
వర్షాల వల్ల ఆగిన జగన్–తాడేపల్లిలోనే వినాయక పూజ
జగన్ పర్యటనకు విజయవాడ రాణిగారితోటలో ఏర్పాట్లన్నీ చేపట్టారు. చివరి నిముషంలో వాయిదా పడింది.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ టూర్ వాయిదా వేసుకున్నారు. భారీ కురుస్తున్న వర్షాల కారణంగా చివరి నిముషంలో జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. వినాయక చవితి సందర్భంగా విజయవాడ రాణిగారితోటలో నిర్వహించే వినాయక పూజ కార్యక్రమంలో పాల్గొనాలని ముందుగా నిర్ణయించుకున్నారు. ఆ మేరకు జగన్ తన పర్యటన షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. అందుకు సంబంధించి వైసీపీ నాయకులు ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. అయితే మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాణిగారితోటలోని వినాయక పూజ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. దీంతో తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్దనే జగన్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గణనాథుడి తొలి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న జగన్ విఘ్నేషుడికి హారతి ఇచ్చి పూజారుల నుంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.