వైఫల్యాల నింద కలెక్టర్లపై నెట్టడం బాబు నైజం: వైఎస్ జగన్ ధ్వజం
x

వైఫల్యాల నింద కలెక్టర్లపై నెట్టడం బాబు నైజం: వైఎస్ జగన్ ధ్వజం

వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సందర్భంగా సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు.


ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తన వైఫల్యాలను అధికారులపై నెట్టి తప్పించుకోవాలని సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం తాడేపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జగన్ ఏమని మండిపడ్డారంటే..

గ్రాఫ్ పడిపోతోంది బాబుదే:

"తన గ్రాఫ్ పడిపోవడానికి కలెక్టర్లే కారణమని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉంది. ఇక్కడ పడిపోతోంది కలెక్టర్ల గ్రాఫ్ కాదు, చంద్రబాబు గ్రాఫ్. ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయని ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది" అని జగన్ ఎద్దేవా చేశారు.

బడ్జెట్ ఉంది కానీ మేలు లేదు:

కూటమి ప్రభుత్వం ఇప్పటికి రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టిందని, త్వరలో మూడో బడ్జెట్ రాబోతోందని, అయినా ప్రజలకు ఒక్క రూపాయి మేలు జరగలేదని జగన్ విమర్శించారు. గత ప్రభుత్వం (వైఎస్సార్‌సీపీ) హయాంలో సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి పథకాలు అమలు చేశామని, నేడు ఆ పరిస్థితి లేదని గుర్తు చేశారు.

సూపర్ సిక్స్ మోసం:

ఎన్నికల ముందు 'సూపర్ సిక్స్', 'సూపర్ సెవెన్' అని ఆశలు కల్పించిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక వాటిని గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. "కొత్త పథకాలు లేవు సరే, పాత పథకాలను కూడా రద్దు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అందడం లేదు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిచిపోయింది. దీంతో పేద పిల్లల చదువులు ఆగిపోయే పరిస్థితి వచ్చింది" అని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవస్థల నాశనం :

రాష్ట్రంలో పాలనా వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ప్రజల నుండి వస్తున్న నిరసనలను తట్టుకోలేక కలెక్టర్లను బలిపశువులను చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు, అధికారులపై నెపం నెట్టడం ద్వారా తన బాధ్యత నుండి తప్పించుకోలేరని జగన్ స్పష్టం చేశారు.

Read More
Next Story