
పవన్ కల్యాణ్ కు బదులుగా జనసేన నాయకులు
పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామానికి చెందిన దొండపాటి శ్రీదుర్గ ప్రసూతి మరణంపై పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు.
ప్రసూతి సమయంలో వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఏ దశలోనూ నిర్లక్ష్యం చెందకూడదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కాకినాడ జిల్లా కలెక్టర్, పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పడా) ప్రాజెక్ట్ డైరెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి అనుభవజ్ఞులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామానికి చెందిన దొండపాటి శ్రీదుర్గ (30) ప్రసూతి మరణంపై సమీక్ష నిర్వహించారు.
ఘటన వివరాలు
పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామానికి చెందిన శ్రీమతి దొండపాటి శ్రీదుర్గ, అనారోగ్యంతో బాధపడుతూ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మ ఇచ్చారు. అనంతరం అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను కాకినాడ ఆసుపత్రికి తరలించగా, దురదృష్టవశాత్తు మరణించింది. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. "ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్న తరుణంలో ఇలాంటి మరణాలు బాధాకరం. ప్రసూతి సేవలపై అప్రమత్తంగా ఉండాలి" అని అన్నారు.
ఆదేశాలు..సూచనలు
వీడియో కాన్ఫరెన్స్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, "ప్రసూతి మరణాలు సీరియస్ అంశం. జిల్లాలో ఎప్పటికప్పుడు మెటర్నల్ డెత్ ఆడిట్ నిర్వహించాలి. మరణాలు జరిగినప్పుడు తక్షణమే నిపుణులైన వైద్యుల బృందంతో సమగ్ర విచారణ చేసి కారణాలు నమోదు చేయాలి" అని ఆదేశించారు. శ్రీదుర్గ మరణంపై, పుట్టిన బిడ్డ ఆరోగ్య స్థితి, ప్రసూతి సమయంలో అందించిన సేవలు, ఆసుపత్రి సిబ్బంది వ్యవహారంపై సమగ్ర నివేదిక తక్షణం పంపాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు.
పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, ఇతర సిబ్బంది విధి నిర్వహణ తీరుపై విచారణ చేయాలని, గర్భిణులకు వైద్యం నుంచి ప్రసవం, అనంతర వైద్యం వరకు సక్రమంగా అందాలని పేర్కొన్నారు. పిఠాపురం ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, నియోజకవర్గంలో వైద్య విధానం మోడల్‌గా నిలవాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఈ ఘటనపై జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు, నాయకులు జ్యోతుల శ్రీనివాసరావు మొదలైనవారు బుధవారం చేబ్రోలు గ్రామంలో మరణించిన శ్రీదుర్గ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రగాడ సానుభూతి తెలిపి, ఆర్థిక సహాయం అందజేశారు. పసిబిడ్డకు పార్టీ అండగా ఉంటుందని, కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

