
కోటి సంతకాలతో నేడు గవర్నర్ వద్దకు జగన్
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1,04,11,136 మంది సంతకాలు. చంద్రబాబు సొంత గ్రామం 'నారావారిపల్లె'లోనూ వెల్లువెత్తిన నిరసన.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ ప్రజా ఉద్యమం నేటితో క్లైమాక్స్‌కు చేరుకుంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేడు సాయంత్రం రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి మందికి పైగా ప్రజల సంతకాల ప్రతులను ఆయనకు అందజేయనున్నారు.
నేటి షెడ్యూల్ ఇదీ
ఉదయం: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అన్ని జిల్లాల నుంచి వచ్చిన కోటి సంతకాల ప్రతుల బాక్సులతో కూడిన వాహనాలను వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభిస్తారు. అక్కడ నుంచి ఇవి నేరుగా విజయవాడలోని లోక్ భవన్ (పూర్వ రాజ్‌భవన్)కు చేరుకుంటాయి.
మధ్యాహ్నం
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ కీలక భేటీ నిర్వహిస్తారు.ప్రైవేటీకరణ నుంచి మెడికల్ కాలేజీల పరిరక్షణ కోసం భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణపై వారితో చర్చించనున్నారు.
సాయంత్రం 4:00 గంటలకు
వైఎస్ జగన్ వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో కలిసి లోక్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలుస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ (PPP) విధానంలో ప్రైవేట్ పరం చేయడం వల్ల పేదలకు వైద్యం, విద్యార్థులకు వైద్య విద్య ఎలా దూరమవుతుందో వివరిస్తూ ప్రజల ఆవేదనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారు. కోటి సంతకాలను ఆయన ముందు ఉంచనున్నారు.
ప్రజా తీర్పుగా కోటి సంతకాలు
గత అక్టోబర్‌లో గ్రామాల స్థాయిలో ‘రచ్చబండ’ పేరుతో మొదలైన ఈ కోటి సంతకాల సేకరణ ఉద్యమం కేవలం రెండు నెలల్లోనే దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొత్తం 1,04,11,136 మంది ఈ సంతకాల సేకరణలో పాల్గొనడం విశేషం. విద్యార్థులు, మేధావులు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పీపీపీ విధానానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత గ్రామమైన నారావారిపల్లెలో కూడా అక్కడి ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ సంతకాలు చేయడం గమనార్హం.
వైద్య రంగంలో జగన్ మార్క్.. కూటమి కత్తెర!
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ తమ ప్రభుత్వ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. అందులో ఏడు కాలేజీల నిర్మాణం పూర్తవగా, మిగిలిన 10 నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిధుల కొరత సాకుతో వీటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేలా పీపీపీ విధానాన్ని తెరపైకి తెచ్చిందని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. పేదలకు ఉచితంగా అందాల్సిన కార్పొరేట్ వైద్యాన్ని వ్యాపారంగా మార్చవద్దని, ప్రభుత్వమే ఈ కాలేజీలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ గురువారం గవర్నర్‌కు విన్నవించనున్నారు.

