
ఓటేయడం మన బాధ్యత
ఏపీలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్‌లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకున్నారు. ఉమ్మడి కృష్ణా–గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గం పరిధిలోని ఉండవల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో చంద్రబాబు, లోకేష్‌లు 284ఏ పోలింగ్ బూత్‌లో తమ ఓటును వేశారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఓటు వేయడం మన బాధ్యతని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యమని, ఇంతటి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఓ పెద్ద ఆయుధమన్నారు. భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యం చేయడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని, బాధ్యతగా ఓటు వేయాలని సూచించారు. ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఉమ్మడి కృష్ణా–గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ దాదాపు 40 మంది అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేయగా, అందులో 10 నామినేషన్‌లు తిరస్కరణకు గురయ్యాయి. తక్కిన 30 నామినేషన్‌లకు ఆమోదం తెలిపారు. వీటిల్లో 5 మంది అభ్యర్థులు తమ నామినేషన్‌లను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
అయితే కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్, సిట్టింగ్ ఎమ్మెల్సీ, పీడీఎఫ్ అభ్యర్థిగా కేఎస్ లక్ష్మణరావు పోటీలో ఉన్నారు. 25 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా.. వీరిద్దరి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఈ నియోజక వర్గంలో మొత్తం 63,114 మంది ఓటర్లు ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 19,306 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 11,330 మంది పురుషులు, 7,976 మంది స్త్రీలు ఉన్నారు. తక్కిన తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గంలో 26.04 శాతం పోలింగ్ నమోదు కాగా, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గంలో 57.71 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.