క్రిస్మస్‌ రోజు రాముడి సన్నిధిలో గడిపిన జగన్‌
x

క్రిస్మస్‌ రోజు రాముడి సన్నిధిలో గడిపిన జగన్‌

జగన్‌ కడప పర్యటనలో ఉన్నారు. పులివెందులలో క్రిస్మస్‌ జరుపుకున్న జగన్‌ అదే రోజు రాముడి సన్నిధిలోను గడిపారు. జగన్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు జనం ఎగబడ్డారు.


కడప జిల్లా పులివెందులలో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అదే రోజు కోదండ రాముడి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారు. ప్రస్తుతం కడప జిల్లా పర్యటనలో ఉన్న జగన్‌ బుధవారం పులివెందులలోని సీఎస్‌ చర్చిలో బుధవారం క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. తల్లి విజయమ్మ, సతీమణి భారతీ, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జగన్‌ క్రిస్మస్‌ సందర్భంగా సీఎస్‌ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రిస్మస్‌ కేక్‌ను కట్‌ చేశారు. నూతన సంవత్సరం 2025 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. పాస్టర్లు, సంఘ సభ్యులతో కలిసి క్రిస్మస్‌ వేడుకలను ఎంజాయ్‌ చేశారు.

అనంతరం వైఎస్‌ఆర్‌ కడప జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లిలో కోదండ రామాలయం నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా కోదండ రాముడి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారు. జగన్‌ తన ప్రభుత్వ హయాంలో ఈ రామాలయం నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. దాదాపు రూ. 34 లక్షలు మంజూరు చేశారు. విగ్రహ ప్రతిష్ట అనంతరం పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్‌కు ప్రసాదాలను అందజేశారు. కోదండ రాముడికి పట్టు వస్త్రాలను జగన్‌ సమర్పించారు. జగన్‌ పర్యటన సందర్భంగా తాతిరెడ్డి పల్లి జనసంద్రంగా మారింది. జగన్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు జనం ఎగబడ్డారు.


Read More
Next Story