
భారీ ధర్నాకు జగన్ ప్లాన్..వైసీపీ శ్రేణులలో జోష్
అనకాపల్లి జిల్లాలో 9న పర్యటన తరువాత యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేయనున్న వైసీపీ అధినేత
ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తిగా క్యాష్ చేసుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది.పథకాల అమలులో ,హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని ఆరోపిస్తున్న వైసీపీ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి పార్టీ అధినేతగా తానే పూర్తి స్థాయిలో రంగంలో దిగాలని జగన్ చేస్తున్న ఆలోచన ఇప్పడు పార్టీ శ్రేణులలో జోష్ పెంచుతోంది. అమరావతికి రెండో దఫా భూసేకరణ, ప్రైవేటు సంస్ధలకు భూముల కేటాయింపు ఇలా ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుంటున్నాయని , వాటిని మరింతగా ప్రజలలోకి తీసుకెళ్లానని జగన్ భావిస్తున్నారు.అయితే మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీకి వరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇప్పటికే వైసీపీ శ్రేణులు మెడికల్ కాలేజీల కోసం పోరుబాట నిర్వహించాయి. ఇక ఇప్పుడు ఈ నిరసనల్లో తాను స్వయంగా పాల్గొనాలని జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించి,అక్కడ జరిగిన నిర్మాణ పనులను పరిశీలించనున్నారు.జగన్ పర్యటన ఖరారు కావడంతో పార్టీ శ్రేణులలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది.