సవీంద్ర కేసులో సత్యమేవ జయతే అన్న జగన్‌
x

సవీంద్ర కేసులో సత్యమేవ జయతే అన్న జగన్‌

సవీంద్ర కేసును సీబీఐకి అప్పగించడంపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.


పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ సవీంద్ర కేసును సీబీఐకి అప్పగించడం పట్ల వైసీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఈ కేసు పట్ల ఇచ్చిన సుమోటో ఆదేశాలను తాను స్వాగతిస్తున్నట్లు జగన్‌ పేర్కొన్నారు. ఆ మేరకు ఆయన శనివారం సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. సత్యమేమ జయతే అంటూ హ్యాష్‌ ట్యాగ్‌తో ఆయన తన పోస్టును ట్యాగ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితులకు ఈ సంఘటన నిదర్శనమన్నారు. అయితే సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో హైకోర్టు ఆదేశాలను పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలను అణిచి వేస్తోందన్నారు. దారుణంగా వ్యవహరిస్తూ.. వాక్‌ స్వాతంత్య్రాన్ని అడ్డుకుంటూ స్వేఛ్చను హరిస్తోందన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద నిత్యం అక్రమంగా కేసులు బనాయిస్తూ. అరెస్టులకు పాల్పడుతూ 111 సెక్షన్‌ను దుర్వినియోగానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. సరైన విచారణ, ప్రజల హక్కుల పరిరక్షణ అవసరం, ఆవశ్యకతను ఈ కేసులో కోర్టు ఆదేశాలు తేటతెల్లం చేశాయని ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Read More
Next Story