇటు జనసేన నేతలు, జనసైనికులు ఉన్నారు. ఈ ఆవిర్భావ దినోత్సవ సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నాలుగైదు లక్షల మందిని తీసుకురావాలని భావిస్తున్నారు.
ఇందుకు ఒక్క జనసేన అభిమాన నేతలే కాదు.. ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలు, ప్రధానంగా కాపు సామాజిక వర్గంలోని కొందరు నేతలు కూడా తెర వెనక నుంచి తమ వంతు సహకారం అందిస్తున్నారు. కొందరు వాహనాలు సమకూరుస్తుంటే మరికొందరు ఇతరత్రా సాయపడుతున్నారు. ఇలా అధికారంలోకి వచ్చాక జరిగే తొలి ఆవిర్భావ సభను సక్సెస్ చేసేందుకు ఎవరి స్థాయిలో వారు పాటుపడుతున్నారు. ముఖ్యంగా జనసేన బల ప్రదర్శనకు ఇదో వేదిక అవుతుందని అంటున్నారు.
పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారు?
పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో అధినేత పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారోనన్నదే ఇప్పడు చర్చనీయాంశమైంది. పవన్ ఏ సభలో మాట్లాడినా ఏదో ఒక సంచలనం కావడం పరిపాటి. అలాంటిది కీలకమైన చిత్రాడ సభలో ఆయన చేసే సుదీర్ఘ ప్రసంగంలోనూ సంచలనం ఖాయమన్న భావన రాజకీయ వర్గాల్లో ఉంది. పవన్ అధికారంలోకి రాకముందు అధికారంలో ఉన్న పార్టీలు, నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించే వారు. ఇప్పడు అవినీతి, అక్రమాలు, అవకతవకలపై ఆ దూకుడును కొనసాగిస్తూ చురకలేస్తారా? లేక సర్దుబాటు ధోరణితో వ్యవహరిస్తారా? అన్న దానిపై చర్చించుకుంటున్నారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఆయన విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇటీవల వైఎస్ జగన్.. ‘పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్‌కు ఎక్కువ’ అంటూ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సభలో జగన్ గురించి పవన్ ఏం మాట్లాడతారోనని సర్వ్రతా ఆసక్తిగా ఉంది. అలాగే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ టీడీపీలో కొంతమంది నేతలు సరికొత్త వివాదానికి తెరలేపారు. ఇది జనసైనికుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది.
దీంతో లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి వ్యవహారం ఇరు పార్టీల్లోనూ పెను దుమారాన్ని రేపడంతో చంద్రబాబే రంగంలోకి దిగి తాత్కాలికంగా సద్దుమణిగేలా చేశారు. ఈ వ్యవహారంపై పవన్ పరోక్షంగా ఏదైనా మాట్లాడవచ్చన్న వాదన వినిపిస్తోంది. ఇక పార్టీ భవిష్యత్తును ద్రుష్టిలో ఉంచుకుని రాజకీయ విధాన ప్రకటన కూడా చేయవచ్చని అంటున్నారు. పార్టీ పటిష్టతపై ద్రుష్టి సారించడంతో పాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని , ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యతపై మాట్లాడతారని చెబుతున్నారు.
సభ విజయవంతానికి..
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయడంపై జన సైనికులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభ నిర్వహణకు చిత్రాడలో దాదాపు వందెకరాలను సిద్ధం చేశారు. ఇందులో 50 ఎకరాల్లో సభకు కేటాయించారు. మిగిలిన స్థలంలో వాహనాల పార్కింగ్, ఇతర అవసరాలకు వినియోగించనున్నారు. సభకు కనీసం నాలుగైదు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. వేదికపై 250 మంది వరకు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ కొద్ది రోజులుగా కాకినాడలోనే బస చేసి సభ ఏర్పాట్లను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు.
ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర మంత్రులు సభ సక్సెస్‌పైనే ద్రుష్టి సారించారు. ఆహూతుల కోసం సభలో కుర్చీలు, ఎల్ ఈ డీ స్క్రీన్లు, విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. ఆరు చోట్ల ట్రాఫిక్ సదుపాయాలు, భోజన వసతి, ఏడు చోట్ల వైద్య శిబిరాలు 14 అంబులెన్సులను సిద్ధం చేశారు. సబా ప్రాంగణం హైవేకి ఆనుకుని ఉండడంతో కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట జంక్షన్ నుంచి కత్తిపూడి హైవే జంక్షన్ వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 70 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 14 డ్రోన్లతో నిఘా పెట్టారు. సుమారు 1500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఆవిర్భావ దినోత్సవం ఇలా..
శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పవన్ కల్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆయన వేదికపై ఉంటారు. మధ్యలో జనసేన ముఖ్య నేతలు మాట్లాడతారు. అనంతరం అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించాక కార్యక్రమాన్ని ముగిస్తారు.