జమిలిపై జగన్ మాట.. ప్రజల తరపున గళం విప్పాలని నిర్థేశం
కూటమి ప్రభుత్వం వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులపై కేసులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సమయంలో తిప్పి కొట్టేందుకు ఆ పార్టీ సన్నద్ధమైంది.
త్వరలో జమిలీ ఎన్నికలు వస్తాయని అంటున్నారు. మనమంతా కలిసి కట్టుగా ప్రజల కోసం పని చేయాలి. నేను కూడా ప్రజల్లో తిరుగుతాను. ప్రజల మధ్యలోనే నిద్రిస్తాను అంటూ వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు సూచించారు. గతంలో ఎన్నడు ప్రభుత్వాలు ఏర్పడిన ఆరునెలల్లో ఇంత తీవ్ర వ్యతిరేకత లేదు..కానీ కూటమి ప్రభుత్వంపై అది నెలకొంది. ప్రజల సమస్యలపై పోరాటం చేసేందుకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నీరుగారిపోతున్నాయి. వైద్యరంగం పరిస్థితి దయనీయంగా ఉంది. వ్యవసాయ రంగం కూడా కుదేలైంది. విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది.
ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా రెచ్చిపోతున్నాయి. ఈ తరుణంలో మనం ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చింది. ప్రతి కార్యకర్తకు ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సప్, యూట్యూబ్ అకౌంట్లు ఉండాలి. గ్రామంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాంటూ నేతలకు జగన్ దిశా నిర్దేశం చేశారు. మన ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మధ్య తేడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాల్టికి కూడా మన జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు ఏ గ్రామానికైనా, ఏ ఇంటికైనా ఈ మంచి చేశామని చెబుతూ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి తీవ్రమైన ప్రచారం చేశారు. ఆరునెలల కూటమి పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ ఇంటికి గర్వంగా వెళ్లలేని పరిస్థితి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేటతెల్లం అవుతున్నాయి.
విద్యా, వైద్య రంగాలు పరిస్థితి దయనీయంగా ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు అందించే నెట్ వర్క్ ఆసుపత్రులకు మార్చి నుంచి ఇంతవరకు బిల్లులు చెల్లింపులేదు. నెట్ వర్క్ ఆసుపత్రులకు పేదలు వెళితే వైద్యులు మేం వైద్యం చేయలేమనే పరిస్థితి. వ్యవసాయ రంగం కూడా కుదేలైంది. ఆర్బీకేలు స్థాపించి, ఇ–క్రాప్ పెట్టి పారదర్శకంగా ప్రతి రైతుకు ఆర్బీకే ద్వారా ఉచిత పంటల బీమా పెట్టాం. ఈరోజు ఏ రైతుకూ ధాన్యానికి కనీస మద్ధతు ధర రావడం లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఇ–క్రాప్ గాలికెగిరిపోయింది. విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది. ఇసుక రేట్లు మన హయాం కంటే రెట్టింపు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. మద్యం షాపులు ప్రభుత్వంలో ఉన్నవి తీసేశారు. ప్రతి గ్రామంలో వేలం వేసి రూ.2–3 లక్షలకు బెల్టుషాపులు నడుపుతున్నారు. ఇలాంటి దుర్మార్గమైన పాలన వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో మనం ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చింది. అందరం చురుగ్గా ప్రజల తరపున పనిచేయాలి. ప్రజల తరపున గళం వినిపించాలని దిశా నిర్థేశం చేశారు.
Next Story