జగన్‌ ఒప్పందం రద్దు చేయాలి..ఆదాని కంపెనీని బ్లాక్‌ లిస్టులో పెట్టాలి
x

జగన్‌ ఒప్పందం రద్దు చేయాలి..ఆదాని కంపెనీని బ్లాక్‌ లిస్టులో పెట్టాలి

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఆదానితో చేసుకున్న ఒప్పందం రాష్ట్రానికి పెను భారం. అక్రమ ఒప్పందం వల్ల ప్రజలపై భారం పడుతోంది.


మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఆదానితో జరిగిన విద్యుత్‌ ఒప్పందాలను రద్దు చేయాలని, ఆదాని కంపెనీని బ్లాక్‌ లిస్టులో పెట్టాలని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. ఆ మేరకు సీఎం చంద్రబాబుకు షర్మిల సోమవారం బహిరంగ లేఖ రాశారు. ఆదానితో చేసుకున్న ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెను భారమని, పాతికేళ్ల పాటు ప్రజలపై లక్షన్నర కోట్ల భారం పడుతుందని అన్నారు. అర్థరాత్రి అనుమతులపై దర్యాప్తు చేపట్టాలన్నారు. సీబీఐతో కానీ సిట్టింగ్‌ జడ్జితో కానీ విచారణ చేపట్టాలన్నారు. గంగవరం పోర్టు ఆదానికి అప్పగించడంపైనా విచారణ జరపాలన్నారు. విద్యుత్‌ కొనుగోళ్ల విషయంలో లంచాలు తీసుకున్న అమెరికా దర్యాప్తు సంస్థలు ఆధారాలు చూపించడంతో పాటు నిరూపించాయన్నారు. రూ. 1750 కోట్లు జగన్‌ అండ్‌ కోకి లంచాలు ముట్టినట్లు అమెరికా కోర్టులో తీవ్ర అభియోగాలు మోపబడ్డాయన్నారు. ఆదాని భారత దేశ పరువును ప్రపంచం ముంగిట తీశారన్నారు. ఏపీ పరువును జగన్‌ తీశారని విమర్శించారు. లంచాల కోసం ఏపీ పరువును తాకట్టు పెట్టడంతో పాటు తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బ తీశారని మండిపడ్డారు. ఆదానీతో చేసుకున్న విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాలన్నీ నాటి సీఎంవో నుంచే నడిచాయన్నారు. గ్రీన్‌ ఎనర్జీ కంపెనీతో ఒప్పందం చేసుకోవాలని సెకీ కోరగా, దానిని పక్కన పెట్టి ఆదానీతో ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు.

Read More
Next Story