‘విశాఖ బార్ల నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కి రోజూ రూ.5 లక్షలు’
x

‘విశాఖ బార్ల నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కి రోజూ రూ.5 లక్షలు’

ఆంధ్రలో లిక్కర్ దందా విచ్చలవిడిగా జరుగుతోందని జనసేన నేత పీతల మూర్తి అన్నారు. విశాఖలోని బార్ల నుంచే ప్రతినెలా తాడేపల్లి ప్యాలెస్‌కు రూ.5 లక్షలు ముడుతుందన్నారు.


(శివరామ్)

విశాఖపట్నం: విడతల వారీ సంపూర్ణ మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వాన్ని మించిన మద్యం స్కాం చేస్తోందని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వం స్కాం విలువ వందల కోట్లు అయితే ఆంధ్రాలో తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా జరుగుతున్న స్కాం విలువ రూ.50 వేల కోట్లపై మాటే అని కూటమి నేతలతో కలిసి విశాఖలో మీడియా సమావేశంలో చెప్పారు. ప్రతి ఏటా 30 వేల కోట్ల రూపాయలకు పైగా మద్యం విక్రయాలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ పది వేల కోట్ల రూపాయల వరకూ లంచాల రూపంలో ప్రభుత్వ పెద్దలకు, అవినీతి తిమింగలాలైన అధికారులకు చేరుతుందని వెల్లడించారు. ఒక్కో మద్యంపెట్టెపై తాడేపల్లి ప్యాలెస్‌కు రూ.475 రూపాయలు వెళ్తున్నాయని ఆరోపించారాయన. ఆయన ఇంకా ఏమన్నారంటే..

‘‘రాష్ట్రంలో బేవరేజెస్ కార్పొరేషన్ కొనుగోలు చేసే ప్రతి పెట్టె మద్యానికి రూ.475 రూపాయల జే టాక్స్ తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తుంది. రాష్టంలో రోజుకు సుమారు ఎనిమిది లక్షల పెట్టెల సరుకు అమ్ముడవుతోంది. ఈ లెక్కన రోజుకు కనీసం రూ. 40 కోట్లు తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుతుంది. రోజుకు రూ.40 కోట్లంటే నెలకు రూ.1200 కోట్లు, ఏడాదికి 14 వేల కోట్ల రూపాయలు. ఇతర మార్గాల్లో వచ్చే మద్యం ఆదాయం దీనికి అదనం. ఈ రకంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కాం.. మన ఆంధ్ర మద్యం స్కాం కాలిగోటికి కూడా సరిపోదు’’ అని వ్యాఖ్యానించారు.

విశాఖలోని 130కిపైగా బార్ల నుంచి నెలకు రూ.5 లక్షల లంచం

‘‘విడిపోయిన విశాఖ జిల్లాలోనే 130 వరకూ బార్లు ఉన్నాయి. వీటిలో ఒక్కో బార్ నుంచి నెలకు రూ.5 లక్షల చొప్పున ఏడున్నర కోట్ల రూపాయల లంచాన్ని ఎక్సైజ్ సూపరింటెండ్ ఆధ్వర్యంలో వసూలు చేస్తున్నారని చెప్పారు. ఇందులో మూడు కోట్ల రూపాయలను ఉత్తరాంధ్ర వ్యవహారాలు చూసే పార్టీ పెద్దకు చెల్లిస్తుండగా మిగిలిన మొత్తం అధికారులు వాటాలు వేసుకుంటున్నారు. గతంలో నాలుగేళ్ల పాటు ఉత్తరాంధ్ర పార్టీ ఇన్చార్జి విజయసాయిరెడ్డి ఆశీస్సులతో శ్రీనివాస్.. ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేయగా, ప్రస్తుతం సీఎం పేషీ, ముఖ్య అధికారి ధనుంజయ రెడ్డి శిష్యుడిగా చలామణి అవుతున్న సుధీర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బార్లకు దగ్గరలోని ప్రభుత్వ వైన్ షాపులలో జనాలు కోరుకునే మద్యం లేకుండా చేయడం, రాత్రి పది గంటలకు మూయాల్సిన షాపులను జనం బాగా వచ్చే సమయం చూసుకుని 8, 8:30 గంటలకే మూసేయడం ద్వారా బార్లకు లబ్ధి చేకూర్చినందుకు ఆ లంచం వసూలు చేస్తున్నారు. వీటితో పాటు బార్లలో జరిగే ఉల్లంఘనలపై కేసులు లేకుండా చేయడం, అదనపు సమయాలకు అనుమతివ్వడం వంటివి చేసి లంచాలు గుంజుతున్నారు.’’


