సోదరుని అంత్యక్రియల్లో జగన్ దంపతులు
స్వతహాగా వైద్యుడు అయ్యుండి డెంగీ జ్వరంతో డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి మరణించారు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరుడు వైఎస్ అభిషేక్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం పులివెందులలో జరిగాయి. అభిషేక్‌రెడ్డి అంతిమ యాత్రంలో జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్‌ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారీ సంఖ్యలో చేరుకున్న వైఎస్‌ఆర్ కుటుంబ అభిమానులు దారి పొడవునా అభిషేక్‌రెడ్డి చిత్ర పటాలు, ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ వీడ్కోలు పలికారు.
అభిషేక్ రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఈయన జగన్‌మోహన్‌రెడ్డికి చాలా దగ్గరి బందువు. అభిషేక్‌రెడ్డి.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దనాన్న వైఎస్ ప్రకాష్‌రెడ్డి మనవడు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో అభిషేక్‌రెడ్డి బాధపడుతున్నారు. డెంగీ జ్వరం సోకడంతో అనారోగ్యం పాలయ్యారు. ఇది తీవ్రతరం కావడంతో హైదరాబాద్‌లోని ఏజీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో అభిషేక్‌రెడ్డి చికిత్సలు పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డికి వివాహం అయింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్న వయసులోనే అభిషేక్ రెడ్డి మృతి చెందడంతో వైఎస్ కుటుంబం శోక సముద్రంలో మునిగి పోయింది. పులివెందులలో, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోను విషాదం అలముకుంది.
అంత్యక్రియల కోసం అభిషేక్ రెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలించారు. ప్రజల సందర్శనం కోసం పులివెందులలోని స్వగృహంలో ఉంచారు. అభిషేక్‌రెడ్డి వైఎస్ కుటుంబ సభ్యుడు కావడంతో అభిషేక్‌రెడ్డిని చివరి సారిగా చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు చేరుకున్నారు. చిన్న వయసులోనే కాలం చేయడంతో దుఃఖాన్ని ఆపుకోలేక పోయారు. నేతలు, శ్రేణులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి మరణ వార్త విన్న మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు బెంగుళూరు నుంచి పులివెందులకు చేరుకున్నారు. అభిషేక్‌రెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించారు. తీవ్ర విషాదంలో మునిగిపోయిన అభిషేక్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో దగ్గరి బందువు అయిన వైఎస్ ఆనందరెడ్డి ఇంటికెళ్లారు. తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్న ఆనందరెడ్డి సతీమణి సుశీలమ్ము ్న పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Next Story