‘ఫలితాలు చూసి ఆశ్చర్యపోయా’.. ఓటమిపై జగన్
x

‘ఫలితాలు చూసి ఆశ్చర్యపోయా’.. ఓటమిపై జగన్

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన ప్రజాతీర్పు చూసి రాష్ట్రమంతా ఆశ్చర్యపోయింది. టీడీపీ కూటమి ఆంధ్రులు పట్టం కట్టారు. వైసీపీని కేవలం 10 సీట్లకే పరిమితం చేశారు.


ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన ప్రజాతీర్పు చూసి రాష్ట్రమంతా ఆశ్చర్యపోయింది. టీడీపీ కూటమి ఆంధ్రులు పట్టం కట్టారు. వైసీపీని కేవలం 10 సీట్లకే పరిమితం చేశారు. వైనాట్ 175, వైనాట్ కుప్పం అంటూ ప్రచారంలో ఓ ఊపుఊపిన వైసీపీ ఇప్పుడు 10 స్థానాలకే పరిమితం కావడాన్ని ఆ పార్టీ నేతలే జీర్ణించుకోలేకున్నారు. వైసీపీ మంత్రులు కూడా ఘోర పరాభవాన్ని మూటకట్టుకున్నారు. తాజాగా దీనిపై స్పందించిన సీఎం జగన్ కూడా ఎన్నికల ఫలితాలు చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంత మంచి చేసినా, కోట్ల మందికి సంక్షేమం ఇంటి ముంగిటకు తీసుకొచ్చిన తమ ప్రభుత్వానికి ఇలాంటి ఫలితం ఎదురొస్తుందని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. అన్ని వర్గాల మంచి కోసం అడుగడుగునా వారితో కలిసి నడిచిన ప్రభుత్వం తమదేనని గుర్తు చేశారు.

ఏపీ ఫలితాలు ఎలా ఉన్నాయంటే


అత్యంత రసవత్తరంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఈరోజు తేలింది. 175 స్థానాలకు హోరాహోరీగా జరిగిన ఎన్నికల పోరులో టీడీపీ కూటమి రికార్డ్ స్థాయి విజయం సాధించింది. టీడీపీ కూటమి 165 స్థానాల్లో విజయం సాధించింది. వైసీపీ 10 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే రాష్ట్రంలో జనసేన విజయం అత్యంత సంచలనంగా మారింది. పోటీ చేసిన మొత్తం 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లలో జనసేన విజయం సాధించింది. మరోవైపు 144 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 135 సీట్లలో విజయం సాధించింది.బీజేపీ 10 సీట్లలో పోటీ చేయగా 8 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ మాత్రం అటు అసెంబ్లీ స్థానాల్లో, ఇటు లోక్‌సభ స్థానాల్లో ఖాతా కూడా తెరవలేదు. కేవలం ఓట్లు చీల్చడం మాత్రమే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన పనిలా ఉందని విశ్లేషకులు కూడా చెప్తున్నారు.

‘వాళ్ల ఓట్లు ఏమయ్యాయో’

‘‘వైసీపీ పాలనలో 53లక్షల మంది తల్లులకు, వాళ్ల పిల్లలకు మంచి చేశాం. ఎప్పుడూ వారు బాగుండాలనే అహర్నిశలు తాపత్రయపడ్డాను. 66లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు అందించి వారికి అండగా నిలిచాం. ఎప్పటికప్పుడు వారి కష్టాన్ని మా కష్టం అనుకుంటూ వచ్చాం. పింఛన్ల కోసం ప్రభుత్వా కార్యాలయాల చుట్టూ తిరగలేరని పింఛన్‌ను ఇంటికే తీసుకెళ్లాం. ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియట్లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అత్యంత ఆశ్చర్యంగా ఉంది’’ అన్నారు.

ఇప్పుడు ఏమీ చేయలేం

ప్రజల సంక్షేమం కోసం, అన్ని వర్గాల మంచి కోసం, రాష్ట్ర అభివృద్ధఇ కోసం ఎంతో తాపత్రయపడ్డామని తెలిపారు. ‘‘సామాజిక న్యాయం చేసి ప్రపంచానికి చూపాం. మేనిఫెస్టోను అత్యంత పవిత్రంగా భావించాం. ప్రకటించిన మేనిఫెస్టోను చిత్తశుద్దితో అమలు చేశాం. చేయగలిగినదంతా చేశాం. ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు. ప్రజల తీర్పును మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాం. కానీ ఏది ఏమైనా పేదవాడికి తోడుగా, అండగా ఎల్లప్పుడు వైసీపీ నిలబడుతుంది’’అని చెప్పారు.

విజేతలకు అభినందనలు

‘‘పెద్దపెద్ద నేతల కూటమి ఇది. చంద్రబాబు, బీజేపీ, పవన్ కల్యాణ్ సాధించిన గొప్ప విజయానికి అభినందనలు. నాకు తోడుగా నిలబడిన ప్రతి నాయకుడు, కార్యకర్త, అక్కచెల్లెమ్మలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏమైందో తెలీదు కానీ.. ఏం చేసినా.. ఎంత చేసినా వైసీపీకి వచ్చే 40 శాతం ఓటు బ్యాంకును తగ్గించడం వారి వల్ల కాలేదు. కిందపడినా తప్పకుండా మళ్లీ పైకి లేస్తాం. ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేయడం నాకు కొత్తేమీ కాదు. ఎవరూ అనుభవించని, ఊహించని రాజకీయ కష్టాలను నేను అనుభవించా. దేనికైనా సిద్ధం. ఏ పరిస్థితినైనా గుండె ధైర్యంతో ఎదుర్కుంటా. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే వారికి ఆల్‌ ది బెస్ట్’’ అని చెప్పుకొచ్చారు జగన్.

Read More
Next Story