సోషల్‌ మీడియాలో పెడుతున్నది రాక్షస జాతి: డీఐజీ కోయా ప్రవీణ్‌
x

సోషల్‌ మీడియాలో పెడుతున్నది "రాక్షస జాతి": డీఐజీ కోయా ప్రవీణ్‌

వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియాలో పని చేస్తున్న వర్రా రవీందర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి వారు 45 మందిని గుర్తించారు.


మహిళలపై సభ్య సమాజం తలదించుకునేలా అసభ్యకర పోస్టులను పెట్టిన వారిని "రాక్షస జాతి"కి చెందిన వారిగా భావిస్తున్నట్లు కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్‌ తెలిపారు. సోషల్‌ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనితతో పాటు మరి కొందరిపై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో నిందితులు వర్రా రవీందర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్‌లను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్టుకు సంబంధించిన వివరాలను కడప ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడుతో కలిసి వివరించారు. నిందితులు వాడిన భాష అసభ్యకరంగా ఉందని, అరబ్‌ దేశాల్లో అయితే ఇందుకు తీవ్ర శిక్షలు ఉంటాయన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలపై దూషణలు ఈ పోస్టుల్లో ఉన్నాయన్నారు. వర్రా రవీంద్రర్‌రెడ్డి గతంలో భారీతీ సిమెంట్స్‌లో ఉద్యోగం చేశారని తెలిపారు. మరో ఇద్దరు వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియాలో పని చేస్తున్నారని తెలిపారు. డిజిటల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులను వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా వినియోగించుకుంటుందని, నిందితులు తమ వాంగ్మూలంలో వెల్లడించినట్లు తెలిపారు.

న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినట్లు తెలిపారు. మహిళలు, వారి పిల్లలపైన పోస్టులు పెట్టినట్లు చెప్పారు. ఇలాంటి పోస్టులు పెట్టిన వారిలో దాదాపు 45 మందిని గుర్తించామన్నారు. నిందితులను వివిధ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నాయకుల ఫొటోలు మార్ఫింగ్‌లు చేసి పోస్టులు పెట్టారన్నారు. నిందితులకు 40 యూట్యూబ్‌ చానల్స్‌ ఉన్నట్లు గుర్తించామన్నారు. వాటి ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్నారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయం నుంచి ఈ వ్యవహారమంతా నడిచినట్లు చెప్పారు. జిల్లా కన్వీనర్ల ఆధ్వర్యంలో వీరంతా పని చేసినట్లు తెలిపారు. తాడేపల్లిలోని పీవీఆర్‌ ఐకాన్‌ బిల్డింగ్‌ నుంచే ఈ వ్యవహారమంతా నడించిందన్నారు. అధికారంలో ఉన్న మహిళా నేతలను టార్గెట్‌లు చేస్తూ పోస్టులు పెట్టినట్లు చెప్పారు. నిందితులు ఇచ్చిన వాంగ్మూలాన్ని లోతుగా పరిశీలించాల్సి ఉందన్నారు. వారు పెట్టిన పోస్టులను సాధారణంగా చదవలేమన్నారు. సభ్యు సమాజం అసహ్యించుకునేలా పోస్టులున్నాయన్నారు. ఇలాంటి పోస్టులు పెట్టిన వారిని రాక్షస జాతిగా భావిస్తున్నామని ఎస్పీ చెప్పారు.

Read More
Next Story