జగన్‌ కోర్టుకు రావాలి..సాక్ష్యం చెప్పాలి: కోడికత్తి కేసు అడ్వకేట్‌ సలీం
x

జగన్‌ కోర్టుకు రావాలి..సాక్ష్యం చెప్పాలి: కోడికత్తి కేసు అడ్వకేట్‌ సలీం

కోడికత్తి కేసు మరో సారి తెరపైకి వచ్చింది. శుక్రవారం దీనిపై కోర్టులో విచారణ జరిగింది. జగన్‌ సాక్ష్యం వరకు వచ్చి ఆగింది.


కోడికత్తి కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని న్యాయవాది సలీం డిమాండ్‌ చేశారు. మంత్రిగా ఉన్న నారా లోకేష్‌ పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరయ్యారని, సాధరణ ఎమ్మెల్యేగా ఉన్న జగన్‌ కోర్టుకు ఎందుకు రావడం లేదని ఆయన నిలదీశారు. విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో శుక్రవారం జరిగిన కోడికత్తి కేసు విచారణకు నిందితుడు జనుపల్లి శ్రీనివాస్‌తో కలిసి న్యాయవాది సలీం హాజరయ్యారు. ఈ సందర్భంగా నిందితుడు తరపున ఆయన కోర్టులో వాదనలు వినిపించారు. అనంతరం న్యాయవాది సలీం, దళిత సంఘాల నాయకుడు బూసి వెంకటరావుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. కోర్టుకు వచ్చి జగన్‌ ఎందుకు సాక్ష్యం చెప్పడం లేదని ప్రశ్నించారు. కోడికత్తి కేసు మీద ఈ రోజు వాదనలు జరిగాయన్నారు. ఈ కేసులో వైఎస్‌ జగన్‌ సాక్షిగా ఉన్నారని, కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలన్నారు.

నిందితుడు శ్రీనివాస్‌ బెయిల్‌ రద్దు చేయాలని ఎన్‌ఐఏ వాళ్లు వాదనలు వినిపించారన్నారు. దీనిపై వాళ్లు సుప్రీం కోర్టుకు వెళ్లారని చెప్పారు. అయితే జగన్‌మోహన్‌రెడ్డి వేసిన పిటీషన్‌పై సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ఎన్‌ఐఏ వాళ్లను తాను ప్రశ్నించినట్లు చెప్పారు. ఎన్‌ఐఏ వాళ్లు డబుల్‌ స్టాండర్డ్స్‌గా పని చేస్తున్నారని, బీదోడు, అమాయకుడైన నిందితుడు శ్రీను మీద బ్రహ్మాస్త్రం ఉపయెగిస్తున్నారని, చివరికి అతని మీద సుప్రీం కోర్టుకు వెళ్లారని, కానీ జగన్‌మోహన్‌రెడ్డి పిటీషన్‌పై సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లలేదనే అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దీని మీద ఎన్‌ఐఏ వాళ్లు తప్పు ఒప్పుకున్నారని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి వేసిన పిటీషన్‌ను హైకోర్టులో వెకేట్‌ చేస్తామని, దీని కోసం తమకు సహకరించాలని ఎన్‌ఐఏ వాళ్లు తనను అడిగినట్లు తెలిపారు. ఈ కేసులో తనకు ఒక కండిషన్‌ ఉందని, అదేంటంటే.. ‘రావాలి జగన్‌.. చెప్పాలి సాక్ష్యం.. కావాలి నిజం అదే తన నమ్మకం, అదే ఈ కేసు పరిష్కారమ’ని సలీం చెప్పారు. కోర్టు కూడా ఇవే అంశాలను పరిశీలించిందన్నారు.

మొన్నటి వరకు జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడైతే ఫ్రీగా ఉన్నారు కదా, జగన్‌మోహన్‌రెడ్డి నుంచి వాంగ్మూలం తీసుకొచ్చే విధంగా మీ నుంచి కూడా ప్రయత్నాలు చేయండని తనకు కూడా కోర్టు చెప్పిందన్నారు. తాను కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి కోర్టుకు ఎందుకు రావడం లేదనే దానిపై న్యాయవాది సలీం స్పందిస్తూ.. జగన్‌మోహన్‌రెడ్డి కోర్టుకు వస్తే ఆయన బండారం బయట పడుతుందని, ఆ భయం వల్లనే జగన్‌ కోర్టుకు రావడం లేదని అన్నారు. దాదాపు 9నెలలుగా ఈ కేసు పెండింగ్‌లో ఉందని, శుక్రవారం చేపట్టిన విచారణలో కూడా జగన్‌మోహన్‌రెడ్డి వాంగ్మూలం అంశం వరకు వచ్చి ఆగిందని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో వేసిన పిటీషన్‌పై తాను, ఎన్‌ఐఏ వాళ్లు కలిసి వాదనలు వినిపించి ఆ కేసును వెకేట్‌ చేయించే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. ఇది పూర్తి అయిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డిని ఈ కోర్టుకు రప్పించి వాంగ్మూలం రికార్డు చేయాలనే దిశగా ప్రయత్నాలు చేస్తామని సలీం చెప్పారు.
Read More
Next Story