తప్పు అధికారులది... బాధితులు విద్యార్థులు!
x

తప్పు అధికారులది... బాధితులు విద్యార్థులు!

డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో సాఫ్ట్ వేర్ లోపాలు, అధికారుల తీరు వల్ల విద్యా సంవత్సరం కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.


డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో తలెత్తిన సమస్యలతో కొందరు విద్యార్థులు విద్యాసంవత్సరం కోల్పోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. రెండో విడత ప్రవేశాల రిజిస్ట్రేషన్ల గడువు ఈ నెల 3వ తేదీతో ముగిసింది. 10వ తేదీన కేటాయింపులు, 11వ తేదీ నుంచి ప్రవేశాలు కల్పించాల్సి ఉంది. తొలి విడత రిజిస్ట్రేషన్లలో విద్యార్థులు పడిన ఇబ్బందులపై ఉన్నత విద్యా మండలి అధికారులు పట్టించుకున్నట్లు లేదు. దీనివల్ల రెండో విడతలోనూ అవే సమస్యలు పునరావృతం అయ్యాయి.

ఆదాయ ధ్రువీకరణ పత్రం లేనివారికి తెల్ల రేషన్‌ కార్డును అంగీకరించాల్సి ఉంది. కానీ రేషన్‌ కార్డు ఆప్షన్‌ ఇచ్చినప్పుడు ‘నో డేటా ఫౌండ్‌’ అని వస్తోంది. 2019 సంవత్సరానికి ముందు ఇంటర్‌ పూర్తి చేసిన వారి వివరాలు బోర్డు వివరాల్లో కనిపించడం లేదు. హాల్‌ టికెట్‌ నంబరు పొందుపరిచేటప్పుడు ‘0’(సున్నా)తో ప్రారంభమైన హాల్‌ టికెట్‌ నంబరును సాఫ్ట్‌వేర్‌ తీసుకోలేదు. నాలుగు సంవత్సరాల వివరాలను రిజిస్ట్రేషన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిన సర్టిఫికెట్ల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో అవసరమైన సర్టిఫికెట్లలో ఏ ఒక్కటి లేకపోయినా.. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆగిపోయింది.

విద్యార్థి ఒకటి నుంచి ఇంటర్‌ వరకు నగరంలోనే చదువుకున్నా.. ఆధార్‌ కార్డులోని చిరునామా ఇతర రాష్ట్రంలో ఉంటే తిరస్కరణకు గురైంది. ఈ సమస్యలన్నింటికీ రెండో విడత రిజిస్ట్రేన్లలోనూ పరిష్కారం లభించక విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రవేశాలు పొందనివారు.. స్పాట్‌ అడ్మిషన్లలో చేరినప్పటికీ ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా చేశారు. ఫీజు భారం తట్టుకోలేని వారు డిగ్రీలో ప్రవేశం పొందలేక.. విద్యా సంవత్సరాన్ని నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రిజిస్టర్‌ చేసుకున్నట్లు చూపిస్తుంది
నా పేరు జె.అజయ్‌కుమార్, మాది జగ్గయ్యపేట. నిమ్మకూరులోని ఏపీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో 954 మార్కులతో పాసయ్యాను. తొలి విడత రిజిస్ట్రేషన్ల సమయంలో అన్ని ధ్రువ పత్రాలు అప్‌లోడ్‌ చేశాను. ‘సర్వర్‌ ఎర్రర్‌’ చూపించింది. ‘ఆప్షన్స్‌’ కానీ ‘అలాట్‌మెంట్‌’ కానీ జరగలేదు. ప్రస్తుతం రెండో విడతలో రిజిస్ట్రేషన్‌ కోసం ప్రయత్నిస్తే ‘ఆల్‌ రడీ రిజిస్టర్డ్‌’ అని చూపిస్తోంది. సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో ఏడాది వృథా అవుతుంది.

ఎడిట్‌’ అవకాశం లేకపోవడంతో..

విజయవాడ వన్‌ టౌన్, పంజా సెంటర్‌లోని మహంతిపురంలో ఛాందినీ పర్వీన్ ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుకుంది. మా అమ్మతో నేను ఇక్కడే ఉంటున్నాను. వ్యాపార రీత్యా నాన్న బిహార్‌లో ఉంటారు. నా ఆధార్‌ కార్డులో చిరునామా స్థానికంగా లేకపోవడంతో తొలి విడత రిజస్ట్రేషన్‌లో తిరస్కరణకు గురయ్యాను. రెండో విడతలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. రిజిస్ట్రేషన్ల సమయంలోనే ‘హెల్ప్‌ లైన్‌’ కేంద్రంలో ‘ఎడిట్‌’ చేసే ఆప్షన్‌ ఇవ్వక పోవడంతో డిగ్రీ చదువుకునే అవకాశం కోల్పోయాను.

ఇందుకు బాధ్యత వహించాల్సింది అధికారులు. కానీ వారు పట్టించుకోవడం లేదు. విద్యార్థులు చదువుకునే అవకాశం కోల్పోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి విద్యార్థులు ప్రభుత్వ రాయితీలతో చదువుకునే అవకాశం కల్పించాలి.

Read More
Next Story