
రాయలసీమ కోసం జనకవనం
రాయలసీమ అభివృద్ధి కోసం కవులు, రచయితలు కలాలకు పదును పెట్టాలని పలువురు యాక్టివిస్ట్ లు కోరారు.
రాయలసీమ ప్రాంతం అభివృద్ధి గురించి పాలకులు పట్టించుకోవడం లేదు. అన్నీ అమరావతికి తరలిస్తున్నారని సాహితీ స్రవంతి, సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కడప యూటిఎఫ్ భవన్ లో ‘వద్దొద్దు తరలింపు’ అనే అంశంపై జరిగిన జనకవనం లో కవులు, రచయితలు పాల్గొన్నారు.
కవి, రచయిత, సాహితీ స్రవంతి నాయకులు పిళ్లా విజయ కుమారస్వామి రెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ పాలకులు రాయలసీమ నుంచి అనేక కార్యాలయాలు, సంస్థలు అమరావతికి తరలిస్తున్నారన్నారు. దీని కారణంగా రాయలసీమ మరింత వెనుకబడిన ప్రాంతంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డులు, యూనివర్సిటీలు, హైకోర్టును అమరావతికి తరలించినట్లు ఆయన చెప్పారు.
హైకోర్టు వస్తుందనుకుంటే బెంచ్ అన్నారు, అది కూడా సందిగ్ధం లో పడిందన్నారు. ఎయిమ్స్ వస్తుందనుకుంటే అది అమరావతికి తరలిందన్నారు. ఉక్కు కర్మాగారం వస్తుందనుకుంటే ఆ ప్రతిపాదనే అసలు లేదంటున్నారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చూపులు అమరావతి వైపుకే ఉంటే.. ఇప్పుడు కొత్తగా గ్రామీణ బ్యాంకు కేంద్ర కార్యాలయం కూడా అమరావతి వైపుకే ఉందని పేర్కొన్నారు. ఇలా అన్ని కార్యాలయాలు ఒక్కొక్కటే తరలిపోతే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి మరింత వెనుక పట్టు పడుతుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో వద్దొద్దు తరలింపు పేరుతో జనకవనం నిర్వహిస్తున్నామని చెప్పారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత, పూర్వ అధికార భాష సంఘం సభ్యులు తవ్వా వెంకటయ్య మాట్లాడుతూ ఏ రాజకీయ నాయకుడు రాయలసీమ ప్రగతి గురించి, రాయలసీమ ప్రజల కష్ట నష్టాల పైన మాట్లాడటం లేదన్నారు. రాయలసీమకు జరిగే అన్యాయం పైన ఎవరూ గళమెత్తక పోవడం బాధ కలిగించే అంశమని చెప్పారు. ఈ నిశ్శబ్ధాన్ని కవులు ఛేదించాలని, రచయితలు తమ కలాలకు పదును పెట్టి రాయలసీమ ప్రజా వేదనకు అద్దంపట్టే రచనలను చేయాలని ఆయన కోరారు.
సేవ్ పబ్లిక్ సెక్టర్ కమిటీ నాయకులు రఘునాథరెడ్డి మాట్లాడుతూ సీమ ప్రజలు చైతన్య రాహిత్యం తో తమ చుట్టూ జరిగే అన్యాయాలను ప్రశ్నించాలని, కనీసం వాటిని నిలువరించాలని కూడా ఆలోచించడం లేదని అన్నారు. కేవలం కొద్ది మంది నాయకులకు విశ్వాస పాత్రులుగా ఉండి పోతున్నారన్నారు. దీని నుంచి బయటపడి రాయలసీమ అభివృద్ధి కోసం, ఉన్న సంస్థలను రక్షించుకోవడానికి మేధావులంతా ముందుకు రావాలని కోరారు.
ప్రముఖ రచయిత, కవి శివారెడ్డి తన కవితలో అన్నీ తరలించుకు పోతుంటే ఇక్కడ ప్రజలకు మిగిలేది ఏమిటని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి నీలవేణి తన కవిత లో ఈ సందర్భంగా ప్రజలంతా ఏకం కావాలని కోరారు.
మరో కవి రామాంజనేయులు ఉక్కు కర్మాగారం నిర్మించాలని, అదే సీమ ప్రజల ఆకాంక్ష అని తన కవిత ద్వారా ఎలుగెత్తి చాటారు. గ్రామీణ బ్యాంకు రైతుల పాలిట కల్పతరువని ప్రముఖ కవి హరి అన్నారు. ఈ జన కవనంలో
ప్రముఖ కవులు వెంకటేశ్వర్లు,సాగర్, రైతు సంఘం నాయకులు దస్తగిరి, జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు శివరాం, గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు