హైదరాబాద్ సీబీఐ కోర్టులో వైఎస్ జగన్
x
వైఎస్ జగన్

హైదరాబాద్ సీబీఐ కోర్టులో వైఎస్ జగన్

విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు చేరుకున్నారు.


వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు చేరుకున్నారు.
ఈ కేసులో 2013 సెప్టెంబర్‌ నుంచి జగన్‌ బెయిల్‌పై ఉన్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరినప్పటికీ సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆరేళ్లుగా జగన్‌ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యారు.
వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి (YS Jagan Hyderabad Visit) రాకతో బేగంపేట విమానాశ్రయం వద్ద కోలాహలం నెలకొంది. పెద్దఎత్తున అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. నాంపల్లి కోర్టుకు చేరేంత వరకు ఆయన వెంట పార్టీ శ్రేణులు, అభిమానులు నినాదాలతో హోరెత్తించారు.
జగన్‌ పర్యటన నేపథ్యంలో అటు గన్నవరం.. ఇటు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ల వద్ద పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇటీవల వైఎస్‌ జగన్‌ విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరై అటెండెన్స్‌ ఇచ్చారు. జగన్‌ రాక నేపథ్యంతో హైదరాబాద్‌ నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. కోర్టుకు వచ్చే 2 మార్గాలను ఆధీనంలోకి తీసుకుని.. న్యాయవాదులకు మాత్రమే లోపలికి అనుమతించారు.
కోర్టులో ప్రక్రియ ముగిసిన అనంతరం వైఎస్‌ జగన్‌ నేరుగా లోటస్‌పాండ్‌కు వెళ్లనున్నారు. అక్కడ తల్లి విజయమ్మను కలవనున్నారు.
Read More
Next Story