సొంత ఇమేజ్‌తోనే జనం మధ్యకు జగన్‌
x

సొంత ఇమేజ్‌తోనే జనం మధ్యకు జగన్‌

వైఎస్‌ఆర్‌ లెగస్సీతో 2019లో గెలుపొంది.. సొంత ఇమేజ్‌తో వెళ్తున్న జగన్‌ 2024 ఎన్నికల్లో విజయం సాధిస్తారా? లేదా వైఎస్‌ఆర్‌ లెగస్సీని ఉపయోగించుకోక తప్పదా?


సొంత ఇమేజ్‌ను ఉపయోగించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు. 2014, 2019 లో జరిగిన ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ అజెండానే తన అజెండాగా భుజంపై వేసుకొని జగన్‌ ప్రచారం నిర్వహించారు. 2014లో ఓటమి పాలైనా 2019లో అఖండ విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఎక్కువుగా జగనన్న పేరునే వినియోగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో వైఎస్‌ఆర్‌ రాజీవ్‌గాంధీ, ఇందిరా గాంధీ పేర్లకు ఎక్కువ ప్రాధాన్యతిచ్చారు. వైఎస్‌ఆర్‌ చనిపోయి దశాబ్దం దాటినా ఇంకా వైఎస్‌ఆర్‌ పేరుతోనే ఎన్నికల్లో పోవడం వైఎస్‌ జగన్‌ మనసుకు కాస్త కష్టమనిపించినట్లుంది. వైఎస్‌ఆర్‌ ఫొటోను ఎలాగైతే ప్రతి ఇంట్లో అభిమానులు పెట్టుకున్నారో అలాగే తన ఫొటోను కూడా అభిమానుల ఇళ్లల్లో కనిపించాలని వైఎస్‌ జగన్‌ అప్పుడు అప్పడు అంటుండేవారు. ఆ భావనతోనే వైఎస్‌ఆర్‌ పేరుకు బదులుగా వైఎస్‌ జగన్‌ పేరునే ఎక్కువుగా ప్రజలు తలచుకునేలా చేస్తున్నారు.

సంక్షేమ పథకాలకు పేర్లు
అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లల్లో వైఎస్‌ఆర్‌ పేరుకు ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చారు. అందులో భాగంగా కొన్ని పథకాలకు ఆయన పేరు పెట్టారు. ప్రధానంగా వైఎస్‌ఆర్‌ పేరుతో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ, వైఎస్‌ఆర్‌ ఆసరా(పించెన్లు) వంటి పథకాలకు మాత్రం వైఎస్‌ఆర్‌ పేరు కొనసాగుతోంది. తర్వాత తండ్రి వైఎస్‌ఆర్‌ పేరుకు బదులు తన పేరునే పథకాలకు పెట్టుకోవాలనే నిర్ణయానికి జగన్‌ వచ్చారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద అంటూ సుమారు 10 పథకాలకు జగన్‌ పేరుతో అమలవుతున్నాయి. పథకాలను పక్కన పెట్టితే ఎన్నికల్లో జగన్‌ ప్రచారం సాగించే సరళని గతానికి ఇప్పటికీ ఒక సారి బేరీజు వేస్తే గతంలో ప్రతి ఒక్క విషయంలోను వైఎస్‌ఆర్‌ పేరును పలికే వారు. ఈ ఎన్నికల ప్రచారంలో మాత్రం వైఎస్‌ఆర్‌ పేరు దాదాపు ప్రస్తావించ లేదనే చెప్పొచ్చు.
జగన్‌ను చూసి ఓట్లేయండి
మీ జగనన్న, జగన్‌ మామయ్య, మీ తమ్ముడు జగన్‌ మంచి చేశాడని అనుకుంటేనే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లేయండి.. నేను మంచి చేయలేదని భావిస్తే మీ ఇష్టం, ఇది పెత్తందార్లుకు పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ ప్రసంగిస్తున్నారే తప్పా వైఎస్‌ఆర్‌ మన మనుసుల్లో ఎప్పటికీ చిర స్థాయిగా నిలచిపోతారని మాత్రం ఎక్కడా చెప్పక పోవడం విశేషం. అంటే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ వచ్చిందనే భావనలో జగన్‌ ఉన్నారు. గతంలో మాదిరిగా తన తండ్రి వైఎస్‌ఆర్‌ పేరును నిత్యం ప్రస్తావించక పోయినా జగన్‌ను చూసే వైఎస్‌ఆర్‌సీపీకి ఓట్లు వేస్తారనే వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా ఇదే పంథాను ఫాలో అవుతున్నారు. ప్రచారం చేస్తున్న వాళ్లందరూ జగనన్న చేసిన చేసిన సాయాన్ని మరచి పోవద్దని చెబుతూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారే తప్ప వైఎస్‌ఆర్‌ బిడ్డను చూసి ఓట్లు అడగడం లేదు.
వైఎస్‌ఆర్‌ బతికి ఉండగా కాంగ్రెస్‌ పార్టీకి ఒక మీడియా అంటూ కావాలనుకున్నారు. దీని కోసం సాక్షిని తీసుకొచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత సాక్షి పత్రికపై వైఎస్‌ఆర్‌ ఫొటోను ప్రచురిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన డైరెక్టర్ల సమావేశంలో ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా ఫొటోలు కొనసాగించడం సరైన నిర్ణయమేనా అని చర్చ జరిగినట్లు సమాచారం. అందులో భాగంగానే సాక్షి టీవీ స్క్రీన్‌పై కుడివైపు లోగో ఉండే వైఎస్‌ఆర్‌ ఫొటోను తొలగించారు. త్వరలోనే సాక్షి పత్రికపైన కనిపించే వైఎస్‌ఆర్‌ ఫొటోను కూడా తొలగించే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం.
వైఎస్‌ఆర్‌ పాలన అందిస్తామంటున్న షర్మిల
నేను వైఎస్‌ఆర్‌ బిడ్డను. మీ వైఎస్‌ షర్మిల రెడ్డిని. వైఎస్‌ఆర్‌ ఎలాంటి సంక్షేమ పాలన అందించారో అలాంటి సంక్షేమ పాలన కాంగ్రెస్‌పార్టీ ద్వారా మీకు అందిస్తాం. రాష్ట్రానికి రావాలసిన నిధులు రాబట్టుతాం. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడం వైఎస్‌ఆర్‌ లక్ష్యం. ఆ బాటలోనే నడుద్దాం. అంటూ వైఎస్‌ షర్మిల వైఎస్‌ఆర్‌ పేరుతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌ బిడ్డగా షర్మిలను ఓటర్లు ఏ స్థాయిలో ఆదరిస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికే ఒక దఫా వైఎస్‌ఆర్‌ కుమారుడిని ప్రజలు ఆదరించి అవకాశం కల్పించారు. కాంగ్రెస్‌ తరఫున నేను ఉన్నానంటూ ముందుకు వచ్చిన వైఎస్‌ఆర్‌ బిడ్డ షర్మిలను కూడా ఇలాగే ఆదరిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.
Read More
Next Story