
జగన్‌కు చరిత్ర తెలియదు..నాగరికత అంతకన్నా తెలియదు: సీఎం చంద్రబాబు
నదీగర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి (River Basin) తేడా తెలియని వ్యక్తి రాజధాని గురించి మాట్లాడటం హాస్యాస్పదమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
నదుల పుట్టుక, నాగరికత వికాసంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు కనీస అవగాహన లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన జగన్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. రాజధాని అమరావతిపై జగన్ ఇప్పటికీ విషం చిమ్ముతున్నారని, ప్రజలు బుద్ధి చెప్పినా ఆయనలో మార్పు రాలేదని మండిపడ్డారు.
నదీగర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి (River Basin) తేడా తెలియని వ్యక్తి రాజధాని గురించి మాట్లాడటం హాస్యాస్పదమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సింధూ నాగరికత నుంచి నేటి లండన్, ఢిల్లీ వరకు ప్రపంచంలోని ప్రముఖ నగరాలన్నీ నదీ తీరాల్లోనే వర్ధిల్లాయని.. ఆ కనీస జ్ఞానం కూడా జగన్‌కు లేదని ధ్వజమెత్తారు. రాయలసీమకు నీరిచ్చే పట్టిసీమను విమర్శించిన జగన్, 'రాయలసీమ లిఫ్ట్' పేరుతో మట్టి పనులు చేసి రూ. 900 కోట్లు దోచుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయాల కోసం సెంటిమెంట్లు రెచ్చగొట్టడం మానుకోవాలని బాబు హితవు పలికారు. ప్రపంచవ్యాప్తంగా నాగరికత నదుల వెంబడే మొదలైందని బాబు గుర్తుచేశారు. లండన్ (థేమ్స్), ఢిల్లీ (యమునా) వంటి నగరాలను ఉదాహరణగా చూపుతూ.. నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని ఉండటం అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు కృష్ణా జలాలను తరలించి, ఆ ప్రాంతాన్ని ఉద్యానవన హబ్‌గా మార్చిన ఘనత తమదేనని చెప్పారు. గత ప్రభుత్వం 2020లోనే ఈ పనులను నిలిపివేసి రాయలసీమకు ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ పనుల్లో కేవలం మట్టి పనులు చూపి రూ. 900 కోట్లు బిల్లులు క్లెయిమ్ చేసుకున్నారని, ఆ ప్రభుత్వంలో దోపిడీ పరాకాష్టకు చేరిందని విమర్శించారు. రాయలసీమను 'రత్నాల సీమగా మార్చే సత్తా తమ ప్రభుత్వానికి ఉందని ధీమా వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని కోరుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. మిగులు జలాల వినియోగంపై తెలంగాణతో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని, రాజకీయాల కోసం సెంటిమెంట్లు రెచ్చగొట్టబోమని స్పష్టం చేశారు.