కడప నుంచి విశాఖకు బార్ల బదిలీ

‘‘నిబంధనల ప్రకారం ఒక ప్రాంతంలోని బార్‌ను దగ్గర్లోని మరో ప్రాంతానికి మార్చాలంటే గగనమని, చాలా అనుమతులు తీసుకోవాలని, అటువంటిది ఎక్కడో రాయలసీమ జిల్లాలోని కడపలో అనుమతి పొందిన బార్లను నిబంధనలకు విరుద్ధంగా ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్ విశాఖకు తరలింపజేశారు. ఇందుకోసం ఒక్కో బార్ నుంచి రూ.30 లక్షలు లంచంగా ఆయన తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ చక్రం తిప్పే మహిళ మరికొంత తీసుకొని ఇందుకు అవకాశం కల్పించారు’’

ఆర్‌ఆర్ ఎంటర్ ప్రైజెస్ రోజువారి ఆదాయమే రూ.50 లక్షలు

‘‘మద్యం పంపిణీ, అమ్మకాలు చూడడానికి ప్రతినెలా కోట్ల రూపాయల జీతాలు తీసుకొనే ఎక్సైజ్ శాఖ ఉండగా, దానిని నిర్వీర్యం చేసి ఆరు శాతం కమీషన్‌తో ఆ వ్యవహారాన్ని కడప రెడ్లకు చెందిన ఆర్‌ఆర్ ఎంటర్ ప్రైజెస్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పగించారు. రాష్ర్టంలో ప్రతిరోజూ జరిగే మద్యం అమ్మకాలు రూ.85 కోట్లు, ఇందులో ఆర్‌ఆర్ సంస్దకు వచ్చే కమీషన్ ఆదాయం రూ.50 లక్షలు, పెద్దగా ఉద్యోగులు కూడా లేని ఆ సంస్ధకు కమీషన్‌గా నెలకు రూ.15 కోట్ల రూపాయలను ప్రభుత్వం ధారాదత్తం చేస్తుందంటే అవినీతి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.’’

వాసుదేవ ... వాసుదేవ.. అద్దెల్లో సగం నొక్కుతావా?

‘‘సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకొన్న వాసుదేవ రెడ్డి షాపుల అద్దెలను రెట్టింపు చేసి అందులో సగం లాగేస్తున్నారు. వైన్ షాప్‌ను రెండు లక్షల రూపాయల అద్దెకు మాట్లాడి ప్రభుత్వ రికార్డుల్లో రూ.1లక్ష అని రాసి మిగిలిన ఆ లక్ష రూపాయలను వాసుదేవ రెడ్డి తన జేబుల్లో వేసుకుంటున్నారు. వాక్‌ఇన్ షాపులు, వైన్ మార్ట్‌లలో ఈ దోపిడీ మరీ ఎక్కువని, విశాఖపట్నం సీతమ్మధారలోని ప్రీమియం వైన్ మార్ట్ అద్దె ఆరు లక్షల రూపాయలు కాగా, యజమానికి చెల్లించేది మూడు లక్షలే. మిగిలిన మూడూ వాసుదేవ రెడ్డి జోబులోకే. ఇలా రాష్ర్ట వ్యాప్తంగా అద్దెల కుంభకోణంలో ప్రతినెలా కోట్ల రూపాయలు వాసుదేవ రెడ్డికి చేరుతున్న సంగతి డిపార్ట్ మెంట్‌లో అందరికీ తెలిసు.’’

ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకోవాలి

‘‘ఎన్నికల తరుణంలో నాలుగేళ్లుగా అదే పదవులలో కొనసాగుతున్న మద్యం అవినీతి సామ్రాట్‌లైన అధికారుల వివేక్ యాదవ్, వాసుదేవ రెడ్డిలను వెంటనే ఆ పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.కేంద్ర సర్వీసుల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన వాసుదేవ రెడ్డికి వేల కోట్ల మద్యం వ్యహారాల డీల్‌ను అప్పగించడంలో ఔచిత్యం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి వందల కోట్ల రూపాయలకు పైగా మద్యాన్ని ఉచితంగా పంపిణీ చేయడానికి ఈ ఉన్నతాధికారులిద్దరూ ఏర్పాట్లు చేస్తున్నందున వీరిని వెంటనే ఆ పదవుల నుంచి తప్పించాలి. ఎన్నికల సంఘం రాష్ట్రంలో మద్యం వ్యాపారంపై దృష్టిసారించి ప్రత్యేక అధికారులతో రోజువారీ వ్యవహారాలను పరిశీలించాలి.’’

Read More
Next Story