అది బడ్జెట్‌ ప్రసంగం కాదు..లోకేష్‌ను పొగిడే కార్యక్రమం
x

అది బడ్జెట్‌ ప్రసంగం కాదు..లోకేష్‌ను పొగిడే కార్యక్రమం

కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు.


ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడానికి చేసిందేమీ లేదని, అందుకే నిందల పర్వం కొనసాగిస్తోందని, జగన్‌ విమర్శించడమే ప్రధాన పనిగా పెట్టుకుందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వంచన, మోసాలకు ప్రతిరూపంగా బడ్జెట్‌ను అభివర్ణించారు. అప్పుల గురించి బడ్జెట్‌లో చెప్పుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. పాలన చేతకాక ఏడాదిలోపే చంద్రబాబు చేతులెత్తేశారని దూయ్యబట్టారు. పేరుకే చంద్రబాబు అనుభవమని.. ప్రచారంలోనే విజనరీ అని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెచ్చుకోలేని అసమర్థుడు చంద్రబాబు అని మండిపడ్డారు.

అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని అన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ చంద్రబాబు వంచన మార్క్‌కు, మోసానికి ప్రతిబింబంగా ఉందని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఆధారపడిన పేద బలహీన వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ బడ్జెట్‌ కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన దూయ్యబట్టారు. సూపర్‌ సిక్స్‌ హామీల్లోని ఫ్రీ బస్, ఆడ బిడ్డ నిధి, నిరుద్యోగ భృతి పథకాలను పూర్తిగా విస్మరించారని అన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటాయించారని విమర్శలు గుప్పించారు. మోసానికి చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని పేర్కొన్నారు. హామీలు నమ్మి కూటమికి ఓటేసిన ప్రజలను చంద్రబాబు మరోసారి వంచించారని అన్నారు.
అధికారంలోకి రావడం కోసం సూపర్‌ సిక్స్‌ వాడుకున్నారే కానీ, అమలు చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించడం లేదన్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని అన్నారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చేది కాకుండా, రూ.20 వేల చొప్పున ఇస్తామని చెప్పి, ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో అప్పులపై అసత్యాలు ప్రచారం చేశారు. కానీ ఈనాడు బడ్జెట్‌లో అప్పుల గురించి వాస్తవాలు చెప్పడానికే భయపడిపోతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. మేనిఫెస్టోని వైఎస్‌ జగన్‌ భగవద్గీతగా, ఖురాన్‌గా, బైబిల్‌గా భావించి అమలు చేశారని అన్నారు.
ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు మాత్రం ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసగించారని ధ్వజమెత్తారు. కూటమి ఏడాది పాలనతోనే చంద్రబాబు, జగన్‌ పాలనల మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గ్రహించారని వెల్లడించారు. గ్రూప్‌–2 నిర్వణలో ప్రభుత్వం ఘోరంగా ఫెయిలైందన్నారు. నిరుద్యోగ యువత రోడ్డెక్కారు. వలంటీర్లను, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించారు. వారంతా నిరసన తెలుపుతున్నారని అన్నారు. మద్దతు ధర కోసం మిర్చి రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వాన్ని దించడానకి మహిళలు కూడా రోడ్డెక్కే రోజులు త్వరలోనే రాబోతున్నాయని జోస్యం చెప్పారు.
Read More
Next Story