చంద్రబాబు చెప్పిన జగన్‌ నవరత్నాలివే
x

చంద్రబాబు చెప్పిన జగన్‌ నవరత్నాలివే

జగన్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ అమలు చేస్తోన్న నవరత్నాలివే అంటూ 9 పేర్లు వెల్లడి.


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోన్న నవ రత్నాల సంక్షేమ పథకాలపై సంచలన కామెంట్స్‌ చేశారు. తమ ప్రభుత్వం హయాంలో బడ్జెట్‌లో 19 శాతం నిధులు సంక్షేమ పథకాలకు ఖర్చు చేశామని, జగన్‌ ప్రభుత్వం మాత్రం కేవలం 10 శాతం నిధులు మాత్రమే సంక్షేమ పథకాలకు ఖర్చు చేశారని చంద్రబాబు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శిలో శనివారం నిర్వహించిన రోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వంలో అమల్లోకి తెచ్చిన నవ రత్నాల సంక్షేమ పథకాలకు కొత్త భాష్యం చెప్పారు. జగన్‌ అమలు చేస్తున్న నవ రత్నాలు ఇవే అంటూ తాజాగా 9 అంశాలతో కూడిన పేర్లను వెల్లడించారు.

1. ఇసుక మాఫియా
2. జే బ్రాండ్‌ మద్యం
3. భూ మాఫియా
4. మైనింగ్‌ మాఫియా
5. హత్యా రాజకీయాలు
6. ప్రజల ఆస్తుల కబ్జా
7. ఎర్ర చందనం, గంజాయి
8. దాడులు, అక్రమ కేసులు
9. శవ రాజకీయాలు
ఈ తొమ్మిదింటిని నవ రత్నాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తూచా తప్పకుండా అమలు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని వాటికి బదులుగా ఇసుక మాఫియా, జే బ్రాండ్‌ మద్యం, భూ మాఫియా, మైనింగ్‌ మాఫియా, హత్యా రాజకీయాలు, ప్రజల ఆస్తులను కబ్జా చేయడం, ఎర్ర చందనం, గంజాయి, దాడులు, అక్రమ కేసులు, శవ రాజకీయాలు వంటి నవ రత్నాల పథకాలను అమలు చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చెప్పిన జగన్‌ నవ రత్నాలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రాజకీయ వర్గాల్లోను ఇవి చర్చనీయాంశంగా మారాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, నాడు నేడు, పేదలందరికీ ఇళ్లు, మహిళా సాధికారత, సామాజిక భద్రత, అభివృద్ధి వంటి పథకాలను నవరత్నాలుగా అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చెబుతోంది. గత ఐదేళ్లల్లో 99 శాతం నవ రత్నాలను అమలు చేశామని, వచ్చే ఐదేళ్లల్లో కూడా వీటిని కొనసాగిస్తామని జగన్‌ వెల్లడించారు.
Read More
Next Story