ఈ నెలాఖరు నుంచి జనం మధ్యకు జగన్‌
x

ఈ నెలాఖరు నుంచి జనం మధ్యకు జగన్‌

జూన్‌ 27 నుంచి మాజీ సీఎం జగన్‌ జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలకు సమాచారం అందించారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఘోర పరాజయం తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మధ్యకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల సమయంలోను, ఎన్నికల తర్వాత జరిగిన దాడుల్లో గాయపడిన వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించే కార్యక్రమాన్ని జగన్‌ తీసుకున్నట్లు సమాచారం. పార్టీ కార్యకర్తలకు, బాధితులకు భరోసా ఇచ్చేందుకే జగన్‌ ఈ కార్యక్రమం తీసుకున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, మాజీ మంత్రులు, ముఖ్య కార్యకర్తలతో తాడేపల్లిలోని తన నివాసంలో జగన్‌ ప్రత్యేక సమావేశాన్ని ఈ నెల 19న ముందస్తుగా ఏర్పాటు చేశారు. ఈ మేరకు వారి అందరికి సమాచారం అందించారు. ఈ నెల 27 నుంచి ప్రజల మధ్యకు వెళ్లాలనే ఆలోచన ఉన్నందున ముందుగానే నియోజక వర్గాల నాయకులతో చర్చిస్తే బాగుంటుందని ఈ నెల 19న సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

వికెట్‌ డౌన్‌ మొదలైంది..
వైఎస్‌ఆర్‌సీపీలో వికెట్లు పడిపోతున్నాయి. ముఖ్య నాయకులు చాలా మంది ఆ పార్టీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు సోమవారం వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేసి సంచలనంగా మారారు. తన రాజకీయ భవిష్యత్‌ను త్వరలో వెల్లడిస్తానని మీడియాకు చెప్పారు. శిద్దా రాఘవరావు మొదట తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2014లో చంద్రబాబు మంత్రి వర్గంలో మంత్రిగా ఉన్నారు. తర్వాత వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ప్రకాశం జిల్లా దర్శి నుంచి టికెట్‌ ఆశించినా ఆయనకు కాకుండా పేస్‌ ఇంజనీరింగ్‌ సంస్థల అధినేత మద్దిశెట్టి వేణుగోపాల్‌కు ఇచ్చారు. 2019లో వేణుగోపాల్‌ దర్శి నుంచి విజయం సాధించారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉండటంతో ఐదేళ్లు వైఎస్‌ఆర్‌సీపీలో ఉన్న శిద్దా ఆ పార్టీ ఓడి పోగానే పార్టీ నుంచి వైదొలిగారు. వైఎస్‌ఆర్‌సీపీ ముఖ్యుల్లో శిద్దా రాఘవరావు ఒకరు కావడం వల్ల మొదటి వికెట్‌ పడిందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
విజయవాడ నగర పాలక సంస్థలో కూడా పలువురు కార్పొరేటర్లు వైఎస్‌ఆర్‌సీపీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. కార్పొరేషన్‌లో మొత్తం 64 మంది కార్పొరేటర్లు ఉండగా 49 మంది వైఎస్‌ఆర్‌సీపీ తరపున, 14 మంది టీడీపీ తరపున, ఒకరు సీపీఎం తరపున గెలిచారు. విజయవాడ పశ్చిమ నియోజక వర్గానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్‌ బుల్లా విజయ్‌ ఎన్నికలకు ముందే వైఎస్‌ఆర్‌సీపీని వీడి బిజేపీలో చేరారు. విజయవాడ సెంట్రల్‌ నియోజక వర్గం నుంచి 15 మంది కార్పొరేటర్లు వైఎస్‌ఆర్‌సీపీని వీడి టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. విజయవాడ తూర్పు నియోజక వర్గం పరిధిలో వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు ఆ పార్టీని వీడేందుకు టీడీపీ నేతలతో మాట్లాడుకున్నట్లు సమాచారం. మేయర్‌ భాగ్యలక్ష్మిని కొందరు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే వ్యతిరేకించారు. అయినా జగన్‌ తీసుకున్న నిర్ణయం మేరకు వారి నుంచి పెద్దగా వ్యతిరేకత లేనట్లు వ్యవహరించారు. మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులను డమ్మీలను చేసి మేయర్‌ నగరంలో ఒక ఆట ఆడుకున్నారనే విమర్శలు ఉన్నాయి. అందువల్లే పార్టీ మారేందుకు ఎక్కువ మంది కార్పొరేటర్లు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
వీరే కాకుండా రాష్ట్రంలో ఇటీవల స్థానిక సంస్థల్లో గెలిచిన పలువురు మేయర్లు, మునిసిపల్‌ చైర్మన్లు వైఎస్‌ఆర్‌సీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. నెల్లూరు మేయర్‌గా ఉన్న పి స్రవంతి వైఎస్‌ఆర్‌సీపీని వీడి ఇటీవలె టీడీపీలో చేరారు. పార్టీని వీడే వారిని నిరోధించడంతో పాటు, పార్టీ క్యాడర్‌ను నిలబెట్టుకునేందుకు జగన్‌ సిద్ధమవుతున్నారు. గడచిన ఐదేళ్లల్లో సెక్యురిటీ కారణాల రీత్యా తాను ఎక్కువ సమయం ప్రజల మధ్య గడపలేక పోయాననే విషయాన్ని ప్రజలతో చెప్పి వారి మద్దతు పొందాలనే ఆలోచనలో జగన్‌ ఉన్నట్లు తెలిసింది.
Read More
Next Story