
జగన్ మళ్లీ కోర్టుకు ఎందుకు? అసలు విషయం ఇదే!
జగన్ కోర్టుకు వెళ్లకపోతే ఏమవుతుందీ? సీబీఐ ఎందుకంత పట్టుదలతో ఉందీ?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘకాలం తర్వాత సీబీఐ కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న వైఎస్ జగన్ కోర్టుకు వస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. దశాబ్దం పైగా ఈ కేసు కోర్టులో కొనసాగుతోంది. ఇటీవల యూరప్ పర్యటనకు వెళ్లేందుకు ఆయన కోర్టు అనుమతి కోరగా, “తిరిగి వచ్చాక నవంబర్ 14న వ్యక్తిగతంగా హాజరుకావాలి” అని కోర్టు షరతు పెట్టింది.
జగన్ పర్యటన ముగించుకొని వచ్చినా 14న కోర్టు ఎదుట హాజరుకాలేదు. భద్రతా కారణాలు, పరిపాలనా ఇబ్బందులు చూపిస్తూ, తన తరఫు న్యాయవాది హాజరుకావచ్చు- అంటూ మినహాయింపు కోరుతూ మెమో దాఖలు చేశారు. కానీ సీబీఐ దీనిని వ్యతిరేకించింది.
సీబీఐ వాదన ప్రకారం జగన్‌కు బెయిల్ ఇచ్చినప్పుడు స్పష్టమైన షరతు ఉందని, ప్రతి విచారణకు ఆయన స్వయంగా హాజరుకావాలి. కోర్టు ఈ వాదనలతో ఏకీభవించి, ఆయన మినహాయింపు అభ్యర్థనను కొట్టివేసింది. ఇప్పుడు జగన్ నవంబర్ 21లోపు కోర్టు ముందు తప్పనిసరిగా హాజరుకావాలి.
ఈ కేసు ఎందుకు ముఖ్యమంటే?
ఇది 2011లో నమోదైన కేసు. ఇందులో జగన్‌పై అధికార దుర్వినియోగం చేసి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ 10కి పైగా చార్జ్‌షీట్లు దాఖలు చేసింది. విచారణ ఇంకా కొనసాగుతోంది.
రాజకీయంగా జగన్ తిరిగి యాక్టివ్ అవుతున్న ఈ సమయంలో, పాత కేసు మళ్లీ వేడెక్కింది. చట్టపరంగా ఇది ఆయనకు తప్పనిసరి హాజరు. రాజకీయంగా ప్రత్యర్థులకు ఓ ఆయుధం. అవినీతి ఇమేజ్‌ను గుర్తుచేసే అవకాశం.
జగన్ కోర్టుకు ఎందుకు వెళ్లాలి?
2012లో నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల (disproportionate assets) కేసు. Central Bureau of Investigation (CBI) విచారణ చేస్తోంది.
కోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశించినా నిర్లక్ష్యం చేస్తే జగన్ పై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బెయిల్ రద్దు చేసే విషయాన్నీ పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ పరిస్థితిలో జగన్ తప్పకుండా కోర్టుకు హాజరుకావాలి. ముఖ్యమంత్రిగా ఉన్న 2019-2024 మధ్య కాలంలో ఆయనకు మినహాయింపు లభించింది. ఆయన తరఫున లాయర్లే కోర్టుకు హాజరయ్యారు. ఇప్పుడు ఆయన అధికారంలో లేరు గనుక కోర్టుకు రావాల్సిందేనని సీబీఐ పట్టుబడుతోంది. పైగా Supreme Court of India ఇప్పటికే CBI/EDని వివరాలు సమర్పించమని ఆదేశించింది. కేసును త్వరగా విచారించమని చెప్పింది.
Next Story

