
అమరావతి రెండో విడత ఓ 'పిచ్చి పని': వైఎస్ జగన్
తన బినామీల దోపిడీ కోసమే రాజధానిలో రెండో విడత భూసేకరణ చేస్తున్నారని సీఎం చంద్రబాబుపై జగన్ నిప్పులు చెరిగారు.
రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం ప్రారంభించిన రెండో దశ భూ సమీకరణపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..మొదటి దశలో సేకరించిన భూముల్నే అభివృద్ధి చేయలేని చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ కొత్తగా వేల ఎకరాలను సేకరించడం కేవలం తన బినామీలకు లాభం చేకూర్చేందుకేనని ఆరోపించారు. ఇంకా ఏమని విమర్శలు గుప్పించారంటే..
మొదటి దశకే దిక్కులేదు:
రాజధాని కోసం ఇప్పటికే రైతుల నుంచి 50 వేల ఎకరాలు సేకరించారని, ఆ భూమిలో రోడ్లు, కరెంటు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకే రూ. లక్ష కోట్లు అవసరమని చంద్రబాబు గతంలోనే చెప్పారని జగన్ గుర్తు చేశారు. పాత భూముల్నే అభివృద్ధి చేయకుండా మళ్లీ రెండో దశ భూసేకరణ చేయడం 'పిచ్చి పని' అని మండిపడ్డారు.
రూ. 2 లక్షల కోట్ల భారం:
రెండో దశలో మరో 50 వేల ఎకరాలు సేకరిస్తే, మొత్తం లక్ష ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని.. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తెస్తారని నిలదీశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంపై ఇలాంటి భారం మోపడం భావ్యం కాదని హితవు పలికారు.
రైతుల ఆవేదన:
మొదటి విడతలో భూములిచ్చిన రైతులకు గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని, ఇప్పుడు ఆ రైతులు రోడ్డున పడి బోరుమంటున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయకుండా కొత్తగా భూములు సేకరించడం వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారు.
బినామీల కోసమే దోపిడీ:
సీఎం చంద్రబాబు తన బినామీల ఆస్తుల విలువ పెంచడానికి, వారి ప్రయోజనాల కోసమే మళ్లీ భూసేకరణ హడావుడి చేస్తున్నారని, ఇది కేవలం రియల్ ఎస్టేట్ మాఫియాకు మేలు చేసే చర్యేనని ఘాటుగా విమర్శించారు.

