
విద్యుత్ ఛార్జీలు పెంచలేదనటం అవాస్తవం
టైం ఆఫ్ డే విధానాన్ని రద్దు చేయాలని కందారపు మురళి డిమాండ్ చేశారు.
విద్యుత్ ఛార్జీలు పెంచలేదని ఏపీఈఆర్సీ చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ చేసిన ప్రకటన సత్య దూరమైందని తిరుపతి జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను ఎడా పెడా పెంచేస్తూ వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపిందని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచలేదనటం అవాస్తవమని, టైం ఆఫ్ డే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
2025– 26వ సంవత్సరానికి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ డిస్కంలు సమర్పించిన ప్రతిపాదనలను అంగీకరించటం దారుణమైందని విమర్శించారు. విద్యుత్ చార్జీలు పెరగలేదని ఏపీఈఆర్సీ తరఫున చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ ప్రకటించారని, పేపరు మీద పెరుగుదల లేదని చెబుతూనే, టైం ఆఫ్ డే అనే కొత్త విధానాన్ని తీసుకొని వచ్చారని, పీక్ ఆవర్స్‌లో విద్యుత్తు వాడుకునే వారు అదనపు చార్జీలు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటివరకు పారిశ్రామిక అవసరాలకు ఈ విధానం ఉండేదని, ఇప్పుడు వాణిజ్య కనెక్షన్లపై కూడా దీనిని వర్తింపజేశారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గృహ అవసరాల వినియోగానికి కూడా ఈ విధానాన్ని వర్తింప చేస్తారని ఆయన ఆరోపించారు.
ఈ కారణంగా విద్యుత్ చార్జీల ప్రభావం ప్రజలపై పడుతుందని, పీకవర్స్‌లో విద్యుత్తు వినియోగం కారణంగా యూనిట్ కు రూ. 50 పైసల నుంచి రూపాయి వరకు పెరగడానికి అవకాశం ఉందన్నారు. వాణిజ్య కార్యకలాపాలపై విద్యుత్తు భారం పెంచడం వల్ల తిరిగి ప్రజల పైనా, వినియోగదారులపైన ఆ భారం పడుతుందన్నారు. ఈ కారణంగా ప్రజలు మరింత నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు తక్షణం టైమ్ ఆఫ్ డే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలపై భారాలు మోపని విధంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వం పారదర్శకత పాటించటం లేదని అన్నారు. ప్రభుత్వం చెబుతున్నది ఒకటి ఆచరణలో మరొక విధానం అనుసరిస్తుందని, దీనిని సిఐటియు తీవ్రంగా ఖండిస్తున్నదని కందారపు మురళి పేర్కొన్నారు.
Next Story